త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని వెన‌క్కి తీసుకోవాలి

Harish Rao | రాష్ట్రంలో క‌రెంట్ కోత‌లు లేకుండా చూడాల‌ని, ట్రూ ఆప్ చార్జీల పేరిట ప్ర‌జ‌ల‌పై వేసిన రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ప్ర‌జా పోరాటానికి సిద్ధ‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Oct 7, 2026, 4.46 pm IST

Harish Rao | రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని వెన‌క్కి తీసుకోవాలి
Advertisement

కాంగ్రెస్ పాప ఫ‌లితమే రాష్ట్రంలో క‌రెంట్ సంక్షోభం
ప్రెస్‌మీట్లు పెట్టి మాపై నింద‌న‌లు వేసినంత మాత్రాన‌
ప్ర‌జ‌ల క‌రెంట్ క‌ష్టాలు తీర‌వు
ట్రూ ఆప్ చార్జీల పేరిట ప్ర‌జ‌ల‌పై భారం వేస్తే
బీఆర్ఎస్ ప్ర‌జా పోరాటానికి సిద్ధం అవుతుంది
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు హెచ్చ‌రిక‌

Harish Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో క‌రెంట్ కోత‌లు లేకుండా చూడాల‌ని, ట్రూ ఆప్ చార్జీల పేరిట ప్ర‌జ‌ల‌పై వేసిన రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ప్ర‌జా పోరాటానికి సిద్ధ‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రించారు. భ‌ట్టి విక్ర‌మార్క ప్రెస్‌మీట్‌పై హ‌రీశ్‌రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

కుంటి సాకులు చెప్పి, సంబంధం లేని కాగితాలు చూపి ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా "తగుదునమ్మా" అంటూ వచ్చి తప్పించుకున్నట్లు ఉంది భట్టి విక్రమార్క పత్రికా సమావేశం. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల పేరిట రూ. 5,420 కోట్ల భారం మోపడం గురించి బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడం ప్రజా పాలన అంటారా? ప్రజలపై మోపిన భారాన్ని ఉపసంహరించుకొని పండుగ పూట శుభవార్త చెబుతారనుకుంటే భట్టి ఉసూరుమనిపించారు. కానీ 5,420 కోట్ల భారం ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తామని భట్టి పక్కనే కూర్చొని అధికారులతో చెప్పించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం అని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

ఏనాడైనా ఇలా రైతులు రోడ్లెక్కారా?

రైతులు రోడ్ల మీదకు వచ్చి కరెంట్ కోసం ధర్నాలు చేస్తుంటే, కోతలే లేవు అని చెప్పడం మీకే చెల్లింది. మీరు సక్రమంగా కరెంట్ సరఫరా చేస్తే రైతులు ఎందుకు సబ్ స్టేషన్ల ముందు వస్తారు? ఎందుకు రోడ్లపై ధర్నాలు చేస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడైనా ఇలా రైతులు రోడ్లెక్కారా? మీరు తెస్తానన్న అనాటి రోజులు ఇవేనా? ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే సవాళ్లు విసిరన భట్టి గారూ..మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ఎందుకు సమాధానం చెప్పలేదు? భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ 15.02.2018 నాటి F. No. 23014/1/2018-CLD ప్రకారం, ఎస్సీసీఎల్ (SCCL) గనుల నుండి 14 MTPA G-9 గ్రేడ్ బొగ్గును యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు కేటాయించింది. మరి కేటాయింపు లేదు అని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు సత్య దూరపు మాటలు మాట్లాడారు? అని నిల‌దీశారు.

బొగ్గు లేని చోట థర్మల్ ప్లాంట్ పెట్టింది నిజం కాదా?

ఎల్ నినో సాకు చెబుతూ యాదాద్రిలో 3000 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అగిన మాట నిజం కాదా? ఇది మీ పరిపాలన వైఫల్యం కాకుంటే మరేమిటి? రాష్ట్రంలో మొత్తంగా 140 మిలియన్ యూనిట్ల కెపాసిటీ ఉంటే 89 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు మీరే చెప్పారు కదా. ఇది మీ వైల్యం కాదా? బొగ్గు ఉన్న దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండాలె అని చెబుతున్న మీరు, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమలో నీళ్ళు, బొగ్గు లేని చోట థర్మల్ ప్లాంట్ పెట్టింది నిజం కాదా? ఆనాడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

డీఎంఎఫ్‌టీ చెల్లించి మోసం చేసింది నిజం కాదా?

సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫెట్ అనే నిబంధన పెట్టి అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి, అనుయాయులు లబ్ధి చేకూర్చింది మీ ప్రభుత్వం కాదా? ఇప్పటికీ ఆ టెండర్లు రద్దు చేయనిది, విచారణ జరప‌నిది నిజం కాదా? మన రాష్ట్ర విద్యుత్ అవసరాలు పక్కన పెట్టి, సింగరేణి నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను రాజస్తాన్ రాష్ట్రానికి ఇవ్వాలని మీరు ఒప్పందం చేసుకున్నది స్వయంగా మీరు కాదా? ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే నిర్ణయం కాక మరేమిటి? రూపాయి పెట్టుబడి లేకుండా, తక్కువ ధరకు 1600 మెగావాట్ల విద్యుత్ ను మన రాష్ట్రానికి ఎన్టీపీసీ సరఫరా చేస్తానన్నా దాన్ని తిరస్కరించి, ఈరోజు విద్యుత్ కోతలకు కారణం అయ్యింది మీరు కాదా? 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు లేనివి ఉన్నట్లు చూపి ఇన్కమ్ టాక్స్, కోల్ సెస్, డీఎంఎఫ్‌టీ చెల్లించి మోసం చేసింది నిజం కాదా? ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఎటు పోలేదని బుకాయించిన మీరు, ఈనాడు బొగ్గు కొరత ఉందని చెప్పడం తలా తోక లేని వ్యవహారం కాదా? నిజంగా ఆ 40 ఆ లక్షల టన్నుల బొగ్గు ఉండి ఉంటే, ఈరోజు కరెంట్ కష్టాలు ఎందుకు ఉంటాయి? అని మాజీ మంత్రి అడిగారు.

ఆ నోట్ ఫైల్ బహిర్గతం చేయగలరా?

నదుల్లో నీళ్లు ఉన్నా మోటార్లు నడప నీళ్లు లిఫ్ట్ చేయక సాగు నీళ్లు అందించలేదు. బొగ్గు నిల్వలు పెట్టుకోకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయక రైతులకు కరెంట్ సరఫరా చేయడం లేదు. మీ పాలన నిర్లక్ష్యం వల్ల సాగు నీటి కొరత, కరెంట్ కొరత వచ్చింది నిజం కాదా? సింగరేణి సహా విద్యుత్ సంస్థలను ఐపీవో, కొత్త అప్పుల దిశగా తీసుకు వెళ్లేందుకు ఎనర్జీ రిఫార్మ్స్ కమిటీనీ ఏర్పాటు చేసి, దానికి చైర్మన్‌గా ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణ్యంను నియమించాలనే ప్రతిపాదన నిజమా కాదా? ఆ నోట్ ఫైల్ బహిర్గతం చేయగలరా? నెహ్రూ సోషలిజం పేరుతో ప్రభుత్వ రంగ స్థలం కాపాడుతున్నామని డబ్బా కొట్టుకున్న మీరు.. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టింది నిజం కాదా? యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులంతా రోడ్డెక్కి ధర్నాలు చేసింది నిజం కాదా? ఈరోజు తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కారణం మీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కాకుంటే మరేమిటి. కరెంట్ కోతలతో రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈరోజు పత్రికా సమావేశంలో రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేక పోయారు అని భ‌ట్టి విక్ర‌మార్క‌పై హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

నిందలు వేసినంత మాత్రాన ప్రజల కరెంట్ కష్టాలు తీరవు

చేతికి వచ్చే పంటను కాపాడుకుందాం అంటే కరెంట్ లేదు, నీళ్లు లేవు. కడుపు మండిన రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నరు. గ్రామీణ ప్రాంత రైతులు కరెంట్ కోసం పోరాటాలు చేస్తున్నరు. లో వోల్టేజ్ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలి రైతులు అనేక వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక పొలాల దగ్గర వేచి చూస్తూ.. పాము కాట్లకు గురై రైతులు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి. మీ నిర్లక్ష్యం, మీరు చేసిన పాప ఫలితం ఈరోజు రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం. ప్రెస్ మీట్లు పెట్టి మాపై నిందలు వేసినంత మాత్రాన ప్రజల కరెంట్ కష్టాలు తీరవు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement