త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ద‌స‌రా వ‌స్తున్నాసింగ‌రేణి లాభాలు డిక్లేర్ చేయ‌లే.. వాటా తేల్చ‌లే

Harish Rao | ద‌స‌రా ముంగ‌ట సింగ‌రేణి లాభాలు డిక్లేర్ చేయ‌డం, లాభాల్లో వాటా ఇవ్వ‌డం ఆన‌వాయిత‌ని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు అన్నారు. కేసీఆర్ 33 శాతం వాటా ఇస్తే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేవ‌లం 16 శాత‌మే వాటా ఇస్తోందని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Oct 8, 2026, 6.14 pm IST

Harish Rao | ద‌స‌రా వ‌స్తున్నాసింగ‌రేణి లాభాలు డిక్లేర్ చేయ‌లే.. వాటా తేల్చ‌లే
Advertisement
  • రూ.6,323 కోట్ల లాభాలు దాచి పెట్టారు
  • ద‌స‌రా ముంగ‌ట లాభాల్లో వాటా ఇవ్వ‌డం ఆన‌వాయితీ
  • కేసీఆర్ 33 శాతమిస్తే.. కాంగ్రెస్ 16 శాత‌మే వాటా ఇస్తోంది
  • కార్మికుల‌కు తీర‌ని అన్యాయం చేస్తున్న‌రు
  • మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ఫైర్

త్రినేత్ర న్యూస్‌: ద‌స‌రా ముంగ‌ట సింగ‌రేణి లాభాలు డిక్లేర్ చేయ‌డం, లాభాల్లో వాటా ఇవ్వ‌డం ఆన‌వాయిత‌ని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు అన్నారు. కేసీఆర్ 33 శాతం వాటా ఇస్తే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేవ‌లం 16 శాత‌మే వాటా ఇస్తోందని విమ‌ర్శించారు. దసరా వస్తున్నా సింగరేణి లాభాలు డిక్లేర్ చేయలేద‌ని.. వాటాలు తేల్చ‌లేద‌ని మండిప‌డ్డారు. 2024-25లోొ ఇచ్చింది కేవలం 12.5 శాత‌మేన‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం
సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఫైర‌య్యారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం టీబీజీకేఎస్, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు.

ఈనెల 14న సింగ‌రేణి కార్మిక గ‌ర్జ‌న స‌భ‌

ఈనెల 14వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు రామగుండంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మిక గర్జన పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. కార్మికులే కాదు, అధికారులు నడిరోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. లాభాల్లో పూర్తి వాటా అందించాలని, డిపెండెంట్ ఉద్యోగాలను మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులకు ఇవ్వాలని, వెంటనే సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని, సింగరేణి బకాయిలు త్వరగా చెల్లించాలనేవి ప్రధాన డిమాండ్లు.

వీటితో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసారు. వాటన్నింటిని అమలు చేయాలని డిమాండ్ తో సభ నిర్వహిస్తున్నాం. దసరా ముందు లాభాలు డిక్లేర్ చేయడం, లాభాల్లో వాటా ఇవ్వడం ఆనవాయితీ. కానీ దసరా పండుగ వస్తున్నా, సింగరేణి లాభాలు డిక్లేర్ చేయలేదు, వాటాల గురించి చెప్పడం లేదు. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ సింగరేణి కార్మికులను మోసం చేసింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పడు 32 శాతం లాభాల వాటా ఇస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కేవలం 16శాతమే ఇచ్చింది. మాటల్లో 33 శాతం చెప్పి, నిజానికి ఇచ్చింది కేవలం 16 శాతం వాటానే.

వచ్చిన లాభాల్లో భవిష్యత్ అవసరాల పేరిట పక్కన బెట్టి వాటా పంచారు. 2024-25లో ఇచ్చింది కేవలం 12.5 శాతమే. ఈ సంవత్సరం ఇంకా లాభాలు డిక్లేర్ చేయడం లేదు. వాటా తేల్చడం లేదు. అవినీతి, బంధుప్రీతి, పరిపాలన వైఫల్యం వల్ల సింగరేణి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2022-23లో 2022 కోట్లు, 2023-24లో 4712 కోట్లు, 2024-25 6,394 కోట్లు లాభాలు వస్తే ఈ సంవత్సరం డిక్లేర్ చేయలేదు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం 1800 కోట్లు కూడా మించదు. ఇంత దారుణంగా మూడు వంతులు లాభాలు తగ్గడం అంటే సింగరేణి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం ఎవరు. పరిపాలన వైఫల్యం కాదా?

