Harish Rao | సైట్ విజిట్‌పై భట్టివి అన్ని అబద్దాలే.. సీబీఐ విచారణ జరగాల్సిందే..
Harish Rao | సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో సైట్ విజిట్ సర్టిఫికెట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన అబద్ధాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధారాలతో తిప్పికొట్టారు. దమ్ముంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ల అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
దమ్ముంటే సైట్ విజిట్‌పై శ్వేతపత్రం విడుదల చేయ్..
లేదంటే మేమే బయటపెడుతాం..
సింగరేణిలో ఆ మూడు సూత్రాలకు మంగళం..
సింగరేణి స్కాం సూత్రధారి రేవంత్ రెడ్డి
పాత్రధారి సృజన్ రెడ్డి..
సూత్రధారి, పాత్రధారిని కాపాడుతున్న భట్టి..
ఆ టెండర్లన్నీ రద్దు చేయాల్సిందే..
బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే..
మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో సైట్ విజిట్ సర్టిఫికెట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన అబద్ధాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధారాలతో తిప్పికొట్టారు. దమ్ముంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ల అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు కుంభకోణంపై తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
నిన్న భట్టి విక్రమార్క హరీష్ రావు నాకు లేఖ రాయండి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడతా అంటున్నారు. రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి బావమరిది ఈ స్కాంలో మొదటి లబ్ధిదారుడు, సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి, పాత్రధారి అని మేం చెప్తుంటే... ఇంకా రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏం వస్తుంది? భట్టి ప్రెస్ మీట్ చూస్తుంటే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెత గుర్తుకొస్తున్నది. బొగ్గు కుంభకోణంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీతో, నాలుగు కాగితాలు చూపి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం భట్టి చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి విక్రమార్క అబద్ధాలను వండి వార్చారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఆ మూడు సూత్రాలకు మంగళం..
సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ ఒక్క మంత్రికో, ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడుస్తున్నది. సింగరేణి టెండర్ ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారు అని స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కనపెట్టి అవసరమైన చోట వారి అనుకూలమైన విధానాలను మార్చుకున్నారు. సింగరేణి స్కామ్‌కు ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్ధి పొందిన వారు ఎవరు? ఈ మూడు కీలక ప్రశ్నల్లో ఒక్కదానికైనా భట్టి సమాధానం చెప్పకుండా దాటివేశారు. సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి, ఆయన బావమరిది బాగోతం బయటపడకుండా కాపాడే ప్రయత్నం భట్టి చేస్తున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేందుకు విఫల ప్రయత్నాలు..
తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రిని బొగ్గు స్కాండల్ నుంచి బయటపడేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కే విధంగా విధానాలు మార్చారు. 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి విక్రమార్క నిన్న చెప్పారు. కానీ ఈ సైట్ విజిట్ సిఫార్సు 2018లో ఎటువంటి పనుల కోసం ఇచ్చారనేది చెప్పలేదు. సీఎంపీడీఐ సిఫార్సు ఇచ్చింది అని భట్టి బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది.. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనుల కోసం పెట్టారనేది స్పష్టంగా ఉంది. భట్టి 2018లో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్‌ను ప్రతిపాదించిందని చెబుతున్నారు. కానీ ఇక్కడే ఒక అత్యంత కీలకమైన, మౌలిక ప్రశ్న తలెత్తుతుంది? ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల కోసమా? కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్‌ల కోసమా? స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ల కోసమా? లేదా నిజంగానే ఓవర్‌బర్డన్ రిమూవల్ పనుల కోసమా? సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్” అనేది పరిమిత ప్రాంతాల్లో జరిగే డిజైన్, సరఫరా, ఇన్‌స్టాలేషన్, కమిషనింగ్ పనులకు మాత్రమే వర్తించే సాంకేతిక నిబంధన అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఓబీ వర్క్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేనేలేదు..
సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచారు, ఇందులో సప్లై అండ్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ క్లాత్ డ్రైయర్ కోసం సైట్ విజిట్ పెట్టారు. దాన్ని తీసుకొచ్చి సింగరేణి ఓబీ కాంట్రాక్టుకు లింకు పెట్టి చూపడం హాస్యాస్పదం. నిన్న భట్టి విక్రమార్క చూపించిన ఈ డాక్యుమెంట్లో ఎక్కడైనా ఓబీ రిమూవల్ కోసం సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఎక్కడ కూడా ఓబీ రిమూవల్ కాంట్రాక్టుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఓబీ రిమూవల్ కాంట్రాక్టు పద్ధతికి వర్తించని నిబంధనలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఓబీ వర్క్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేనేలేదు. మరో ముఖ్యమైన అంశం.. నిజంగా సీఎంపీడీఐ సిఫార్సు ఓబీ పనులకే అయితే, 2018 నుంచి 2024 వరకు సింగరేణి పిలిచిన వందలాది ఓబీ టెండర్లలో ఈ షరతు ఒక్కసారి కూడా ఎందుకు లేదు? 2018 నుంచి 2024 వరకు ప్రతి ఓబీ టెండర్‌లో ఈ షరతు లేదు. మరి ఇప్పుడు, 2025–26లో మాత్రమే, అదీ కొన్ని ఎంపిక చేసిన టెండర్లకే, ఈ షరతు ఎందుకు అకస్మాత్తుగా తీసుకొచ్చారు? ఓబీ విషయంలో సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ విధానం తెచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్న నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేదు భట్టి గారూ? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఆ టెండర్లన్నీ రద్దు చేయాల్సిందే..
2025 జనవరిలో భూపాలపల్లి టెండర్‌కు సైట్ విజిట్ షరతు లేకుండానే రివర్స్ ఆక్షన్ ద్వారా అంచనా రేట్ల కంటే 7 శాతం తక్కువకు పనులు అప్పగించారు. అప్పుడు సైట్ విజిట్ అవసరం లేదా? కానీ మూడు నెలల్లోనే 2025 మేలో వీకే ఓసీ టెండర్‌కు మాత్రం సైట్ విజిట్ సర్టిఫికేట్ షరతు పెట్టారు? పోటీ తగ్గిపోయింది. ఫలితంగా అంచనా రేట్లకంటే ఎక్కువ రేట్లకు లబ్ధిదారులు సృజన్ రెడ్డి శోధ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్‌కు పని దక్కింది. ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టడం వల్ల మొట్టమొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి.
అన్ని ఓబీ వర్క్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన పెట్టి అన్ని రింగ్ చేయడం, +7 శాతం నుండి +10 శాతం వరకు టెండర్ వేయడం, ఏటీఎంలో వచ్చిన 10 శాతం క్యాష్ డౌన్ చేయాలి అనే నిబంధన పెట్టుకున్నారు. 2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలన్నా ఈయనే రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి. ఇంత స్పష్టంగా నేను బయటపెట్టినా కూడా స్కాం జరగలేదని భట్టి బుకాయించడం శోచనీయం. ఒక నైని గోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు చేయడమే కాదు, సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
వారికి ఎందుకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు..?
ఇప్పటికే కొన్ని అవార్డు అయిన టెండర్లు ఉన్నాయి, మరికొన్ని టెండర్ ప్రక్రియ తొలి దశలో ఉన్నాయి, ఇంకొన్ని టెండర్ దాఖలు చేసే దశలో ఉన్నాయి. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది లోపభూయిష్టమైనది. ఇందులో అవినీతి జరుగుతున్నదని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. మీకు పారదర్శకత్వం ఉంటే, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను క్యాన్సిల్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మే 2025 తర్వాత పిలిచిన టెండర్లలో చాలా మంది కాంట్రాక్టర్లు సైట్ విజిట్ చేశారు. లేఖలు ఇచ్చారు, అధికారిక ఇమెయిల్స్ పంపారు, ఫోటోలు కూడా జతచేశారు. అయినా వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. టెండర్ చివరి గంట వరకు కాంట్రాక్టర్లను వేచిచూసేలా చేసి, కేవలం 2–3 సంస్థలకు మాత్రమే పాత తేదీలతో బ్యాక్‌డేటెడ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. టెండర్ డాక్యుమెంట్‌లో సైట్ విజిట్ చేసిన వెంటనే స్థానిక జీఎం సర్టిఫికేట్ ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మరి సైట్ విజిట్ చేసినప్పటికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ ఆలస్యం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? ఏ చీకటి ఒప్పందం ఉంది? ఎవరి వాటాలు, కమిషన్లు దాగి ఉన్నాయి? అని హరీశ్‌రావు నిలదీశారు.
అప్పుడు నైనీ టెండర్లకు సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతే లేదు..
నైనీ టెండర్‌ను 2021, 2022లో రెండు సార్లు పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ షరతే లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అకస్మాత్తుగా ఎందుకు అవసరమైంది? మే 2025 నుంచి ఇప్పటివరకు ఎన్ని కాంట్రాక్టర్లు సైట్లు సందర్శించారు? ఎన్ని ఇమెయిల్స్, లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికెట్లు జారీ అయ్యాయి? మిగిలినవాటిని ఎందుకు కారణం చెప్పకుండా తిరస్కరించారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్‌సీసీ కంపెనీ, జీఆర్ఎన్ కంపెనీ, మహాలక్ష్మి కంపెనీ ఇలా ఎన్నో కంపెనీలు మెయిల్ చేశాయి మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని. ఈ మెయిల్స్ అన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు బయట పెట్టకపోతే మేమే ఆ మెయిల్స్ ను బయటపెడతాం. జిఎం ఆఫీసు ముందు సెల్ఫీలు పెట్టుకున్నారు, ఇది నిజమా కాదా? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టాలి. వారి అభిప్రాయాలు తీసుకోవాలి. మినిట్స్ నమోదు చేయాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. ఈ తతంగం వెనుక ఏం జరిగింది? మీటింగ్ మినిట్స్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి ఓబీ స్కాం, సోలార్ స్కాం మాత్రమే చెప్పాను. సింగరేణిలో ఇంకా అనేక స్కాములు ఉన్నాయి. ఈ కుంభకోణంలో కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టాడు? ముఖ్యమంత్రి బంధువు కూడా ఆ హోటల్లో కూర్చున్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. అవి టైం వచ్చినప్పుడు బయట పెడతాం అని హరీశ్‌రావు హెచ్చరించారు.
సింగరేణిలో పదుల సంఖ్యలో స్కామ్స్..
డీజిల్‌ను కాంట్రాక్టర్ల పరిధిలోకి తెచ్చిన తర్వాత టర్నోవర్ అర్హత పెంచి 20 ఏళ్ల అనుభవం ఉన్న స్థానిక కాంట్రాక్టర్లను పక్కన పెట్టారు. ఇక నుంచి డీజిల్ కాంట్రాక్టర్ల పరిధిలోనే ఉంటే, ఉన్న కాంట్రాక్టర్లు స్వయంగా డీజిల్ కొనుగోలు చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? మీ స్వార్థం కోసం మైనింగ్ అనుభవం లేని కొత్త కాంట్రాక్టర్లకు దారులు తెరిచారు. మేము బొగ్గు స్కాం అని భయపెట్టగానే నాలుగు పేపర్లు పట్టుకొని వచ్చి, మీడియాని సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన భట్టి గారు.. నేను బయటపెట్టిన సోలార్ స్కామ్, పేలుడు పదార్థాల స్కామ్, ఉద్యోగుల డీ–ప్రొమోషన్ వంటి కీలక అంశాలపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే సింగరేణిలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో స్కాములు జరిగిందన్నది వాస్తవం కాబట్టి. అడ్డగోలుగా నిబంధనలు మార్చి, రేవంత్ రెడ్డి బావమరిదికి, ఇతర అనుయాయులకు టెండర్లు కట్టబెట్టింది నిజం కాబట్టి. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో స్కీములు రాలేదు గానీ పదుల సంఖ్యలో స్కాంలు మాత్రం వచ్చాయి అని హరీశ్‌రావు విమర్శించారు.
సింగరేణిలో తగ్గిపోతున్న బొగ్గు ఉత్పత్తి..
ఈరోజు మీ అవినీతి వల్ల సింగరేణిలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను లేకుండా చేశారు. అందుకనే రోజురోజుకి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్పత్తి పడిపోయింది. బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయి. సింగరేణిలో జరిగిన స్కాంలు మొత్తం సంస్థనే ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇవి నేను చెప్పడం లేదు.. సింగరేణి గణాంకాలే చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను పక్కన పెట్టడం వల్ల ఉత్పత్తి పడిపోయింది. బీఆర్ఎస్ హయాంలో 2021లో 50 ఎంటీ, 2022లో 62 ఎంటీ, 2023లో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాం. కాంగ్రెస్ రాగానే 2024-25లో 69 ఎంటీకి తగ్గింది. ఇప్పుడు 2025-26లో (గత 9-10 నెలల్లో) కేవలం 43 మిలియన్ టన్నులకు పడిపోయింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
సింగరేణికి రేవంత్ మచ్చ తెచ్చారు..
కేసీఆర్ నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టిస్తే... రేవంత్ రెడ్డి 6000 కోట్ల కుంభకోణంతో సింగరేణికి మచ్చ తెచ్చారు. చంద్రబాబు ఆపేస్తే, కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించి 19,500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడున్న 42,000 మందిలో సగం మంది వారసత్వ ఉద్యోగులే. కేసీఆర్ నెలకు ఒక మెడికల్ బోర్డు నిర్వహించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రెండేసార్లు బోర్డు పెట్టింది. మొదటి బోర్డులో 55 మంది వస్తే కేవలం 5 మందిని, రెండో బోర్డులో 123 మంది వస్తే కేవలం 23 మందిని మాత్రమే అన్‌ఫిట్ చేశారు. ఇలా మెడికల్ బోర్డులో కొర్రీలు పెట్టి వారసత్వ ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తున్నారు. సింగరేణి కార్మికులకు యశోద, కిమ్స్ వంటి ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం బంద్ చేశారు. నిమ్స్, ఉస్మానియాకు పొమ్మంటున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
రేవంత్ సోకులకు సింగరేణి డబ్బు..
కేసీఆర్ కార్మికులకు ఇళ్లు ఇచ్చి ఓనర్స్ చేస్తే... కాంగ్రెస్ ఒక్కరికైనా ప్లాట్ ఇచ్చిందా? సింగరేణి గడించిన మొత్తం లాభం రూ. 6,394 కోట్లు అయితే, కేవలం రూ. 2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్‌గా చూపించారు. మిగతా డబ్బు ఏమైంది? కార్మికుల బోనస్‌లో కోత పెట్టి, ఆ డబ్బును ఫుట్‌బాల్ సోకులు, ముఖ్యమంత్రి ప్రచారాలకు వాడుకుంటున్నారు. రెండేళ్లలో సింగరేణి అభివృద్ధి కోసం పక్కన పెట్టిన రూ. 6,000 కోట్లు ఏమయ్యాయి? ఆ స్కాంను కూడా త్వరలో బయటపెడతాం. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిది, 49 శాతం వాటా కేంద్రానిది. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు.
సింగరేణి భవనం ముట్టడిస్తాం..
సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఖరారైన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలి. నైనీ గోల్డ్ బ్లాక్ టెండర్‌తో పాటు, అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలి. వెంటనే ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి. లేదంటే వేల మంది కార్మికులతో సింగరేణి భవనం ముట్టడిస్తాం. నిరాకరించిన కంపెనీల మెయిల్స్, ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బయటపెట్టాలి. భట్టి గారూ... మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ మొత్తం బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టం. సిరుల గని సింగరేణిని కాపాడుకుంటాం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



