Harish Rao | పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ
Harish Rao | ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళ్‌పల్లి వద్ద కనీస వసతులు లేవంటూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నా శిబిరాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు.
కాబోయే డాక్టర్ల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ ప్రభుత్వం...
26 నెలలుగా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, కాలేజీ భవనం అద్దె కట్టలేదు..
లక్ష కోట్లతో మూసీ, ఫ్యూచర్ సిటీ అంటున్న రేవంత్ రెడ్డికి..
మెడికల్ కాలేజీ కరెంటు, నీళ్ల బిల్లులు కట్టడానికి పైసలు లేవా?...
విజన్ 2047, అమెరికా, చైనాతో పోటీ అంటున్న రేవంత్ రెడ్డి..
విద్యార్థుల దుస్థితి చూస్తే శ్రీలంక, నేపాల్‌తో పోటీ పడుతున్నట్లుంది...
Harish Rao | త్రినేత్ర న్యూస్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళ్‌పల్లి వద్ద కనీస వసతులు లేవంటూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నా శిబిరాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి క్యామ మల్లేశ్ తో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవి గార్లతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. కాబోయే డాక్టర్లు చదువుకునే మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంత అధ్వాన్నంగా ఉండవు. నాడు కేసీఆర్ నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి మన ఊరు - మన బడి కింద డిజిటల్ క్లాస్ రూమ్‌లు, డ్యూయల్ డెస్క్‌లు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్, హైజినిక్ వాష్‌రూమ్‌లతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ ఈరోజు హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా తయారైంది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
చైనా, అమెరికాలతో కాదు.. శ్రీలంక, నేపాల్‌తో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది
హైదరాబాద్‌కు దగ్గరగా ఉందనే ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థులతో పాటు బీహార్, యూపీ, రాజస్థాన్, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈ కాలేజీని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటాయని తెలిస్తే అసలు ఈ కాలేజీని ఎంచుకునేవారే కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే విజన్ 2047, ఫ్యూచర్ సిటీ అని, తాను పక్క రాష్ట్రాలతో కాకుండా అమెరికా, చైనా, సింగపూర్‌లతో పోటీ పడుతున్నానని భారీ డైలాగులు కొడతాడు. కానీ ఇక్కడ కాబోయే డాక్టర్ల దుస్థితి చూస్తుంటే ఆయన చైనా, అమెరికాలతో కాదు.. శ్రీలంక, నేపాల్‌తో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. బహుశా శ్రీలంక, నేపాల్‌లో కూడా ఇంత అధ్వాన పరిస్థితులు ఉండకపోవచ్చు. నేను రాజకీయం కోసం ఈ మాటలు చెప్పడం లేదు, సాక్షాత్తూ ఈ కాలేజీ బిల్డింగ్ ఓనర్ ప్రభుత్వానికి రాసిన లేఖే ప్రభుత్వ దివాళాకోరుతనానికి సాక్ష్యం. 2024 ఆగస్టు 1న భవనాన్ని తీసుకున్నప్పటి నుంచి అంటే 26 నెలలుగా వాటర్ బిల్లు కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు భవనం రెంట్ కట్టలేదని ఓనర్ లేఖ రాశారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తా, లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా, కొడంగల్‌కు 5 వేల కోట్లతో రేడియల్ రోడ్లు వేస్తా అంటున్న రేవంత్ రెడ్డికి.. మెడికల్ కాలేజీ పిల్లల వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, రెంట్ కట్టడానికి పైసలు లేవా? అని నిలదీశారు.