రేవంత్ తుగ్లక్ నిర్ణయాల వల్ల సింగరేణి లాభాలు పడిపోతున్న పరిస్థితి. కార్మికులు మాత్రం అద్భుతంగా పని చేస్తున్నారు. గతంలో ఔట్ పుట్ ఫర్ మ్యాన్ షిప్ట్ చూస్తే గతంలో 6.39 టన్నులు ఉంటే, ఈ ఏడాదికి 7.56కు పెరిగింది. కార్మికులు కష్టం చేసారు కానీ అడ్డగోలు నిర్ణయాలు సింగరేణిని నష్టాల బాట పట్టిస్తున్నాయి. సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టడం, నెలల తరబడి టెండర్లు వాయిదా వేయడం, అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టడం, రేవంత్ బామ్మర్దికి టెండర్లు ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది. అవినీతి, బంధుప్రీతి వల్ల సింగరేణి ప్రొడక్షన్ తగ్గిన పరిస్థితి. బీఆర్ఎస్ ప్రొడక్షన్ పెంచితే, కాంగ్రెస్ కాలంలో ప్రొడక్షన్ తగ్గింది.

కుంభ‌కోణాల గ‌నిగా మార్చారు..

2023-24లో 70 మిలియన్ టన్నుల నుంచి 2025–26కు 58 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గింది. 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో బొగ్గు ఉత్పత్తి పెరిగింది, కాంగ్రెస్ రాగానే ఎందుకు తగ్గింది భట్టి గారు సమాధానం చెప్పాలి. నిజాయితీగా పని చేసే అధికారులను మంచి డైరెక్టర్లను తొలగించారు. సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు. అనేక రకాల స్కాంలు చేసారు. సకాలంలో మైన్స్ ఓపెన్ చేయక, కాంట్రాక్టర్లకు పేమెంట్స్ ఇవ్వక నష్టాలకు వెళ్తున్నది. మీ చేతగాని తనం వల్ల, మీ నిర్వాకం వల్ల ఈ పరిస్థితి.

4 వేల కోట్ల ఓడీ ఎందుకు తెస్తున్నరు

రాష్ట్రంలో బొగ్గు లేక థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆపేసారు. బొగ్గు లేక కరెంట్ ఉత్పత్తి చేయక రైతులు రోడ్లు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నరు. సింగరేణికి చెల్లింపులు 50వేల కోట్లు దాకా ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి జెన్కో నుంచి చెల్లింపులే లేవు. వాటా పంచకుండా 6,323 కోట్ల లాభాలను బ్యాంకుల్లో దాచి పెట్టారు. మరి 4 వేల కోట్ల ఓడీ ఎందుకు తెస్తున్నరు. జీతాలు ఇవ్వాలంటే ఎందుకు అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది.

పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రతి సంవత్సరంలో లాభాలు పెరిగాయి. కరోనా వచ్చిన లాభాలు తగ్గలేదు. కాంగ్రెస్ రాంగనే కార్మికుల వాటా ఎందుకు తగ్గింది, లాభాలు ఎందుకు తగ్గుతున్నాయి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జీవో 76 మేం తెచ్చినం అని అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నరు. ఇంటి హక్కులు కార్మికులకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ గారు 2019లో జీవో ఇచ్చారు. కానీ పొంగులేటి గారు వైయస్ హయాంలో జీవో ఇచ్చినం అని చెప్పుకుంటున్నారు.

సింగరేణి ప్రాంతంలో 30వేల మందికి ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు. కాంగ్రెస్ రాగానే జీవోను పక్కన బెట్టి నిషేధిత జాబితాలో పెట్టారు. ఒక్క మంచిర్యాలలోనే వేల జాగలు నిషేధిత జాబితాలో పెట్టారు. మూడేళ్లు ఏం చేయకుండా బిగ్ రిలీఫ్, కార్మికులకు శుభవార్త అంటున్నరు. మూడేళ్లు కార్మికుల ఉసురు పోసుకున్నందుకు క్షమాపణ చెప్పాలి.

వెంటనే జీవో 76 కింద మిగిలిన కార్మికులకు సేల్ డీడ్ ద్వారా హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో వలే, కార్మికులకు ప్రతి నెలా 3 మెడికల్ బోర్డులు పెట్టి, డిపెండెంట్ ఉద్యాగాలు ఇవ్వాలి. కేసీఆర్ గారు 16వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. 4వేల మందికి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా 20వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.

డిపెండెంట్ ఉద్యోగాల మీద అప్రకటిత నిషేధాన్ని పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు, చర్యలను మానుకోవాలని, బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. సింగరేణి కార్మికుల సమస్యల పట్ల బిఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణికి మైన్స్ కేటాయించాలని, సంస్థను కాపాడుకునేందుకు కేంద్ర బొగ్గు మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు చొరవ చూపాలని కోరుతున్నాం. 40లక్షల బొగ్గు లేనిది ఉన్నట్లు చూపారు. మేం మాట్లాడితే బుకాయించారు. దీనిపై కేంద్రం చర్యలు మాత్రం తీసుకోలేదు. పెద్ద ఎత్తున కార్మికులు, సింగరేణి ప్రాంత ప్రజలు తరలి వచ్చి రామగుండంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.

Advertisement
Advertisement