త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ

Medchal | ప్ర‌యివేటు వ్య‌క్తుల ఆధీనంలో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ కాంగ్రెస్ పెద్ద‌ల క‌న్నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్న భూ దందాలు మాత్రం హైడ్రా కంటికి క‌నిపించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. అందుకు ఈ ఉదంత‌మే నిద‌ర్శ‌నం.

S

Telangana | Published On Jun 6, 2026, 8.16 pm IST

Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ
Advertisement

ముఖ్యమంత్రి బంధువునంటూ
ప్రభుత్వ భూమిలో పాగా
100 కోట్ల విలువైన స్థలం
దక్కించుకునేందుకు తీవ్ర‌ యత్నం
ఇప్పటికే వెలసిన అనధికార నిర్మాణాలు

Medchal | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌యివేటు వ్య‌క్తుల ఆధీనంలో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ కాంగ్రెస్ పెద్ద‌ల క‌న్నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్న భూ దందాలు మాత్రం హైడ్రా కంటికి క‌నిపించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. అందుకు ఈ ఉదంత‌మే నిద‌ర్శ‌నం.

మేడ్చ‌ల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే.. అసైన్డ్ భూముల హౌజ్ క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్న‌ప్ప‌ట్నుంచే జిల్లా ప‌రిధిలో అనేక చోట్ల అక్ర‌మ మార్గంలో ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా పెట్టి రాజ్య‌మేలుతున్నాడు. ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలోనే వ‌రంగ‌ల్ హైవే ప‌క్క‌నే ఉన్న అత్యంత విలువైన ప్ర‌భుత్వ‌ భూమిని కాజేసేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ నాటి ప్ర‌భుత్వ పెద్ద అత‌ని క‌బ్జాల‌కు పుల్‌స్టాఫ్ పెట్టాడు. కానీ ఆయ‌నకు ఆ భూమి మీద‌నే క‌న్ను ప‌డింది. దీంతో ఏకంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక అధికారంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉండ‌డంతో.. సీఎం రేవంత్ రెడ్డికి తాను ద‌గ్గ‌రి బంధువునంటూ.. స్థానికంగా ప్ర‌చారం చేసుకుంటూ.. భూక‌బ్జాల‌కు తెర‌లేపాడు ఆ మాజీ ఎమ్మెల్యే. రేవంత్ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన ఏడాది స‌మ‌యంలోనే రూ. 100 కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేశాడు. ఈ క‌బ్జా భూమి భూ భార‌తి, ఐజీఆర్ఎస్ సైట్ల‌లో నిషేధిత జాబితాలో ఉంది. అయిన‌ప్ప‌టికీ మాజీ ఎమ్మెల్యే ఆక్ర‌మించిన భూమిలో స‌గం భూమిని(అర ఎక‌రం) రిజిస్ట్రేష‌న్ చేయించుకునేందుకు ప్ర‌ణాళిక ర‌చించాడు. నార‌ప‌ల్లి స‌బ్ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తెచ్చి మొత్తానికి ఆ స‌గం భూమిని త‌న పేర రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాడు స‌ద‌రు మాజీ ఎమ్మెల్యే.

క‌బ్జా చేసిన ఆ ప్ర‌భుత్వ భూమిలో ఎలాంటి అనుమ‌తుల్లేకుండానే.. స‌ద‌రు మాజీ ఎమ్మెల్యే షెడ్ల నిర్మాణం చేప‌ట్టాడు. విద్యుత్ మీట‌ర్ల‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయినా కూడా హైడ్రా, ఘ‌ట్‌కేస‌ర్ మున్సిప‌ల్ అధికారులు మాత్రం అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఆ అక్ర‌మ నిర్మాణాల జోలికి వెళ్ల‌లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స‌న్నిహితులు ఆ భూమి వెనుకాల ఉన్నార‌న్న ప్ర‌చారం ఉంది. దాంతోనే అధికారులు సైతం అటువైపు క‌న్నెత్తి చూడ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

నిషేధిత జాబితాలోనే రూ. 100 కోట్ల విలువైన భూమి..

మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పోచారం మున్సిప‌ల్ డివిజ‌న్ ప‌రిధిలోని కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 స‌ర్వే నెంబ‌ర్‌లో సుమారు 20.32 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. ఈ భూమి రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన‌దిగా రెవెన్యూ రికార్డుల్లో స్ప‌ష్టంగా న‌మోదైంది. అయితే వెంక‌టాద్రి టౌన్‌షిప్ పేరుతో.. 867 స‌ర్వే నెంబ‌ర్‌లో కొంత భూమిని ఆక్ర‌మించి వెంచ‌ర్ వేశారు. ఈ వెంచ‌ర్‌ను గుర్తించిన అధికారులు ఫైల్ నెంబ‌ర్ - బీ\530\2007 ప్ర‌కారం 867 స‌ర్వే నెంబ‌ర్‌లోని ప్ర‌భుత్వ భూమిపై ఎలాంటి క్ర‌య విక్ర‌యాలు చేయ‌వ‌ద్ద‌ని, 2008 ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన అప్ప‌టి ఘ‌ట్‌కేస‌ర్ మండ‌ల ఎమ్మార్వో ఉత్త‌ర్వులు జారీ చేశారు. నాటి నుంచి ఈ భూమిని ప్ర‌భుత్వ నిషేధిత జాబితాలో చేర్చారు. అంతేకాదు ధ‌ర‌ణి-2020, భూ భార‌తి-2025 రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం ఈ భూమి నేటికి ప్ర‌భుత్వ నిషేధిత (పీవోబీ-22ఏ) జాబితాలోనే ఉంది. ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా 22-ఏ వివరాల న‌మోదుపై హైకోర్టు ఆదేశాల మేర‌కు ఘ‌ట్‌కేస‌ర్ మండ‌ల త‌హ‌సీల్దార్‌, కీస‌ర ఆర్డీవో, మేడ్చ‌ల్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) ఇచ్చిన నివేదిక ప్ర‌కారం మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా క‌లెక్ట‌ర్ స‌ర్వే నెంబ‌ర్ 867లోని 20.32 ఎక‌రాల భూమి రాష్ట్ర ప్ర‌భుత్వానిదిగా పేర్కొంటూ నిషేధిత జాబితా (22-ఏ)లో చేర్చుతూ ప్ర‌భుత్వానికి తాజాగా నివేదిక అందించారు.

సెటిల్ చేసేందుకు వెళ్లి.. ఆ భూమిపై క‌న్నేసిన మాజీ ఎమ్మెల్యే

కొర్రెముల గ్రామ రెవెన్యూ ప‌రిధిలోని 870, 871, 872, 873, 875, 753, 853 స‌ర్వే నెంబ‌ర్ల‌లోని సుమారు 84.32 ఎక‌రాల భూమిలో వెంక‌టాద్రి టౌన్‌షిప్ నిర్మాణం చేశాడు ఓ రియ‌ల్ట‌ర్. ఈ భూముల ప‌క్క‌నే ఉన్న 867 స‌ర్వే నంబ‌ర్ భూముల‌పై కూడా స‌ద‌రు రియ‌ల్ట‌ర్ క‌న్నేశాడు. దాంతో ఈ స‌ర్వేనంబ‌ర్‌లోని 20.32 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో వ‌రంగ‌ల్ హైవేకు స‌మీపంలో ఉన్న భూమిని క‌బ్జా పెట్టాడు. ఈ క‌బ్జా వ్య‌వ‌హారాన్ని సెటిల్ చేసేందుకు అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్న వేళ‌.. నాటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఎంట్రీ అయ్యాడు. ఈ క‌బ్జా వ్య‌వ‌హారాల‌న్నీ నాటి సీఎం కేసీఆర్‌కు తెలియ‌డంతో.. సుధీర్ రెడ్డి పాచిక‌లు పార‌లేదు. కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డంతో సుధీర్ రెడ్డి మ‌రోమారు ఆ వ్య‌వ‌హారంలోకి త‌ల‌దూర్చ‌లేదు.

ఆ భూమిని ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీలోకి

ఆ ప్ర‌భుత్వ భూమిపై క‌న్నేసిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరాడు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నాడు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానే వ‌చ్చింది. ఇక సీఎంకు తాను అత్యంత ద‌గ్గ‌రి బంధువున‌ని ప్ర‌చారం చేసుకున్నాడు. ఇక 867 స‌ర్వే నంబ‌ర్‌లోని భూమిని సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టాడు. 867 స‌ర్వే నెంబ‌ర్‌లోని మొత్తం 20.32 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో చాలా వ‌ర‌కు వెంక‌టాద్రి టౌన్‌షిప్ ఆక్ర‌మ‌ణల‌కు పాల్ప‌డి ప్లాట్లుగా మార్చి క్ర‌య‌విక్ర‌యాలు చేస్తుండ‌గా, సుధీర్ రెడ్డి సైతం ఎక‌రం భూమిపై పాగా వేశాడు. ఎట్ట‌కేల‌కు వెంక‌టాద్రి టౌన్‌షిప్ రియ‌ల్ట‌ర్ వెంక‌టేశ్ ద్వారా 2025 మార్చి 22వ తేదీన నారప‌ల్లి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో డాక్యుమెంట్ నెంబ‌ర్‌ 2826\2025 ద్వారా 1930 చ‌ద‌ర‌పు గ‌జాల‌ ప్ర‌భుత్వ భూమిని సుధీర్ రెడ్డి త‌న పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాడు. ఆ త‌ర్వాత‌.. ఆక్ర‌మిత ప్ర‌భుత్వ భూమిలో క‌మర్షియ‌ల్ వ్య‌వ‌హారాల కోసం షెడ్ల‌ను ఏర్పాటు చేశాడు. విద్యుత్ మీట‌ర్ల‌ను ఏర్పాటు చేశాడు. దాంతో ప్ర‌భుత్వ భూమి.. కాస్తా అధికారికంగా సుధీర్ రెడ్డికి సొంత‌మ‌వుతోంది.

హైడ్రా, రెవెన్యూ అధికారుల తీరుపై ఫైర్

ప్ర‌భుత్వ భూమిని క‌బ్జాకు పాల్ప‌డిన సుధీర్ రెడ్డిపై హైడ్రా, రెవెన్యూ అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో స్థానికులు మండిప‌డుతున్నారు. 867 స‌ర్వే నంబ‌ర్‌లో వైన్ షాపు ఏర్పాటు చేస్తే నేల‌మ‌ట్టం చేసిన హైడ్రాకు సుధీర్ రెడ్డి షెడ్లు క‌నిపించ‌డం లేదా..? అని నిల‌దీస్తున్నారు. ఇప్ప‌టికైనా హైడ్రా, రెవెన్యూ అధికారులు సుధీర్ రెడ్డి భూ ఆక్ర‌మ‌ణ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారా..? లేక మాజీ ఎమ్మెల్యే తాయిలాల‌కు ఆశ‌ప‌డి గాలికి వ‌దిలేస్తారా..? అని చ‌ర్చించుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారంపై మాత్రం రెవెన్యూ అధికారులు స్పందించ‌డం లేదు.

Advertisement
Advertisement