త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీఆర్ఎస్‌దే : తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav | జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చినా, రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

P

Telangana | Published On Jun 6, 2026, 3.47 pm IST

Talasani Srinivas Yadav | ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీఆర్ఎస్‌దే : తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

Talasani Srinivas Yadav | జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చినా, రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 14న ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అయ్యేలా బూత్ స్థాయి ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అలాగే ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందా లేదా అనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నించాలని తలసాని సూచించారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో సముచిత స్థానం, గుర్తింపు లభిస్తాయని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని తలసాని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచింది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు, అబద్ధాలకు పెట్టింది పేరని విమర్శించిన ఆయన, ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అసహనంగా స్పందిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసినా వాటిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ నిధులను ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తలసాని అన్నారు. రాష్ట్రంలో "కాంగ్రెస్ పోవాలి... కేసీఆర్ రావాలి" అనే భావన ప్రజల్లో పెరుగుతోందని పేర్కొన్నారు. మరో రెండున్నర సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అయినా, అసెంబ్లీ ఎన్నికలు అయినా, ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement