Congress Party | కట్టు తప్పింది.. కుంపటి రగిలింది
Congress Party | అధికారంలోకి వచ్చి మూడేళ్లు నిండకుండానే కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల మధ్య అహం పెరిగింది. సఖ్యత కొరవడింది. క్రమశిక్షణ కట్టు తప్పింది. అన్ని జిల్లాల్లో అంతర్గత పోరు మొదలైంది. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టర్లకు బిల్లుల విడుదల, నిధుల మంజూరులో వివక్ష వంటి కారణాలు నేతల మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో తప్పిన క్రమశిక్షణ
పెరిగిపోతున్న అంతర్గత పోరు
శ్రీధర్ బాబు వర్సెస్ గడ్డం వంశీకృష్ణ
ఉత్తమ్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి
దామోదర వర్సెస్ లక్ష్మీకాంత రావు
గడ్డం వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ రావు
రేవంత్ వర్సెస్ చిన్నారెడ్డి, సురేఖ
గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్‌లో వేం నరేందర్ రెడ్డి వర్సెస్ పాత కాంగ్రెస్
గవర్నమెంట్ వర్సెస్ అనిరుధ్ రెడ్డి
డిండి కి నీళ్ల తరలింపుపై మంత్రి జూపల్లి కుతకుత
చిచ్చుకు కారణమవుతున్న
నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు
Congress Party | త్రినేత్ర న్యూస్ : అధికారంలోకి వచ్చి మూడేళ్లు నిండకుండానే కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల మధ్య అహం పెరిగింది. సఖ్యత కొరవడింది. క్రమశిక్షణ కట్టు తప్పింది. అన్ని జిల్లాల్లో అంతర్గత పోరు మొదలైంది. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టర్లకు బిల్లుల విడుదల, నిధుల మంజూరులో వివక్ష వంటి కారణాలు నేతల మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి.
రూంలో వేసి చితగ్గొడతా
మంత్రి దామోదర రాజనర్సింహ తీరుపై జుక్కల్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అనరాని మాటలన్నీ అన్నాడని.. తోటి ఎమ్మెల్యేల సమక్షంలో అవమానించాడని సోమవారం మీడియాకు చెప్పుకొని వాపోయారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఇండియా బ్లాక్ ర్యాలీలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఓ కార్పొరేట్ హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ కాంతరావు, దామోదరల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం. "నిన్ను బొందపెడతా. ఏమనుకుంటున్నవో. నాకు తెల్వకుండనే డీసీసీ పదవులు ఇస్తున్నవంట కదా. నువ్వు ఎవడికంటే వాడికి ఇప్పిస్తవా? నువ్వేమన్న పెద్ద సుల్తాన్‌వి అనుకున్నవా. రూంలో వేసి చితకబాదుతా" అని మంత్రి దామోదర రాజనర్సింహ తనను దూషించినట్టు లక్ష్మీకాంత్ రావును దూషించారు. కాగా ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
వీళ్ల సస్పెన్షన్ ఓకే.. మరి వాళ్లను చేయరా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మంత్రి శ్రీధర్ బాబుకు ఎంపీ వంశీ రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల మంథనిలోని కొయ్యూరు ప్రభుత్వ పాఠశాలలో కాకా వెంకటస్వామి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఓ గిరిజన మహిళా ప్రతినిధి, మరికొంత మంది కార్యకర్తలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా కార్యవర్గం... ఆ గిరిజన మహిళకు కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. దీనిపై ఎంపీ గడ్డం వంశీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో ఆదివారం ఇండియా బ్లాక్ నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, విజయరమణా రావు హాజరు కాలేదు. పైగా ఆదివారం రోజు మంత్రి శ్రీధర్ బాబు మంథనిలో గణపతి సచ్చిదానంత స్వామీజీని ఆహ్వానించి ప్రైవేట్ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని తప్పుబడుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఓ బహిరంగ లేఖ రాయడం గమనార్హం. మరోవైపు మంచిర్యాల జిల్లాలో మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుల మధ్య తీవ్ర వర్గపోరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో (కార్మిక, గనుల శాఖ) చోటు దక్కింది. అయితే, సీనియర్ అయినప్పటికీ తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివేక్ మంత్రి అయినప్పటి నుండి జిల్లా రాజకీయాల్లో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము పార్టీని కాపాడుకుంటే, మధ్యలో వచ్చిన వారికి అప్పనంగా పదవులు దక్కాయని ప్రేమ్ సాగర్ రావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సద్దుల బతుకమ్మ పండుగ సమయంలో దండపల్లి మండలంలో ఇరు వర్గాల అనుచరుల మధ్య ఫ్లెక్సీల వివాదం రేగి, అది కాస్తా భౌతిక దాడులకు దారితీసింది.
నేను వాళ్ల కంటే వంద రెట్లు గొప్ప
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇటీవలి కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు స్థాయిలో అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ విధేయుడిగా తనకు తగిన గౌరవం దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. "అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా నిధులు అడగాల్సి వస్తుంది. నిధులన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతున్నాడు. నేను సీఎం, మంత్రి కాకపోవచ్చు కానీ గుణంలో వాళ్లకంటే వంద రెట్లు గొప్ప. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మంత్రి అయ్యా? ఆయన హుజూర్ నగర్‌కు మంత్రా లేదా తెలంగాణకు మంత్రా? మొత్తం నిధులన్నీ కోదాడ, హుజూర్ నగర్‌కే తీసుకుపోతున్నాడు"అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాగా ఇదే జిల్లా నుంచి సీనియర్ నాయకుడైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య అనేక విషయాల్లో చాలా కాలంగా ఉన్న మనస్పర్థలు కొనసాగుతూ వస్తున్నాయి.
మంత్రులకేనా నిధులు? మాకివ్వరా?
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఏకంగా ప్రభుత్వంపైనే తిరుగుబాటు స్థాయిలో విమర్శలు చేయడంతో పార్టీ వర్గాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. తన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధులు, పెండింగ్ బిల్లులు విడుదల చేయడం లేదంటూ అనిరుధ్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారు. సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. నిధులు ఇవ్వకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా. నేను చనిపోతేనే బిల్లులు ఇస్తారా?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కేవలం జడ్చర్ల నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా నిధుల కొరత ఉందని స్పష్టం చేశారు. సొంత ప్రభుత్వంపైనే ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి అప్పగిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇటీవల గజ్వేల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో అనిరుధ్ రెడ్డి వేదికను పంచుకోవడంపై సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల పాయింట్ నుంచి డిండికి రోజూ 0.6 టీఎంసీలు తరలించాలంటూ సీఎం స్థాయిలో తీసుకున్ననిర్ణయంపై మంత్రి జూపల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో పాటు సహచర పాలమూరు ఎమ్మెల్యేలు కూడా లోలోపల రగిలిపోతున్నారు.
సీఎం వర్సెస్ సురేఖ, చిన్నారెడ్డి
సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేకంగా వ్యవహరించినందుకు పార్టీలోనే సీనియర్ లీడర్ చిన్నారెడ్డి, మంత్రి కొండా సురేఖలపై వేటు వేయించారు మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు లేఖ రాశారు. స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ (మంత్రి హోదా కలిగిన పదవి) గా ఉన్న సీనియర్ నేత జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారం ముగిసిపోయినప్పటికీ ఆ పరిణామంతో కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ అంటూ పార్టీ నిలువునా చీలిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎంపీ వేం నరేందర్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆయన తమను అసలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఆయన తన పాత టీడీపీ శ్రేణులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకున్నపాపాన పోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చర్యలతో వేటువేస్తారా? చర్చలతో ఉపశమింపజేస్తారా?
కాంగ్రెస్ పార్టీలో ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య స్పష్టమైన విభజన చోటు చేసుకున్నదన్న విషయం స్పష్టంగా కనబడుతున్నది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీకి అనేక లేఖలు అందుతున్నాయి. అయితే పార్టీలో రానురాను అసమ్మతి స్వరంరి పెగిపోతున్న నేపథ్యంలో వేటు వేసే స్థాయిలో చర్యలు తీసుకుంటారా? లేక నాయకుల మధ్య చర్చలు జరిపి శాంతింపజేస్తారా? అనేది ఇప్పుడు పీసీసీ ముందున్న అతి పెద్ద సవాలు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం
- ●GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం
- ●SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!
- ●NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!
- ●Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన
- ●Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం

IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం

GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం

SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!

NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!





