త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Legislator Sports Meet Telangana | క్రీడా మైదానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: మార్చి 28, 29 తేదీల్లో ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్’

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాప్రతినిధుల కోసం 'లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్-2026' పేరిట క్రీడా పోటీలు జరగనున్నాయి. మార్చి 28, 29 తేదీల్లో ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ పోటీల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ క్రీడోత్సవ ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు.

J

Telangana | Published On Mar 26, 2026, 7.45 pm IST

Legislator Sports Meet Telangana | క్రీడా మైదానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: మార్చి 28, 29 తేదీల్లో ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్’
Advertisement

Legislator Sports Meet Telangana | త్రినేత్ర.న్యూస్ : నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యల పరిష్కారంతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు క్రీడా మైదానంలో సందడి చేయనున్నారు. రాష్ట్ర ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. 'మొదటి ఎడిషన్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026' పేరుతో మార్చి 28, 29 తేదీల్లో ఈ క్రీడోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఈ క్రీడా వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ లెజిస్లేచర్ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కో-చైర్మన్ అండ్ క్రీడలు-యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఎల్బీ స్టేడియంలో క్రీడలు.. రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రజాప్రతినిధుల కోసం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం విశేషమన్నారు. ఈ క్రీడలు నిత్యం ఒత్తిడితో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని, అలాగే యువతకు, ప్రజలకు క్రీడలపై ఆసక్తిని పెంచుతాయని వారు పేర్కొన్నారు.

తేదీ, సమయం: మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్బీ (LB) స్టేడియంలో ఈ క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి.

ముఖ్య అతిథులు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఉభయ సభల సభ్యులందరూ (MLAs, MLCs) ఈ క్రీడా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

నిర్వహణ: శాసనసభ సచివాలయం, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (SATS), భాషా సాంస్కృతిక శాఖల సమన్వయంతో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు: క్రీడలతో పాటే రవీంద్రభారతిలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో శాసనమండలి విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్, యశస్విని రెడ్డి, పాల్వాయి హరీష్ రావు, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్ రావు, భాను ప్రసాద్ రావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, శాసనమండలి కార్యదర్శి నరసింహచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement