త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్‌

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా ముఖ్య‌మంత్రి రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పాడ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలమూరు పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో జరిగిన పనులపై చేసిన ఆరోపణలను ఖండించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ హయాంలో రూ.35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వందల కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంటూ ప్ర‌శ్నించారు.

P

Telangana | Published On Jun 5, 2026, 6.30 pm IST

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్‌
Advertisement

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా ముఖ్య‌మంత్రి రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పాడ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలమూరు పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో జరిగిన పనులపై చేసిన ఆరోపణలను ఖండించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ హయాంలో రూ.35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వందల కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంటూ ప్ర‌శ్నించారు. రూ.27వేలకోట్లు ఖర్చు చేశారని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నాడన్నారు. రూ. 52,121 కోట్లు సాగు నీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు వడ్డీ, అసలు కింద చెల్లించామని చెబుతున్న రేవంత్ రెడ్డి.. దమ్ముంటే దానికి సంబంధించిన వివరాలు విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఒక టీఎంసీకి వరి వేస్తే 6వేల ఎకరాలు, ఒక టీఎంసీకి వేరుశనగ, మిర్చి, ఉద్యాన పంటలు, మొక్కజొన్న పంటలు వేస్తే పదివేల ఎకరాలు, డ్రిప్, స్ప్రింక్లర్ ఉపయోగించి పంటలు పండిస్తే 15 వేల ఎకరాలుగా లెక్క క‌డ‌తార‌న్నారు. పాలమూరు పర్యటనలో మీడియా ప్రశ్నకు టీఎంసీ అంటే గతంలో పదివేల ఎకరాలుగా, ఇప్పుడు 15 వేల ఎకరాలుగా లెక్క కడుతున్నారని చెప్పడం మరో పచ్చి అబద్ధమ‌న్నారు.

తెలంగాణ శాశ్వ‌త నీటిహ‌క్కులు కోల్పోయేది..

ఇదే మాట కేంద్ర జలసంఘం సమావేశాల్లో చెబితే పరువు పోవడమే కాకుండా, టీఎంసీకి 15 వేల ఎకరాలు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుంద‌న్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాల లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం డ్రిప్పులు, స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాల్సి వ‌స్తుంద‌న్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాల్వల టెండర్లు రద్దు చేయడం కారణంగా ఇప్పుడు రూ.4 వేల కోట్ల భారం పెరగడం నిజం కాదా? అంటూ ప్ర‌శ్నించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ పాలనలోనే కాదా?... కమీషన్ల కోసమే పంపులు, లిఫ్టులు పూర్తి చేశారని రేవంత్ చెప్పడం ఆయన అజ్ఞానానికి, అవగాహనా రాహిత్యానికి నిదర్శన‌మ‌న్నారు. ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు, లిఫ్టు పనులే .. ఈ మాత్రం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడాడ‌ని.. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, భీమా తదితర పథకాల్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని కాలువలు తవ్వి పంపులు, లిఫ్టు పనులను గాలికి వదిలేసి వెళ్లిపోయార‌ని ఆరోపించారు. ఇప్పటికీ అప్పటి పనులు రద్దు చేయలేని, కొనసాగించలేని పరిస్థితి నెలకొన్నద‌న్నారు.

బీఆర్ఎస్ పూర్తి చేసింది వాస్తవం కాదా?

2006లో కాంగ్రెస్ వదిలేసిన కేఎల్ఐ ఎత్తిపోతల పనులను 2016లో బీఆర్ఎస్ పూర్తి చేసింది వాస్తవం కాదా? ప‌ఆలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం 27,100 ఎకరాల భూసేకరణకు గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే సేకరించడం జరిగింద‌ని తెలిపారు. భూసేకరణలో మిగిలింది 300 ఎకరాలు మాత్రమేన‌ని, భూసేకరణ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేట‌న్నారు. ఆర్టీఐలో ఆరితేరిన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు దరఖాస్తు చేసి వివరాలు తెప్పించుకోవాల‌ని, కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన మొబిలైజేషన్ అడ్వాన్సుల వ్యవస్థను రద్దు చేసింది కేసీఆర్ హయాంలోనేన‌ని.. దాని స్థానంలో చేసిన పనులకు బిల్లులు చేసే పద్ధతి తీసుకువ‌చ్చార‌న్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి 30 నెలల్లో ప్రాజెక్టుల పూర్తి చేసింది ఏంటి? నిల‌దీశారు. 30 నెలల్లో మూడు లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంద‌న్నారు.

అప్పులు కాగ్ నివేదికతో స్ప‌ష్టం

తెలంగాణ అప్పుల గురించి రేవంత్ రెడ్డి రెండేళ్లుగా చెబుతున్న అబద్ధాలను కాగ్ నివేదిక స్పష్టం చేసింద‌న్నారు. 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టుల్లో తట్ట మట్టి ఎత్తకుండా తీరిగ్గా పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పాత అబద్ధాలనే వల్లె వేశాడని, 30 నెలల్లో రేవంత్ రెడ్డి ఏం పనులు చేశాడని బీఆర్ఎస్ అడ్డుకున్నది. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నద‌న్నారు. పాలమూరు పర్యటనలో ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్రం వెనక్కి పంపిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటూ నిల‌దీశారు. సీఎం స్థాయిని మరచి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనలో అబద్ధాలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని, వలసల పాలమూరులో సాగునీరు పారించి, వలసల జిల్లాకే వలసలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్‌దేన‌న్నారు. అబద్ధానికి అంగీ, లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి అని.. ప్రాజెక్టుల మీద, పాలమూరు మీద ఆయనకున్న అవగాహన శూన్యమ‌న్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాలకు కాలం చెల్లింది.. మిగిలిన పదవీకాలం అయినా నిజాలు మాట్లాడితే బాగుంటుందద‌ని, ఈ అబద్ధాలు చెప్పడానికి రెండు రోజుల పర్యటన ఎందుకు? హైదరాబాద్ లోనే ఇదే స్క్రిప్టు చదివితే ప్రజలకు కొంచెం భారమైనా తగ్గేద‌ని చుర‌క‌లంటించారు.

Advertisement
Advertisement