ప్రభుత్వం బిల్లులు కట్టకపోవడంతో ఓనర్ భవనాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఫలితంగా పిల్లలకు నీళ్లు లేవు, వాష్‌రూమ్‌లు లేవు, కరెంటు వైర్లు వేలాడుతున్నాయి, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్ వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటే సెట్ బ్యాక్ లేదనో, ఫైర్ పర్మిషన్ లేదనో, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదనో రాత్రికి రాత్రే పోయి కూలగొట్టే రేవంత్ రెడ్డికి.. ఈ మెడికల్ కాలేజీ భవనం కనిపించడం లేదా? థర్డ్ ఇయర్ పిల్లలు చదువుతున్న ఈ బిల్డింగ్‌కు ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్ లేదు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ మీటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ లేదు. కాలేజీ చుట్టూ చెత్తాచెదారం, స్క్రాప్, పాములు, కుక్కలు, పందులు, కోతులు ఉన్నాయని సాక్షాత్తూ కాలేజీ ప్రిన్సిపాలే ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటేనే ఫైర్ సేఫ్టీ, ఎన్ఓసీ, ఓసీ ఉన్నాయా అని చూస్తారు కదా.. మరి ఏ అనుమతులూ లేకుండా, పాములు, పందుల మధ్య మూడేళ్ల నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎలా నడుపుతున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమాధానం చెప్పాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
అధికారులకు ఈ పిల్లల గోడు పట్టదా?
పిల్లల భవిష్యత్తు కోసమే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కంటే తానే బెస్ట్ సీఎం అని తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. సర్టిఫికెట్ ఇవ్వాల్సింది నువ్వు కాదు, ప్రజలు. ఈ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఇవ్వాలి. రాష్ట్ర చరిత్రలో వచ్చిన ముఖ్యమంత్రులందరిలోకెల్లా రేవంత్ రెడ్డి అత్యంత చెత్త ముఖ్యమంత్రి. సబితమ్మ మూసీ పర్యటనకు వెళ్తుందంటే, నేను టిమ్స్ ఆసుపత్రి పరిశీలనకు వెళ్తానంటే రాత్రే పసిగట్టి ఉదయం 6 గంటలకే మా ఇళ్ల ముందు వాలిపోయి హౌస్ అరెస్టులు చేసే ఇంటెలిజెన్స్.. హైదరాబాద్ పక్కనే మెడికల్ విద్యార్థులు మూడు రోజులుగా రోడ్డుపై ధర్నా చేస్తుంటే ఏం చేస్తోంది? విద్యార్థులు ఇప్పటికే జనవరిలో, ఆ తర్వాత రెండుసార్లు ధర్నా చేశారు. కలెక్టర్‌కు, ప్రిన్సిపాల్‌కు, డీఎంఈకి వినతిపత్రాలు ఇచ్చారు. తల్లిదండ్రులు స్వయంగా మంత్రి దామోదర రాజనరసింహను కలిశారు. అయినా ఏసీ గదుల్లో కూర్చున్న మంత్రులకు, అధికారులకు ఈ పిల్లల గోడు పట్టదా? మెయిన్ రోడ్డు నుంచి కాలేజీ లోపలికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. కనీసం రోడ్డు వసతి లేదు, లోపలికి బస్సు రానివ్వరు, సొంత వాహనాలను అనుమతించరు. ఆడపిల్లలు, మెడికల్ స్టూడెంట్స్ ప్రతిరోజూ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సిన దుస్థితి నెలకొంది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
సూపర్ స్పెషాలిటీ సీట్లను మూడు రెట్లు పెంచారు
బీఆర్ఎస్ హయాంలో ప్రతి మెడికల్, నర్సింగ్ కాలేజీకి ఉదయం ప్రాక్టికల్స్, మధ్యాహ్నం క్లాసుల కోసం సొంత బస్సు గానీ, అద్దె ఆర్టీసీ బస్సు గానీ తప్పనిసరిగా ఉండాలని నిబంధన పెట్టి అమలు చేశాం. గతంలో విద్యార్థులు నన్ను కలిసినప్పుడు నేను ప్రిన్సిపాల్, డీఎంఈ, హెల్త్ సెక్రటరీకి ఫోన్ చేసి చెబితే కొన్ని రోజులు బస్సు నడిపి మళ్లీ ఆపేశారు. కరోనా సమయంలో డాక్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్ గారు.. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని సంకల్పించి 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి తెలంగాణ వచ్చే వరకు మన రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి... మన పిల్లలు మెడిసిన్ కోసం రష్యా, ఉక్రెయిన్, చైనా, నేపాల్ వెళ్లాల్సి వచ్చేది. కానీ కేసీఆర్ తొమ్మిదేళ్లలో ఎంబీబీఎస్ సీట్లను 10,000కు పెంచారు, పీజీ సీట్లను రెట్టింపు చేశారు, సూపర్ స్పెషాలిటీ సీట్లను మూడు రెట్లు పెంచారు. ప్రతి జిల్లాలో నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ కాలేజీలు పెట్టి హైదరాబాద్‌ను మెడికల్ హబ్‌గా మార్చారు. ఇవాళ దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ అయితే, ఏటా 11 వేల మంది డాక్టర్లను తయారు చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణే. మహేశ్వరం మెడికల్ కాలేజీని 2022-23లో మంజూరు చేసినప్పుడు సబితా ఇంద్రారెడ్డి హైవే పక్కన 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పించారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఎల్బీ నగర్ టిమ్స్ పనులు నత్తనడకన సాగుతున్నాయి
ఇక ఈ విద్యార్థులను అటాచ్ చేయాల్సిన ఎల్బీ నగర్ టిమ్స్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వరంగల్ హెల్త్ సిటీకి మూడు డెడ్‌లైన్లు పెట్టినా నేటికీ పూర్తి చేయలేదు. మూడు రోజులుగా విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేస్తుంటే బాధ్యత తీసుకోని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవి వెంటనే ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడాలి. గరిష్టంగా రెండు నెలల గడువులోగా ఈ కాలేజీని వనస్థలిపురం, ఎల్బీ నగర్ టిమ్స్‌కు దగ్గరగా అన్ని వసతులున్న ప్రభుత్వ లేదా అద్దె భవనంలోకి మార్చాలి. ఈ మేరకు విద్యార్థులకు తక్షణమే రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్త భవనంలోకి మార్చేంత వరకు తక్షణమే విద్యార్థులకు బస్సు సౌకర్యం, తాగునీరు, వాష్‌రూమ్‌ల వసతి కల్పించాలి. కాలేజీ ప్రీమిసెస్ వరకు బస్సులను, విద్యార్థుల సొంత వాహనాలను వెంటనే అనుమతించాలన్నారు.
విద్యార్థులెవరూ డిప్రెషన్‌కు లోనుకావద్దు
గతంలో 20 మంది విద్యార్థులు నన్ను, సబితక్కను కలిసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు, అన్ని వసతులున్న కొత్త భవనం, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్, బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే వరకు నేనూ, సబితక్క, కిషన్ రెడ్డి అన్న, క్యామ మల్లేశ్ అన్న, యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు కొండంత అండగా ఉంటాం. విద్యార్థులెవరూ డిప్రెషన్‌కు లోనుకావద్దు, ధైర్యంగా ఉండి బాగా చదువుకోవాలి. నాడు కేసీఆర్ పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఇవాళ మీరు చేస్తున్న పోరాటంతోనే మీకు కొత్త భవనం వస్తుంది. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అవసరమైతే అసెంబ్లీలో మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల పక్షాన గట్టిగా కొట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాం. మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసే నాటికి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, అప్పుడు పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లను ఇంకా పెంచి వైద్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mallikarjun Kharge | సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు
- ●KTR | భూములు అమ్ముకునే బ్రోకర్ రేవంత్ రెడ్డి
- ●Stockal | స్టాక్ఏల్లో రూ.100 కోట్ల మోసం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో కుచ్చు టోపీ..
- ●Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు
- ●Virat Kohli | కోహ్లీ సరికొత్త చరిత్ర.. 13 వేల పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా..
- ●US Stocks | అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులా? భారతీయులు తెలుసుకోవాల్సిన 5 రిస్కులు!

Mallikarjun Kharge | సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు

KTR | భూములు అమ్ముకునే బ్రోకర్ రేవంత్ రెడ్డి

Stockal | స్టాక్ఏల్లో రూ.100 కోట్ల మోసం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో కుచ్చు టోపీ..

Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు





