Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా అడిగిందే అడుగుడు, గంటకు అర గంటకు ఫోన్లు వచ్చుడు.. తప్ప ఏం లేదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహాల్లాగా గర్జిస్తూనే ఉంటాయని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్. ఉత్త సొల్లు.. నిరాధార ఆరోపణలు, ఆధారం లేని మాటలు. అడిగిందే అడుగుడు సొల్లు పురాణం తప్ప ఏం లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఒక గంట విచారణ కాగానే బయటకు నుంచి ఫోన్లు వస్తాయి. బయటకు పోవుడు గంట మాట్లాడుకోని మళ్లీ వచ్చుడు. అర గంట కాగానే మళ్లీ ఫోన్ అని సైగలు వస్తున్నాయి. ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తున్నాడో.. సీపీ సజ్జనార్ చేస్తున్నడో నాకు తెల్వదు కానీ ముగ్గురు అధికారులు బయటకు పోవుడు.. అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు అని హరీశ్‌రావు తెలిపారు. సిట్.. లట్టు.. పొట్టు.. ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్. నిన్న మేం ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. దీంట్లో లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది అని బయటపెట్టగానే సాయంత్రానికి సిట్ నోటీసు పంపిండు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. రేవంత్‌కు ధైర్యముంటే, నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాం. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేద్దాం. మే అన్ని ఆధారాలు సిట్టింగ్ జడ్జికి అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నువ్వు చీటికిమాటికి సిట్‌లు వేస్తున్నావ్, కమిషన్లు వేస్తున్నావ్ కదా.. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు. ఈ రింగ్‌కు కింగ్ పిన్. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు తప్పు చేయకపోతే విచారణకు ఆదేశించు. మేం రుజువు చేస్తాం. సీఎం, భట్టి, కోమటిరెడ్డి మధ్య వాటాలు పంపకాలు బయటకొచ్చాయి. టెండర్ల విషయంలో కొట్లాడుకుంటున్నారని ప్రజలకు అర్థమైంది. దాన్నుంచి డైవర్షన్ చేసేందుకే నువ్వు సిట్ లట్టు పొట్టు అని చిల్లర నోటీసుల కథలు పెట్టినవ్. మాకు చట్టం మీద గౌరవం ఉంది. తప్పకుండా గౌరవిస్తాం. ఎన్నిసార్లు పిలిచినా సహకరిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన బిడ్డలం. ఉద్యమాలు పోరాటాలు మాకు కొత్త కాదు. అక్రమ కేసులు, అరెస్టు మాకు కొత్త కాదు. నాడు ఉద్యమంలో వందలాది కేసులు పెట్టినా పోరాడినం. జైళ్లల్లో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడాం. మీ కాంగ్రెస్ నేతల్లాగా సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్లం కాదు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్తాం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. న్యాయం నిలిచింది.. ధర్మం గెలిచింది మీరు ఇచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం. ఎందుకంటే మీ బావమరిది బండారం బయటపెడితే మాకు నోటీసులు ఇచ్చావు.. ఇది ప్రజలు గనమిస్తున్నారు. నువ్వు ఒక ప్రయివేటు కంప్లైట్‌లో కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి అక్రమ కేసులో నన్ను ఇరికించాలని చూశావు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది.. న్యాయం నిలిచింది.. ధర్మం గెలిచింది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రశ్నిస్తే కేసులు.. ఏనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పీఎస్‌లో కేసు పెట్టించావు. రైతు రుణమాఫీ చేస్తానని దేవుని మీద ప్రమాణం చేసి చివరకు దేవుళ్లను కూడా మోసం చేసిండు అంటే యాదగిరిగుట్టలో కేసులో పెట్టించావు. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తే అక్కడ రాళ్ల దాడి చేసి కేసులు పెట్టించావు. ఎవరో ట్వీట్ చేశారని హైదరాబాద్‌లో కేసు పెట్టించావు. ఘోష్ కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా కమిషన్ డొల్ల అని ఆధారాలతో సహా కుండబద్ధలు కొట్టాం. అర డజన్ మంత్రులను ఎదురించాం అని హరీశ్‌రావు తెలిపారు. పిరికిపందలాగా నాకు నోటీసులు ఇచ్చుడు కాదు.. పోలీసులను వెనుక పెట్టుకుని రేవంత్ రెడ్డి పిరికిపందలాగా నాకు నోటీసులు ఇచ్చుడు కాదు.. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. అన్ని కుంభకోణాల మీద మాట్లాడుదాం. నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది. అందినకాడికి దోచుకుతింటున్నారు. గ్యారెంటీలను గాలికి వదిలేశారు. అందినకాడికి దండుపాళ్యం ముఠాలాగా దోచుకుంటున్నారు. కుంభకోణాలపై ప్రశ్నిస్తున్నామని చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. ఎన్నికుట్రలు పన్నినా.. కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహాల్లాగా గర్జిస్తూనే ఉంటాయి. అడగడుగునా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం.. ఎక్కడ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. నీ చిల్లర రాజకీయాల మీదనే అసహ్యం మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పారిపోతున్నారు. ప్రజలు తిరగబడే రోజులు కూడా దగ్గర్లో ఉన్నాయి. సిట్ పొట్టు లట్టు ఏమన్నా వేసుకో.. న్యాయస్థానాల మీద గౌరవం ఉంది.. నిజాయితీగా సమాధానలు చెబుతాం. చట్టం మీద గౌరవం ఉంది.. కానీ నీ చిల్లర రాజకీయాల మీదనే అసహ్యం ఉంది. రేవంత్ రెడ్డి నిన్ను అసలు వదిలిపెట్టం.. ఇంకా గట్టిగా కొట్లాడుతాం. మాకు పోరాటాలు, త్యాగాలు తెలుసు.. నీలాగా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు మాకు తెలియవు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.