త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | గ్రీన్ ఇండియా టూ IIM బెంగళూరు: క్లైమేట్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న జోగినిపల్లి సంతోష్ కుమార్

Green India Challenge | పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పోరాటంలో అగ్రగామిగా ఉన్న 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' (Green India Challenge) వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరో అరుదైన వేదికపై ప్రసంగించనున్నారు.

S

Telangana | Published On May 18, 2026, 6.20 pm IST

Green India Challenge | గ్రీన్ ఇండియా టూ IIM బెంగళూరు: క్లైమేట్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న జోగినిపల్లి సంతోష్ కుమార్
Advertisement

పర్యావరణ పరిరక్షణలో స్థానిక పాత్రపై కీలక ప్రసంగం

Green India Challenge | త్రినేత్ర‌.న్యూస్ : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పోరాటంలో అగ్రగామిగా ఉన్న 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' (Green India Challenge) వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరో అరుదైన వేదికపై ప్రసంగించనున్నారు. మే 28, 29 తేదీల్లో బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM Bangalore) క్యాంపస్‌లో జరగనున్న 'క్లైమేట్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026'లో ఆయన ముఖ్య అతిథుల్లో ఒకరిగా పాల్గొననున్నారు. 'సప్లై చైన్ మేనేజ్‌మెంట్ సెంటర్, IIM బెంగళూరు', అలాగే 'నెట్ జీరో థింక్' సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తున్నాయి. "వికసిత్ భారత్ 2047 కోసం భారతదేశ నెట్ జీరో (Net Zero) మార్గాలను వేగవంతం చేయడం" అనే ప్రధాన ఉద్దేశంతో ఈ సమ్మిట్ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై సంతోష్ కుమార్... “రిథింకింగ్ క్లైమేట్ ఫెడరలిజం: స్థానిక చర్యల కోసం విధానాలు, ఆచరణ, ఆవిష్కరణలను పునర్నిర్మించడం” అనే అంశంపై తన గళాన్ని వినిపించనున్నారు.

సంతోష్ కుమార్ ప్రసంగంలో ప్రధానంగా చర్చించనున్న అంశాలు

పర్యావరణ నిర్వహణలో స్థానిక కమ్యూనిటీల భాగస్వామ్యం.

గ్లోబల్ సౌత్ దేశాల పర్యావరణ పునరుద్ధరణ నమూనాలు.

ప్రజల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో చేపట్టే అటవీకరణ ఉద్యమాలు.

ప్రకృతి ఆధారిత క్లైమేట్ రెసిలియెన్స్ (Climate Resilience) వ్యూహాలు.

జాతీయ పర్యావరణ లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాలు, స్థానిక ప్రజల పాత్ర.

ఇటీవల లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్‌లో జరిగిన 'వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాంక్లేవ్'లో "గ్లోబల్ గ్రీన్ ఐకాన్" అవార్డును అందుకున్న సంతోష్ కుమార్, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న విషయం తెలిసిందే. 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరులను భాగస్వాములను చేసి, భారత్‌లోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

సదస్సులో పాల్గొననున్న ఇతర ప్రముఖులు

ఈ సదస్సులో ఆయనతో పాటు డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఇస్రో గగన్‌యాత్రి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, రాజీవ్ త్రిపాఠి, మనోజ్ కుమార్ సింగ్, విభా ధావన్, ఎరిక్ సోల్హీమ్ వంటి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లైమేట్ సొల్యూషన్స్, క్లైమేట్ ఫైనాన్స్ వంటి కీలక రంగాలపై వీరు లోతైన చర్చలు జరుపుతారు.

ఒక ప్రతినిధి, ఒక మొక్క

ఈ సమ్మిట్ లోని అత్యంత ఆకర్షణీయమైన, స్ఫూర్తిదాయకమైన అంశం.. సదస్సుకు హాజరయ్యే ప్రతి రిజిస్టర్డ్ ప్రతినిధి గౌరవార్థం ఒక మొక్కను నాటడం. కేవలం విధానపరమైన చర్చలకే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాలన్న నిర్వాహకుల చిత్తశుద్ధికి ఈ కార్యక్రమం ఒక అద్భుత నిదర్శనం.

సదస్సు నేపథ్యంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ ఏమన్నారంటే

"వాతావరణ మార్పులపై పోరాటం కేవలం ప్రభుత్వ విధాన పత్రాలు, అంతర్జాతీయ చర్చలకే పరిమితం కాకూడదు. స్థానిక ప్రజలను భాగస్వాములను చేయడం, క్షేత్రస్థాయిలో పర్యావరణ పాలనను బలోపేతం చేయడంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. స్థానిక చర్యలు ఎలా గ్లోబల్ ఇంపాక్ట్ సృష్టిస్తాయో ప్రపంచానికి చూపే అద్భుత అవకాశం ఇప్పుడు భారత్‌కు ఉంది."

వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలోనూ, దేశాన్ని 'నెట్ జీరో' దిశగా నడిపించడంలోనూ ఈ 'క్లైమేట్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026' ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

Advertisement
Advertisement