త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | జీవో 97 ర‌ద్దు చేయ‌క‌పోతే.. ల‌క్ష మందితో స‌చివాల‌యం ముట్ట‌డి

Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల‌కు శాపంగా మారిన జీవో 97ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థులు ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్ రావు సంఘీభావం తెలిపారు.

S

Telangana | Published On Aug 25, 2026, 8.30 pm IST

Harish Rao | జీవో 97 ర‌ద్దు చేయ‌క‌పోతే.. ల‌క్ష మందితో స‌చివాల‌యం ముట్ట‌డి
Advertisement
  • లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ రెడ్డి చెలగాటం
  • విద్యార్థులపై పోలీసుల నిర్బంధం దుర్మార్గం..
  • ఇది జెన్ జీ సత్తా చూపే సమయం
  • స్కిల్ యూనివర్సిటీ పేరుతో
    పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే కుట్ర
  • వేలకోట్ల పాలిటెక్నిక్ ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి
    అప్పులు తెచ్చేందుకు భారీ కుట్ర జరుగుతోంది
  • కమిటీల పేరుతో డ్రామాలు వద్దు..
  • వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలి
  • పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళ‌న‌కు హ‌రీశ్‌రావు మ‌ద్ద‌తు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : పాలిటెక్నిక్ విద్యార్థుల‌కు శాపంగా మారిన జీవో 97ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థులు ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్ రావు సంఘీభావం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కళాశాల వద్దకు చేరుకున్న ఆయన, ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా అదే పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిగా విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకెళ్లి ఐటీఐలతో కలుపుతామంటూ స్కిల్ యూనివర్సిటీకి అప్పగించాలని చూస్తున్నారు. అసలు స్కిల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నడిచే ఒక ప్రైవేటు సంస్థ. దానికి కేవలం మూడేళ్లు మాత్రమే ప్రభుత్వం మద్దతు ఇస్తుంది, ఆ తర్వాత పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆ యూనివర్సిటీ చట్టంలోనే స్పష్టంగా పొందుపరిచారు. రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే, అందులో 59 ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. దీని వల్ల లక్ష మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోంది. రేవంత్ రెడ్డికి పిల్లల భవిష్యత్తు కన్నా పాలిటెక్నిక్ ఆస్తుల మీదే కన్ను పడింది. సుమారు వేల కోట్లు విలువ కలిగిన ఆ ప్రభుత్వ భవనాలు, భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి అప్పులు తేవడానికే ఈ కుట్రలు చేస్తున్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు, రేవంత్ రెడ్డి కేవలం భూముల చుట్టే తిరుగుతున్నాడు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

డిప్లొమా చేసిన వాళ్లు ఏఈలు, వాటర్ వర్క్స్ ఇంజనీర్లు

పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే కేవలం బ్లూ కాలర్ జాబ్స్ చేసేవాళ్లు కాదు, వైట్ కాలర్ జాబ్స్ కూడా చేసే సత్తా ఉన్నవాళ్లు. నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమా చేసిన వాళ్లు ఏఈ లుగా పనిచేశారు. రాష్ట్రంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, వాటర్ వర్క్స్ ఇంజనీర్లలో సగం మంది మన పాలిటెక్నిక్ విద్యార్థులే. ప్రస్తుతం విద్యార్థులు రూ.15 వేలు ఫీజు కడితే పాలిటెక్నిక్ విద్య పూర్తవుతుంది. ఆ తర్వాత నేరుగా ల్యాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ చదువుకుంటారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే ఆ ల్యాటరల్ ఎంట్రీ అవకాశాన్ని కోల్పోతారు. ప్రభుత్వ కళాశాలల్లో చదవాల్సిన పిల్లలు ప్రైవేటులోకి ఎందుకు పోవాలి? రేపు స్కిల్ యూనివర్సిటీలోకి వెళ్తే ఫీజులు పెరగవని గ్యారెంటీ ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? మూడు సంవత్సరాల తర్వాత మీరే వ్యాపారాలు చేసి కళాశాలలు నడుపుకోండని చట్టంలో చెబుతున్నప్పుడు భవిష్యత్తుకు భరోసా ఎక్కడుంటుంది? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

ఆ చిచ్చు రేపు తెలంగాణలో కూడా ..

ఇది ఒక కళాశాల పోరాటం కాదు, లక్ష మంది విద్యార్థుల పోరాటం. ఢిల్లీలో నీట్ పరీక్షపై జెన్-జీ తరహా ఉద్యమిస్తే ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ చిచ్చు రేపు తెలంగాణలో కూడా రగులుతుంది. గత 20 రోజులుగా జీవో 97 రద్దు చేయాలని పోరాడుతున్న విద్యార్థుల దీక్షకు నా సెల్యూట్. విద్యార్థులపై పోలీసుల ప్రవర్తన అత్యంత దుర్మార్గంగా ఉంది. మహబూబాబాద్‌లో నిరసన తెలుపుతున్న ఒక విద్యార్థి గొంతును ఓ సీఐ పట్టి పిసికాడు. పాలిటెక్నిక్ విద్యార్థులేమైనా టెర్రరిస్టులా? సూర్యాపేటలో ఒక విద్యార్థిని అరెస్ట్ చేస్తే అమ్మాయిలంతా వెళ్లి పోలీసులను చుట్టుముట్టి విడిపించుకొచ్చారు. జెన్-జీ అంటే కేవలం రీల్స్, వీడియోలు చేసుకునే వారు కాదు, అవసరమైతే రోడ్డెక్కి భవిష్యత్తును కాపాడుకునే పోరాట యోధులు అని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అని హ‌రీశ్ రావు సూచించారు.

పూర్వ విద్యార్థిగా బీఆర్ఎస్ పక్షాన నేను ముందుండి పోరాడుతా

లక్షమంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒకటై కదిలితే ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌లో అడుగు పెట్టగలరా.. సెప్టెంబర్ 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు జీవో 97ను రద్దు చేయాలి. లేదంటే లక్ష మంది విద్యార్థులకు అండగా, పూర్వ విద్యార్థిగా బీఆర్ఎస్ పక్షాన నేను ముందుండి పోరాడుతాం. అవసరమైతే అందరినీ కలుపుకుని సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి కమిటీల పేరుతో డ్రామాలు ఆపాలి. ఇది పోరాడుతున్న విద్యార్థులపై నీళ్లు చల్లి, ఉద్యమాన్ని నీరుగార్చే దొంగ కమిటీ. పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం ఆధీనంలోనే ఉంచి నడపాలన్నారు హ‌రీశ్‌రావు.

ఇప్పుడు పాలిటెక్నిక్ ఆస్తులు కావాలా?

భూములు అమ్ముకోవడానికి, కుదవపెట్టడానికి ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలు, హెచ్‌సీయూలో 400 ఎకరాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాలు గుంజుకున్నావు. టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, హౌసింగ్ బోర్డు ఆస్తులు సరిపోలేదా రేవంత్ రెడ్డి? ఇప్పుడు పాలిటెక్నిక్ ఆస్తులు కావాలా? ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాగే పాలిటెక్నిక్ కళాశాలలను యూనివర్సిటీల్లో కలపాలని చూసి ఫెయిల్ అయ్యారు, తిరిగి ఉపసంహరించుకున్నారు. ఇక్కడ కూడా తక్షణమే జీవోను రద్దు చేయాలి.అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద మూడు రూపాయలు ఇవ్వడం చేతకాని రేవంత్ రెడ్డి, రేపు ప్రైవేటు యూనివర్సిటీలో రక్షణ కల్పిస్తాడంటే నమ్మకం ఏంటి..? అని ప్ర‌శ్నించారు.

అసలు ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో వాళ్లకే నమ్మకం లేదు

ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి మాట్లాడుతూ.. రేపు మా ప్రభుత్వం వస్తుందో లేదో, నేనే మళ్లీ గెలుస్తానో లేదో గ్యారెంటీ లేదు అని స్వయంగా అన్నారు. ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడో, ఎవరికి ఏ నోటీసులు వస్తాయో, అసలు ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో వాళ్లకే నమ్మకం లేదు. ఇక పీపీపీ యూనివర్సిటీ కింద విద్యార్థుల భవిష్యత్తుకు వీళ్లేం గ్యారెంటీ ఇస్తారు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

రేవంత్ త‌ల‌కాయ్ ఉండే మాట్లాడుతున్నారా..?

ఈ నిరుద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వానికి శత్రువులు కాదు. విద్యార్థులారా.. మీ హక్కుల కోసం బహిరంగంగా పోరాడండి. జెన్-జీ సత్తా ఏమిటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసొచ్చేలా చేయండి, మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. నేను, కేటీఆర్ విదేశాలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన తలకాయ్ ఉండి మాట్లాడుతున్నారో, లేక అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేను గానీ, కేటీఆర్ గానీ కేవలం ఎమ్మెల్యేలం మాత్రమే. ఒక ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లడానికి కేంద్రానికి ఎలాంటి దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రుల హోదాలో విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలి. ఈ కనీస విషయం కూడా తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆగం చేయొద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement