త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Crop Procurement | ఇది ‘పేపర్‌లెస్’ కాదు.. ‘ఫెయిత్‌లెస్’ క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!

కేంద్రం కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామన్న క్యాబినెట్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ఫెయిత్‌లెస్ క్యాబినెట్ అంటూ ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On Jun 18, 2026, 8.00 pm IST

Telangana Crop Procurement | ఇది ‘పేపర్‌లెస్’ కాదు.. ‘ఫెయిత్‌లెస్’ క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!
Advertisement
  • కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం
  • ఇది 'పేపర్‌లెస్' క్యాబినెట్ కాదని, రైతులను నిలువునా మోసం చేసిన 'ఫెయిత్‌లెస్' (విశ్వాసఘాతక) క్యాబినెట్ అని తీవ్ర విమర్శలు
  • కేవలం రైతులకు ఇచ్చే రూ.500 బోనస్ ఎగ్గొట్టేందుకే 7 రకాల సన్నాల నిబంధన తీసుకొచ్చారని ఆరోపణ
  • రైతు భరోసా (Rythu Bharosa) సాయం పంపిణీకి బహిరంగ సభలు, ఆర్భాటాలు దేనికంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

Telangana Crop Procurement | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ (Telangana Cabinet) తీసుకున్న తాజా నిర్ణయాలపై వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ రైతులను నిలువునా మోసం చేస్తోందని, ఇది 'పేపర్‌లెస్' క్యాబినెట్ కాదని.. రైతుల నమ్మకాన్ని వమ్ము చేసిన 'ఫెయిత్‌లెస్' (Faithless) క్యాబినెట్ అని ఆయన ఓ ప్రకటనలో ఘాటుగా విమర్శించారు.

పంటల కొనుగోళ్లలో చేతులెత్తేశారు

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా (Quota) ప్రకారమే రాష్ట్రంలో పంటలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర క్యాబినెట్ ప్రకటించడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకుంటోందని, రైతాంగానికి కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 'రాష్ట్ర ప్రభుత్వానికి వంద శాతం పంటలు కొనడం చేతకాదా?' అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం అయ్యాక కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు ఎందుకు కోస్తున్నారని నిలదీశారు.

రైతు భరోసాకు ఆర్భాటాలెందుకు?

రైతు భరోసా (Rythu Bharosa) నిధులు ఖాతాల్లో వేసేందుకు పబ్లిక్ మీటింగ్స్ (Public meetings) పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. గత కేసీఆర్ (KCR) ప్రభుత్వ హయాంలో ఎలాంటి షోలు చేయకుండానే 11 విడతల్లో రూ.72 వేల కోట్లను నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు.

రూ.500 బోనస్ ఎగ్గొట్టేందుకే ఆ ఆంక్షలు

ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్న వడ్లు (Fine rice) సాగు చేస్తే రైతులకు ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గి భారీ నష్టం వస్తుందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ (Bonus) ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు పెడుతోందని ఆరోపించారు.

కరెంట్ సరఫరా, రుణమాఫీ (Loan waiver), రైతుబీమా అమలులో చేతులెత్తేసిన ఈ ప్రభుత్వానికి.. పాలనపై ఎలాంటి విజన్ (Vision) లేదని విమర్శించారు. గుడ్డెద్దు చేలో పడ్డట్లు పాలన సాగుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాలు మోసపోయాయన్న ఆయన.. క్యాబినెట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతుల పంటను వంద శాతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement