త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Reservations | బీసీలంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.. రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగిన తలసాని

BC Reservations | బీసీ ఉద్యమానికి మద్దతుగా గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వ‌ర్ ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద‌వ్‌, శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరామర్శించారు.

A

Telangana | Published On Dec 5, 2025, 7.49 am IST

BC Reservations | బీసీలంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.. రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగిన తలసాని
Advertisement

గాంధీ ఆస్పత్రిలో సాయి ఈశ్వ‌ర్ ను పరామర్శించిన మాజీ మంత్రులు

BC Reservations | బీసీ ఉద్యమానికి మద్దతుగా గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వ‌ర్ ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద‌వ్‌, శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ సాయి ఈశ్వర్ భార్య, పిల్లలు, తల్లి ఎంతో తల్లడిల్లుతున్నారని అన్నారు. 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రి బెడ్ పై అవస్థ పడుతున్నారని చెప్పారు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ‌ హత్యగానే భావిస్తున్నామన్నారు. తక్షణమే సాయిఈశ్వర్ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. అసలు 42 శాతం రిజర్వేషన్లను ఎవరు అడిగారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆశ చూపి, గద్దెనెక్కిన తరువాత బీసీలపై కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఐక్యంగా పోరాడి ప్రభుత్వం మెడలు వంచుదాం

ప్రభుత్వ వైఖరి కారణంగానే బలిదానాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఘటనలు మీడియాకు సైతం కనిపించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి బీసీ యువత ఆవేశానికి లోనై బలిదానాలు చేసుకోకూడదని కోరారు. తామంతా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఐక్యతతో ముందుకెళ్లి సాధించుకుందామని సూచించారు. రెండు కోట్ల జనాభా ఉన్న బీసీలు ఒక్కటిగా నిలిచి, పోరాడి, ప్రభుత్వం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆరోపించారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకూడదని కోరుతుండగా, మరోవైపు కాంగ్రెస్ నాయకులు తమ నియోజకవర్గాల్లో నయానో భయానో ఏకగ్రీవాలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు వెదజల్లి, పోలీసులతో బెదిరించి, కిడ్నాప్ లు చేసి ఏకగ్రీవాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొడంగల్ నియోజకవర్గంలో 28 పంచాయితీలకు గాను 25 ఏకగ్రీవం ఎలా అవుతాయని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాలో రవీందర్ అనే వ్యక్తి భార్య నామినేషన్ వేస్తే నాలుగైదు రోజుల నుంచి ఒత్తిడికి గురిచేస్తే గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో సర్పంచ్ అభ్యర్థి భర్తను ఎత్తుకెళ్లి మూత్రం తాగించిన ఘటన చోటు చేసుకుందని గుర్తు చేశారు. బీసీలపై అరాచకాలకు దిగుతున్నారని వాపోయారు. గ్రామాలలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. ఇన్ని జరుగుతున్నా ముఖ్యమంత్రికి, ఎన్నికల సంఘానికి, పోలీసులకు కనిపించకపోవడం శోచనీయమని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement