త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinod Kumar | స్పీక‌ర్ తీర్పుపై హైకోర్టులో పిటిష‌న్ : మాజీ ఎంపీ వినోద్ కుమార్

Vinod Kumar | పార్టీ ఫిరాయింపుల విష‌యంలో రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌బోతున్నామ‌ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.

S

Telangana | Published On Mar 13, 2026, 5.50 pm IST

Vinod Kumar | స్పీక‌ర్ తీర్పుపై హైకోర్టులో పిటిష‌న్ : మాజీ ఎంపీ వినోద్ కుమార్
Advertisement

Vinod Kumar | త్రినేత్ర‌.న్యూస్ : పార్టీ ఫిరాయింపుల విష‌యంలో రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌బోతున్నామ‌ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమ భ‌ర‌త్ కుమార్, పార్టీ లీగ‌ల్ సెల్ ప్ర‌తినిధి ల‌లితా రెడ్డితో క‌లిసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ప‌ది మంది ఎమ్మెల్యే విష‌యంలో స్పీక‌ర్ తీర్పు ఇచ్చారు.. ఇక కేసును క్లోజ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ తీర్పు కాపీలు ఇవ్వడం లేదని మా తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 48 గంటల్లో తీర్పు కాపీలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్పీకర్ తీర్పు కాపీల కోసం ఎదురు చూస్తున్నాం. మేం రెండేండ్ల క్రితం పిటిషన్ వేస్తే స్పీకర్ ఇప్పుడు తీర్పు ఇచ్చారని మాజీ ఎంపీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని రేవంత్ రెడ్డి చంపేశారు..

ఫిరాయింపు నిరోధక చట్టం అనేది 53వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ హయాంలో 1985లో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పెట్టారు. ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. 1/3 వంతు సభ్యులు వేరే పార్టీలోకి వెళ్తే వారిపై అనర్హత వేటు ఉండదని చట్టంలో పెట్టారు. 2003లో వాజ‌పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2/3 వ వంతు సభ్యులు పార్టీ మారితే వారిపై అనర్హత వేటు ఉండదని చట్టం చేశారు. రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని రేవంత్ రెడ్డి చంపేశారు. దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ తిరుగుతున్నారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తీర్పు చెప్పినా రాహుల్ స్పందించడం లేదు అని వినోద్ కుమార్ మండిప‌డ్డారు.

స్పీకర్ పదవికి కళంకం

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. జాతీయ జెండాను అపహాస్యం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండా కప్పితే అది జాతీయ జెండా అని అన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరిపై అనర్హత వేటు పడుతుందని అందరూ భావించారు. ఉప ఎన్నికలు వస్తే గెలవలేరని దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ అఫిడవిట్ ఫైల్ చేసి కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేశారు. ఒక వ్యక్తి ఒకే సారి రెండు, మూడు పార్టీల నుంచి పోటీ చేయవచ్చా అనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలి. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ బీఫామ్‌పై లోక్ సభకు పోటీ చేస్తే పార్టీ మారలేదని ఎట్లా చెప్తారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చారు అని వినోద్ కుమార్ నిప్పులు చెరిగారు.

కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలి..

ప్రజలు వీళ్లకు బుద్ది చెప్పడం ఖాయం. ఎమర్జెన్సీ పెట్టినందుకు ఇందిరాగాంధీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఓడించారు. రాజ్యాంగం పట్టుకుని తిరగడానికి రాహుల్ గాంధీ అనర్హుడు. దీనిపై రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు. స్పీకర్ తీర్పును కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం. ఒక వ్యక్తి ఒకే స్థానం నుంచి మూడు పార్టీల నుంచి పోటీ చేయవచ్చా...? సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలిచి బీఎస్పీలో చేరితే యూపీలో ఎమ్మెల్యేపై వేటు వేశారు అని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

Advertisement
Advertisement