త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఇది బీఆర్ఎస్ స‌స్పెన్ష‌న్ కాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ విధించిన స‌స్పెన్ష‌న్

Harish Rao | ఇది బీఆర్ఎస్ స‌స్పెన్ష‌న్ కాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ విధించిన స‌స్పెన్ష‌న్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కాదు.. ప్రజల సమస్యలపై చర్చ జరగాలి. వాటికి పరిష్కారం చూపాలి అని ఆయ‌న సూచించారు.

S

Telangana | Published On Sep 9, 2026, 4.56 pm IST

Harish Rao | ఇది బీఆర్ఎస్ స‌స్పెన్ష‌న్ కాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ విధించిన స‌స్పెన్ష‌న్
Advertisement
  • అసెంబ్లీ అంటే ప్ర‌తిప‌క్షాన్ని టార్గెట్ చేయ‌డం కాదు
  • ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఈ ప్ర‌భుత్వానికి ప‌ట్టింపు లేదు
  • బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఇది బీఆర్ఎస్ స‌స్పెన్ష‌న్ కాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ విధించిన స‌స్పెన్ష‌న్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కాదు.. ప్రజల సమస్యలపై చర్చ జరగాలి. వాటికి పరిష్కారం చూపాలి అని ఆయ‌న సూచించారు. బీఆర్ఎస్ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌పై హ‌రీశ్‌రావు ప్రెస్ నోట్ విడుద‌ల చేశారు.

మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఒక్క సమస్యపైనైనా చర్చ జరిగిందా? ఒక్క ప్రభుత్వ విధానంపైనైనా సమాధానం చెప్పారా? ప్రతిపక్షాన్ని వేధించడం, గొంతు నొక్కడం, బయటకు పంపించడం తప్ప.. ప్రజల సమస్యలపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా మమ్మల్ని బలవంతంగా బయటకు పంపించడం అప్రజాస్వామికం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

మేము ఏం చేయాలి? బాధపడటం తప్ప!

అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయని తెలిసి..“సార్.. మా సమస్యను అసెంబ్లీలో మాట్లాడండి” అంటూ ఎన్నో వర్గాల ప్రజలు మమ్మల్ని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. వారు ఎంతో ఆశగా ఫోన్లు చేస్తున్నారు. మెసేజులు పెడుతున్నారు. “మా గొంతును అసెంబ్లీలో వినిపించండి” అని ప్రజలు అడుగుతుంటే.. మేము ఏం చేయాలి? బాధపడటం తప్ప! అని ఆయ‌న పేర్కొన్నారు.

ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తాయనే భయంతోనే

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారని ఆర్టీసీ ఉద్యోగులు అడుగుతున్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తమ భూములను ఎప్పుడు తొలగిస్తారని భూ యజమానులు అడుగుతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న జీవో 97ను ఎప్పుడు రద్దు చేస్తారని విద్యార్థులు అడుగుతున్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కారుణ్య నియామకాల కోసం సింగరేణి ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. పింఛన్ల పెంపు కోసం అవ్వాతాతలు ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తాయనే భయంతోనే ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సభ నుంచి బయటకు పంపింది. ప్ర‌జా సమస్యలపై నిలదీసే బీఆర్ఎస్ గొంతును సస్పెన్షన్ పేరుతో నొక్కాలని చూస్తున్నారు అని నిప్పులు చెరిగారు.

చరిత్ర ఇచ్చే తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరు

కానీ గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి.. ఇది ప్రతిపక్షంపై విధించిన సస్పెన్షన్ కాదు. ఇది ప్రజా సమస్యలపై విధించిన సస్పెన్షన్. ఇది తెలంగాణ ప్రజల గొంతుపై విధించిన సస్పెన్షన్. మైకులు కట్ చేసో.. సస్పెన్షన్ విధించో అసెంబ్లీలో మా గొంతును అణిచి వేయవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో చేయలేరు. ఎంత అణచివేస్తే అంత బలంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది. నియంతృత్వంతో ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ కాలం అణచివేయలేరు. హిట్లర్ తనకు ఆదర్శమని చెప్పుకున్న రేవంత్ రెడ్డి.. హిట్లర్ తరహా నియంతృత్వ ధోరణులతో పాలన సాగిస్తే, చరిత్ర ఇచ్చే తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది

కేసీఆర్ పట్ల మీరు చేసిన అవమానాలు, వ్యక్తిగత దూషణలు, రాజకీయ కక్ష సాధింపులను తెలంగాణ సమాజం గమనిస్తోంది. ప్రజలే అంతిమ న్యాయమూర్తులు. తెలంగాణ ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పే వరకు.. బీఆర్ఎస్ వెనక్కి తగ్గదు. నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం గుర్తుంచుకో రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement