త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Anand | సైబ‌ర్‌ ఆర్థిక న‌ష్టాలు 20 శాతం త‌గ్గాయ్‌.. ఏఐ సైబర్ కాల్ సెంటర్ పనితీరు బాగుంది

DGP Anand | 2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20 శాతం తగ్గుదల నమోదైందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సైబర్ ఫిర్యాదులు 91,369కు పరిమితమవడంతో ఫిర్యాదుల్లో కూడా 3 శాతం తగ్గుదల నమోదైందన్నారు.

S

Telangana | Published On Jul 16, 2026, 7.10 pm IST

DGP Anand | సైబ‌ర్‌ ఆర్థిక న‌ష్టాలు 20 శాతం త‌గ్గాయ్‌.. ఏఐ సైబర్ కాల్ సెంటర్ పనితీరు బాగుంది
Advertisement
  • పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు సాంకేతిక‌త‌లో అప్‌డేట్ అవ్వాలి
  • ప్ర‌జ‌ల‌కు వేగ‌వంతంగా సేవ‌లందించాలి
  • దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి
  • తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరు స‌మీక్ష‌లో డీజీపీ సీవీ ఆనంద్ సూచ‌న

DGP Anand | త్రినేత్ర‌.న్యూస్‌: 2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20 శాతం తగ్గుదల నమోదైందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సైబర్ ఫిర్యాదులు 91,369కు పరిమితమవడంతో ఫిర్యాదుల్లో కూడా 3 శాతం తగ్గుదల నమోదైందన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై ఆయ‌న గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. "సైబర్ నేరాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్ పనితీరును పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌తో పాటు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాల తాజా ధోరణులు, దర్యాప్తు విధానాలు, ఏఐ వినియోగం, బాధితులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై డీజీపీకి వివరించారు.

అనంత‌రం డీజీపీ మాట్లాడారు. జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపులను ఒక్క క్షణంలో కోల్పోతున్నారు. భవిష్యత్‌లో నేరాల స్వరూపం ప్రధానంగా సైబర్ నేరాల చుట్టూనే తిరుగుతుంది. అందువల్ల ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించి, సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా సమాచారం చేరే విధానాన్ని బాగుంది. ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు AI ఆధారిత సేవలను విస్తరించాలి అని డీజీపీ సూచించారు.

ఆ రెండు విభాగాలు కీల‌కం..

తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట సందర్శించిన ప్రత్యేక విభాగాల్లో EAGLE ఒకటని, ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరును పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర భద్రతలో ఈ రెండు విభాగాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కొత్త ఆలోచనలు, కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక సాంకేతికత, డేటా అనలిటిక్స్ వినియోగిస్తూ ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న జాతీయ పనితీరు సూచికల్లో తెలంగాణ మరింత మెరుగైన స్థానం సాధించే అవకాశం ఉందని, అందుకు సాంకేతిక వ్యవస్థలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని చెప్పారు.

ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక బలగాల పునర్వ్యవస్థీకరణతో పాటు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక విభాగాల ఏర్పాటు జరుగుతోంది. అవసరమైతే మానవ వనరులను సమర్థంగా వినియోగించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను మరింత బలోపేతం చేయాలి. ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లు, డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడే వీటిని సమర్థంగా నియంత్రించకపోతే భవిష్యత్‌లో తీవ్ర సమస్యలు, పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది అని హెచ్చరించారు.

"సైబర్ నేరాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపులను ఒక్క క్షణంలో కోల్పోతున్నారు. భవిష్యత్‌లో నేరాల స్వరూపం ప్రధానంగా సైబర్ నేరాల చుట్టూనే తిరుగుతుంది. అందువల్ల ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించి, సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అని డీజీపీ సూచించారు.

తెలంగాణను సాంకేతికత ఆధారిత సైబర్ పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలి. వేగవంతమైన స్పందన, ప్రజల్లో విస్తృత అవగాహన, సమర్థవంతమైన దర్యాప్తు ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో అగ్రస్థానాన్ని నిలబెట్టాలి అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ ల్యాబ్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (SOC), సెంట్రల్ మానిటరింగ్ యూనిట్, సోషల్ మీడియా యూనిట్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, డిజిటల్ ఫోరెన్సిక్ యూనిట్ తదితర విభాగాలను సందర్శించి వాటి పనితీరు, సాంకేతిక సామర్థ్యాలు, దర్యాప్తు విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని అడిగి తెలుసుకున్నారు. నేరస్తుల ఖాతాల్లోని నిధులను నిలిపివేసే POH మొత్తం రూ.255 కోట్ల నుంచి రూ.279 కోట్లకు పెరగగా, POH శాతం 9 శాతం నుంచి 12 శాతానికి పెరగడం బాధితుల సొమ్ము రక్షణలో తెలంగాణ సాధించిన పురోగతికి నిదర్శనం అని అధికారులు వివరించారు.

ఏడు రెట్లు అధిక ఆర్థిక నష్టం..

2025లో రాష్ట్రంలో నమోదైన 86,177 ప్రధాన నేరాల FIRలలో 21,639 సైబర్ నేరాలకు సంబంధించినవే. అంటే ప్రతి నాలుగు ప్రధాన నేరాల FIRలలో ఒకటి సైబర్ నేరానిదే. ఇతర ప్రధాన నేరాల వల్ల రూ.207 కోట్ల ఆర్థిక నష్టం జరగగా, సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల నష్టం సంభవించింది. అంటే ఇతర ప్రధాన నేరాల కంటే దాదాపు ఏడు రెట్లు అధిక ఆర్థిక నష్టం సైబర్ నేరాల వల్లే జరుగుతోంది అని అధికారులు తెలిపారు.

రికవరీలో రికార్డు..

2025లో దేశవ్యాప్తంగా నమోదైన 49,620 సైబర్ FIRలలో తెలంగాణలోనే 21,639 FIRలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ FIRలలో 44 శాతం తెలంగాణ నుంచే నమోదయ్యాయి. దీంతో సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రూ.75 లక్షలకు పైగా నష్టం కలిగిన కేసుల్లో 78 శాతం, రూ.1 లక్షకు పైగా నష్టం ఉన్న కేసుల్లో 56 శాతం FIR కన్వర్షన్ రేటు నమోదు కావడం రాష్ట్ర పోలీసుల సమర్థవంతమైన చర్యలకు నిదర్శనం అని అధికారులు వివరించారు.

ప్రజలు సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో వెంటనే ఫిర్యాదు చేయాలి. OTPలు, పాస్‌వర్డ్స్‌, బ్యాంకు వివరాలు ఇతర ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో పంచుకోవద్దు అని పోలీసులు సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, ఎస్పీలు హర్షవర్ధన్, సాయిశ్రీ, డీఎస్పీలు, సీఐలు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement