Harish Rao | నవంబర్ 29 లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణే లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా
Harish Rao | దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేసీఆర్ తెలంగాణ తేకుంటే రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ల బూట్ల కాడో,
చంద్రబాబు అడుగులో అడుగు వేసుకుంటూ తిరుగుతుండేవాడు
సిద్దిపేట సభకు 50 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి..
సిద్దిపేటకు కనీసం 50 పైసలైనా ఇచ్చావా?
నాగార్జున సాగర్‌కు పొక్క కొట్టి ఆంధ్రకు అప్పజెప్పే కుట్ర..
రాముడి పాలన పోయి రాష్ట్రంలో రాక్షస పాలన వచ్చింది
నవంబర్ 29 దీక్షా దివస్ అయితే..
డిసెంబర్ 9ని విజయ దివస్‌గా జరుపుకోవాలి
దీక్షా దివస్ సందర్భంగా హరీశ్ రావు వ్యాఖ్యలు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నవంబర్ 29కి సిద్దిపేటతో అవినాభావ అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ గతిని మలుపు తిప్పి, చరిత్ర పుటల్లో నిలిచిపోయిన మహోన్నత దినం నవంబర్ 29. ఇవాళ మనందరం ఇంత ఆనందంగా ఉన్నాం, స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం స్వరాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకొని బతుకుతున్నామంటే దానికి కారణం నవంబర్ 29న కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షే. ఈ ఆమరణ నిరాహార దీక్షను కూడా కేసీఆర్ మన క్యాంపు ఆఫీస్ కింద ఉండే ఇదే అంబేద్కర్ భవన్లో జరిగిన ఒక చిన్న సమావేశంలో ప్రకటించారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదాన్ని సిద్దిపేట గడ్డ మీద, సిద్దిపేట మట్టి మీద నుంచే కేసీఆర్ ప్రకటించారు. ఆమరణ నిరాహార దీక్ష వేదిక కూడా సిద్దిపేటే. రంగనాయకులపల్లి చౌరస్తాలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఎముకలు కొరికే చలిలో పోలీసులు వచ్చి ఆ శిబిరాన్ని భగ్నం చేసి స్వాధీనం చేసుకోవాలని చూశారు. అయినా ఎంతోమంది కార్యకర్తలు చలిమంటలు కాచుకుంటూ రాత్రంతా అక్కడే పడుకుని కాపలా కాశారు. ఈ పోరాటంలో మీరందరూ భాగస్వాములు ఇక్కడ ఎవరిని కదిలించినా ఒక సైనికుడిలా గర్జిస్తారు. ఈ సందర్భంగా మన స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి అన్నను కూడా గుర్తు చేసుకోవాలన్నారు.
దేశపతి శ్రీనివాస్ ఆలోచనలో నుంచి ఈ దీక్షా దివస్ పుట్టింది

నవంబర్ 29వ తేదీకి దీక్షా దివస్ అని నామకరణం చేసి, ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించింది కూడా మన సిద్దిపేటే. దేశపతి శ్రీనివాస్ ఆలోచనలో నుంచి ఈ దీక్షా దివస్ పుట్టింది. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ఉంటుందా.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2వ తేదీ ఉంటుందా.. జూన్ 2వ తేదీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఉంటుందా.. అసలు తెలంగాణ రాష్ట్రమే లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా.. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 11 రోజుల తర్వాత, డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కానీ ప్రకటన రాగానే ఆంధ్రా ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని పార్టీల వాళ్లు రాజీనామాలు చేసి ఒత్తిడి తేవడంతో, 14 రోజుల్లోనే అంటే డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంది. నోటికాడి బుక్క లాగేసినట్టు, వచ్చినట్టే వచ్చి తెలంగాణ మళ్లీ వెనక్కి పోయిందనే ఆవేదనతో, మీరు కూడా రాజీనామాలు చేయండి అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తూ వందలాది మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ వందల మంది అమరుల బలిదానాలకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే కారణం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు

ఢిల్లీ వెనక్కి తగ్గిన తర్వాత మళ్లీ కేసీఆర్ జేఏసీని ఏర్పాటు చేసి, రాజకీయ పార్టీలను ఏకం చేసి, కోదండరాంని జేఏసీ చైర్మన్‌గా పెట్టి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఢిల్లీ మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేలా చేసింది కేసీఆరే. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఇటలీ బొమ్మ అన్నాడు. ఉద్యమకారులపై తుపాకీ పట్టుకొని బయలుదేరిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చిన ద్రోహి నువ్వు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ల బూట్ల కాడనో, ఆంధ్రోళ్ల కాళ్ల కాడనో పడి ఉండేవాడు. కేసీఆర్ తెలంగాణ తేకుంటే నువ్వెక్కడ ఉండేవాడివి? అదే చంద్రబాబు నాయుడు అడుగులో అడుగు వేసుకుంటూ తిరుగుతుండేవాడివని విమర్శించారు.
పరిపాలన అంతా ఆగమాగం

కేసీఆర్ తన దీక్షతో, పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, తన పరిపాలనా దక్షతతో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో యావత్ దేశం తెలంగాణ వైపు చూసి నేర్చుకునేలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన అంతా ఆగమాగం అయిపోయింది. ఆనాడు జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. రైతుబీమా ఆగింది, కేసీఆర్ కిట్ ఆగింది, గొర్రెల పంపిణీ ఆగింది, న్యూట్రిషన్ కిట్ ఆగింది, ఫీజు రీయింబర్స్మెంట్ ఆగింది. అభివృద్ధి కుంటుపడి రాష్ట్రమంతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, రియల్ ఎస్టేట్ కుప్పకూలింది, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రేవంత్ రెడ్డి చేతగాని పాలనలో రాష్ట్రం వెనక్కి పోతోంది. ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్నాయి, వడ్లు కొనవయ్యా రేవంత్ రెడ్డి అని రైతులు మొత్తుకుంటుంటే ఆయనకు ఆ బాధే లేదు. ఏమన్నా అంటే మూసీ సుందరీకరణ, ఇండస్ట్రియల్ సమ్మిట్ అంటాడు. ఢిల్లీకి, హైదరాబాద్‌కు ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టుగా పాలన నడుస్తోంది అని ధ్వజమెత్తారు.
చివరికి కోడిగుడ్లలో కూడా అవినీతే

ఇవాళ నాగార్జున సాగర్‌ను కూడా ఆంధ్రకు అప్పజెప్పే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ వాళ్లు సాగర్‌కు పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోతూ ప్రాజెక్టును వశం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ సోయి లేకుండా తన గురువును రక్షించే పనిలో ఉన్నాడు. కాలువల్లో నీళ్లు లేవు కానీ, కాంగ్రెస్ పాలనలో అవినీతి వరద మాత్రం ప్రవహిస్తోంది. గురుకుల పాఠశాలల పిల్లలకు ఇచ్చే బట్టల్లో, భోజనాల్లో, చివరికి కోడిగుడ్లలో కూడా అవినీతే. పరిపాలన అంతా అస్తవ్యస్తమై, అవినీతిమయమైపోయిందని నిప్పులు చెరిగారు.
సిద్దిపేటకు కనీసం 50 పైసలైనా ఇచ్చావా..?
ఉద్యోగులు రోడ్ల మీదకు వస్తున్నారు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రోడ్ల మీదకు వస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు, కానీ నెలకు ఇస్తామన్న రూ.2,500కు ఈరోజు అతీగతీ లేదు. రాష్ట్రంలో రాముడి పాలన పోయి రాక్షస పాలన వచ్చింది. ఈ రాక్షస పాలనను అంతమొందించి, మళ్లీ రామరాజ్యం తెచ్చుకోవడానికి మనందరం మరోసారి దీక్ష పూనాల్సిన అవసరం ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రమే రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? సిద్దిపేటకు రైలు వచ్చేదా? సిద్దిపేటకు గోదావరి జలాలు వచ్చేవా? ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లు గడిచినా సిద్దిపేటకు చుక్క నీళ్లు రాలేదు, రైలు అనేది గోడల మీద రాతల్లోనే ఉండేది. గోదావరి నీళ్లు తెస్తామంటే నవ్వినోళ్ల కళ్లముందే ఇవాళ సిద్దిపేట కాలువల్లో గోదావరి జలాలు నిండుగా ప్రవహిస్తున్నాయి, రైలు మన కళ్లముందే తిరుగుతోంది. మొన్న రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి, జనం రావాలని 26 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో జనాన్ని తరలించుకున్నారు. బస్సులకు, మీటింగ్‌కు కలిపి ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు కానీ, సిద్దిపేటకు కనీసం 50 పైసలైనా ఇచ్చావా..? 26 నియోజకవర్గాల నుంచి మందిని తెచ్చి, బ్యానర్లు పెట్టుకొని గొప్పలు చెప్పుకొని పోయావు తప్ప సిద్దిపేట ప్రజలకు నువ్వు చేసిన మేలేమిటి? సిద్దిపేట మట్టి పరిమళాల ముందు ఆ గాలి ఎక్కడో కొట్టుకుపోయింది అని మండిపడ్డారు.
ప్రజలు ఉప్పెనలా కదిలారు

ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఇక్కడున్న సీనియర్లకు ఉద్యమ చరిత్ర తెలుసు కానీ, ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న మలితరాలకు, నేటి పిల్లలకు ఆనాటి కేసీఆర్ దీక్ష, పోరాటం, త్యాగాలను తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన సిద్దిపేట పాత బస్టాండ్ ముందు నిరాహార దీక్షా శిబిరం ఏకంగా 1,531 రోజుల పాటు నడిచింది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆ దీక్షలో నాలుగైదు సార్లు కూర్చున్నారు. ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా మన సిద్దిపేట దీక్షా శిబిరానికి వచ్చి అందరితో మాట్లాడి, మీరెందుకు తెలంగాణ కావాలంటున్నారు? అని అడిగి వెళ్లారు. అంత గొప్ప చరిత్ర మన సిద్దిపేటకు ఉంది. శంకరక్క కోరినట్టుగా తప్పకుండా చిన్నగుండవెల్లికి వెళ్లి, స్కూల్లో మంచి బోర్డు పెట్టించి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చిన రోజు ఎవరెవరు ఏం మాట్లాడారో ఎప్పటికీ గుర్తుండిపోయేలా రాయిస్తానని మాట ఇస్తున్నాను. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో బోరు వేస్తే వాల్టా యాక్ట్ అని, చెట్టు కొడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని, గుంత తీస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని లెక్కలేనన్ని అక్రమ కేసులు పెట్టారు. సిద్దిపేట నిండా పోలీసులను పెట్టి ఊర్లలో ప్రజలు బయటకు రాకుండా అడ్డంకులు సృష్టించినా, వాటన్నింటినీ దాటుకుని ప్రజలు ఉప్పెనలా కదిలారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఈ రెండూ తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజులు
నన్ను, మా రంగారెడ్డి, కనకయ్య, ఐలయ్య సహా ఎంతోమందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఎంతమందిని జైల్లో వేసినా, ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టినా తెలంగాణ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేకపోయారు. సాగరహారం కార్యక్రమం అప్పుడు 50 లారీలు పెట్టుకొని, జెండాలు పట్టుకొని ట్యాంక్‌బండ్‌కు, నెక్లెస్ రోడ్డుకు వెళ్లి అద్భుతంగా విజయవంతం చేశాం. స్వాతంత్య్రోద్యమకారులను చరిత్ర ఎప్పటికీ గౌరవించినట్టే, తెలంగాణ ఉద్యమకారులు కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను తెలియజేయడంలో విలేకరులు కూడా ఎంతో గొప్పగా పనిచేశారు, వారి కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. నవంబర్ 29ని మనం 'దీక్షా దివస్'గా జరుపుకున్నట్టే, డిసెంబర్ 9ని కూడా 'విజయ దివస్'గా జరుపుకోవాలి. ఎందుకంటే ఈ రెండూ తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజులు. తెలంగాణ ఉద్యమం ఒక్కరోజుది కాదు, 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. 1956లో రాష్ట్రాన్ని కలపొద్దని పోరాటం జరిగింది, సిటీ కాలేజీ ఫైరింగ్‌లో పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 1969 ఉద్యమం జరిగింది, మళ్లీ మలిదశ ఉద్యమం జరిగింది. 60 ఏళ్ల పోరాటం, ఎందరో అమరుల త్యాగఫలితం, కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. చివరకు జై తెలంగాణ అని నినదించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?
నవంబర్ 29, 2026

TRS Protest | పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ నేతల ఆందోళన.. కర్రలతో స్థానికుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
నవంబర్ 29, 2026

Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!
నవంబర్ 29, 2026
తాజావార్తలు
- ●RSS | సంబరాల కోసం కాదు.. సమాజ సేవకు మరో అవకాశం.. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!
- ●Priyanka Chopra | రామాయణ ఫ్లాప్ అంటూ నెటిజన్ పోస్ట్ - లైక్ కొట్టిన ప్రియాంక చోప్రా
- ●IND Vs NZ Test | రెండో టెస్టులో భారత్‌కు కష్టాలు.. కివీస్ ఆధిక్యం 243 రన్స్
- ●KTR | డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?
- ●GCC | సాఫ్ట్వేర్ నుంచి సెమీకండక్టర్ల దాకా.. కొత్త తరం పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ
- ●TRS Protest | పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ నేతల ఆందోళన.. కర్రలతో స్థానికుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత

RSS | సంబరాల కోసం కాదు.. సమాజ సేవకు మరో అవకాశం.. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!

Priyanka Chopra | రామాయణ ఫ్లాప్ అంటూ నెటిజన్ పోస్ట్ - లైక్ కొట్టిన ప్రియాంక చోప్రా

IND Vs NZ Test | రెండో టెస్టులో భారత్‌కు కష్టాలు.. కివీస్ ఆధిక్యం 243 రన్స్

KTR | డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?



