త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fuel Supply Hike | పెట్రోల్ బంకుల వ‌ద్ద ర‌ద్దీ.. స‌ర‌ఫ‌రాను 126శాతం పెంచిన పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ‌..!

Fuel Supply Hike | రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఇంధన సరఫరాను 126 శాతం పెంచింది. బంకుల వద్ద రద్దీ, పొరుగు రాష్ట్రాల ప్రభావం, ధరలపై పుకార్లు కారణంగా డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు అవసరానికి తగినంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

P

Telangana | Published On Apr 28, 2026, 7.30 pm IST

Fuel Supply Hike | పెట్రోల్ బంకుల వ‌ద్ద ర‌ద్దీ.. స‌ర‌ఫ‌రాను 126శాతం పెంచిన పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ‌..!
Advertisement

Fuel Supply Hike | హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీ, ఆకస్మిక డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలంగాణ వ్యాప్తంగా ఇంధన సరఫరాను 126 శాతం పెంచింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంధన పంపిణీ పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పరిశ్రమలకు ఉపయోగించే డీజిల్ ధర ఇటీవల లీటరుకు రూ.150కు పెరగడంతో, తక్కువ ధరకు లభించే సాధారణ పెట్రోల్ బంకుల వైపు పెద్ద వినియోగదారులు మొగ్గుచూపారు. దీంతో బంకుల వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

స‌ర‌ఫ‌రా వేగ‌వంతం..

అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో సరఫరా సమస్యలు తలెత్తడంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ప్రజలు తెలంగాణ బంకులకు పెద్ద సంఖ్యలో రావడం కూడా డిమాండ్ పెరగడానికి కారణమైంది. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే అపోహలు కూడా ప్రజల్లో భయాన్ని కలిగించి, అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవడంతో పరిస్థితి మరింత ఒత్తిడిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఆయిల్ కంపెనీలకు తగిన నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,100 ట్యాంకర్లను వినియోగంలోకి తీసుకొచ్చి సరఫరాను వేగవంతం చేస్తున్నార‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ తెలిపింది.

నిల్వ‌ల‌పై స‌మీక్ష‌..

ప్రతి మూడు గంటలకు బంకుల నిల్వలపై పర్యవేక్షణ చేపట్టడంతో పాటు రోజువారీగా సమీక్షలు నిర్వ‌హిస్తున్నార‌ని, రైతులకు ఇబ్బంది లేకుండా పంట కోతలు, కొనుగోలు ప్రక్రియ కొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సరఫరా పెంపు తర్వాత గణనీయమైన మార్పులు వ‌చ్చాయ‌ని వివ‌రించింది. డీజిల్ స‌ర‌ఫ‌రా 151 శాతం పెరిగి 18,449 కిలో లీటర్లకు చేర‌గా.. పెట్రోల్ సరఫరా దాదాపు రెట్టింపు స్థాయిలో 11,490 కిలో లీటర్లకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను 43 శాతం పెంచారు. డీజిల్, పెట్రోల్ నిల్వలు వరుసగా 46 శాతం, 40 శాతం మేర పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు పుకార్లను నమ్మకుండా అవ‌స‌ర‌మున్న మేర‌కు ఇంధ‌నాన్ని కొనుగోలు చేయాల‌ని పౌర సరఫరాల శాఖ విజ్ఞ‌ప్తి చేసింది.

Advertisement
Advertisement