త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తెలంగాణ నీటి హ‌క్కుల‌ను ర‌క్షించండి.. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రికి హ‌రీశ్‌రావు లేఖ‌

Harish Rao | గోదావ‌రి బేసిన్‌లోని తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమ‌తుల‌పై మ‌ళ్లీ స‌మీక్షించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. కాళేశ్వ‌రం, సీతారామ స‌హా ఏడు ప్రాజెక్టుల‌ను ర‌ద్దు చేయాల‌ని జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడాన్ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

S

Telangana | Published On Aug 7, 2026, 4.31 pm IST

Harish Rao | తెలంగాణ నీటి హ‌క్కుల‌ను ర‌క్షించండి.. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రికి హ‌రీశ్‌రావు లేఖ‌
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు పొందిన తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని GRMB సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జలశక్తి మంత్రికి, సెక్రటరీకి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు లేఖ రాశారు. కేంద్రం ఇప్పటికే చట్టబద్ధంగా ఇచ్చిన అనుమతులను GRMB సమీక్షించడం సరికాదని, అజెండాలో పేర్కొన్న అంశాలను ఉపసంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర న్యాయమైన నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 85 కింద తక్షణమే జోక్యం చేసుకోవాలని హరీష్ రావు సుదీర్ఘ లేఖ రాశారు.

లేఖలోని ముఖ్యాంశాలు..

  • గోదావరి నదీ యాజమాన్య బోర్డు GRMB జరగబోయే 18వ సమావేశం ఎజెండాలో పొందుపరిచిన 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆ బోర్డును ఆదేశించాలని లేఖలో హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
  • తెలంగాణలోని పలు భారీ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన చట్టబద్ధమైన అనుమతులను మళ్లీ సమీక్షించేలా ఈ ఎజెండాను రూపొందించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
  • ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అత్యున్నత సంస్థల అధికారాలు, వాటి విశ్వసనీయతకు సంబంధించిన సున్నితమైన అంశమని హరీశ్ రావు స్పష్టం చేశారు.
  • ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, హైడ్రోలాజికల్, ఇంజనీరింగ్, పర్యావరణ, చట్టపరమైన అంశాలను కేంద్ర జల సంఘం CWC, జలశక్తి మంత్రిత్వ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆమోదం తెలిపిందని ఆయన గుర్తుచేశారు.
  • కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థలు చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చిన తర్వాత, ఆ నిర్ణయాలను మళ్లీ సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం గోదావరి బోర్డు లాంటి కింది స్థాయి సంస్థకు ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు.
  • జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మళ్లీ సమీక్షించేందుకు జీఆర్ఎంబీకి అవకాశం ఇస్తే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యతను తగ్గించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
  • తెలంగాణలోని కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి, ముక్తేశ్వరం, చనాక-కొరట, మోడికుంటవాగు, కడెం-గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాతే అనుమతులు వచ్చాయని, ఇప్పుడు వాటిని మళ్లీ సమీక్షించాలని ఎజెండాలో పెట్టడం సరికాదని పేర్కొన్నారు.
  • సీడబ్ల్యూసీ ఇప్పటికే ఈ ప్రాజెక్టుల అంశాలను లోతుగా పరిశీలించినందున, పరోక్ష పద్ధతుల ద్వారా వీటిని మళ్లీ తెరపైకి తీసుకురావడం సబబు కాదన్నారు.
  • గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ విషయాలు స్పష్టమయ్యాయని గుర్తుచేశారు.
  • బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల అవసరాలు తీరిన తర్వాతే, ఇంటర్-బేసిన్ కు నీటి మళ్లింపు జరగాలని ఆ సమావేశంలో రికార్డు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
  • ఇదే క్రమంలో, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఇప్పటికే హైడ్రోలాజికల్ అనుమతులు పొందిన సమ్మక్క సాగర్ ఎత్తిపోతల పథకానికి మిగిలిన చట్టబద్ధమైన అనుమతులను కూడా త్వరగా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
  • కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన అనుమతులను మళ్లీ సమీక్షించేలా అవకాశం ఇస్తే, భవిష్యత్తులో జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ ఇచ్చే ప్రతి అనుమతిపైనా అనిశ్చితి ఏర్పడుతుందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
  • దీనివల్ల తెలంగాణలో సాగునీటి అభివృద్ధి కుంటుపడటంతో పాటు, కోట్లాది మంది రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
  • ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తక్షణమే స్పందించి ఎజెండాలోని వివాదాస్పద అంశాలను తొలగించాలని, జలశక్తి శాఖ మరియు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులను గోదావరి బోర్డు మళ్లీ సమీక్షించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
  • అలాగే సమ్మక్క సాగర్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని హరీశ్ రావు కోరారు. కేంద్రం సకాలంలో జోక్యం చేసుకుని తెలంగాణ నీటి హక్కులను కాపాడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement