త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | పగలు రాహుల్ జపం.. రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ.. రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao | ప‌గ‌లు రాహుల్ గాంధీ జ‌పం చేస్తూ.. రాత్రి వేళ బీజేపీ, టీడీపీతో రేవంత్ దోస్తీ చేస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఖ‌మ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.

S

Telangana | Published On Jan 18, 2026, 6.10 pm IST

Harish Rao | పగలు రాహుల్ జపం.. రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ.. రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్
Advertisement

రేవంత్ రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థాన‌మే ద్రోహాల పుట్ట‌
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి
టీడీపీపై అభిమానం.. మ‌త‌ల‌బు ఏంటి..?
రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే..
భౌతిక‌దాడుల‌కు సీఎం పిలుపు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ప‌గ‌లు రాహుల్ గాంధీ జ‌పం చేస్తూ.. రాత్రి వేళ బీజేపీ, టీడీపీతో రేవంత్ దోస్తీ చేస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఖ‌మ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.

ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర. అడుగడుగునా వెన్నుపోట్లు.. అనుక్షణం అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన 'ఓటుకు నోటు' దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

న‌మ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ద్రోహి రేవంత్

ఎన్టీఆర్ గారు జన్మపర్యంతం ద్వేషించిన కాంగ్రెస్ పార్టీలో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్. సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్. కంచె చేను మేసినట్టు తానే ముఖ్యమంత్రి అయి ఉండి, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ద్రోహి రేవంత్. అవినీతి దాహం, ప్రజా ద్రోహం.. వెరసి రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు.

టీడీపీపై అభిమానం.. మ‌త‌ల‌బు ఏంటి..?

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కార్‌ను వ్యతిరేకిస్తూ ఉంటే.. రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి? కాంగ్రెస్ శత్రువులైన బీజేపీ,టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం.. రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నలలోనే సాగుతున్నది. సోనియా గాంధీ ఇచ్చిన సీఎం పదవిని అనుభవిస్తూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ కమలం చెంతన, కమలానికి కాపు కాస్తున్న బాబు చెంతన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి పరాకాష్ట అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు..?

ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని, ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం అంటే.. అది రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే. ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా? శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు బాధ్యత ఎటు పోయింది? సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, శాంతి భద్రతలను కాపాడే హోమ్ శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు? చట్టం అందరికీ ఒక్కటేనని నిరూపించే ధైర్యం పోలీస్ శాఖకు ఉందా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే.. భౌతిక‌దాడుల‌కు సీఎం పిలుపు

రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగేలా బదులిస్తాం, ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం నేర్పుతాము. తెలంగాణ డీజీపీ గారు.. ఈ హింసను ప్రేరేపించే సీఎం వ్యాఖ్యలపై మీరు తీసుకునే చర్యలేమిటి? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement