త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Employees Health Scheme | ‘ఈహెచ్ఎస్’ ప‌థ‌కం ప్రారంభం.. ప్ర‌తి జిల్లాలో వెల్‌నెస్ సెంట‌ర్

Employees Health Scheme | ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల చేతికి కొత్త హెల్త్ కార్డులు అందాయి. ఎన్నో నెల‌ల నుంచి ఊరించిన రేవంత్ స‌ర్కార్.. చివ‌ర‌కు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ‌న‌ర్సింహ చేతుల మీదుగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొత్త హెల్త్ కార్డుల‌ను అంద‌జేసింది.

S

Telangana | Published On Jul 17, 2026, 4.05 pm IST

Employees Health Scheme | ‘ఈహెచ్ఎస్’ ప‌థ‌కం ప్రారంభం.. ప్ర‌తి జిల్లాలో వెల్‌నెస్ సెంట‌ర్
Advertisement

Employees Health Scheme | త్రినేత్ర‌.న్యూస్ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల చేతికి కొత్త హెల్త్ కార్డులు అందాయి. ఎన్నో నెల‌ల నుంచి ఊరించిన రేవంత్ స‌ర్కార్.. చివ‌ర‌కు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ‌న‌ర్సింహ చేతుల మీదుగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొత్త హెల్త్ కార్డుల‌ను అంద‌జేసింది. రాష్ట్ర స‌చివాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ట్రస్ట్ డీడ్‌ను ఆవిష్కరించి, NEHS వెబ్ పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు డిజిటల్ హెల్త్ కార్డులను విడుదల చేసి ఉద్యోగ సంఘాల నాయకులకు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను అమలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు.

పార‌ద‌ర్శ‌కంగా న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో ఉద్యోగులు, పెన్షనర్ల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మరింత సమర్థవంతమైన, సుస్థిరమైన, పారదర్శకమైన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను రూపొందించాం. గతంలో అమలులో ఉన్న పథకంలో ప్యాకేజీ రేట్లు తక్కువగా ఉండటం, అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ భాగస్వామ్యం కాకపోవడం, క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం, ఉద్యోగులకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారంగా ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చామ‌ని తెలిపారు.

17,88,336 మంది ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త‌

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 17,88,336 మంది లబ్ధిదారులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. ఇందులో 4,38,594 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3,61,955 మంది పెన్షనర్లు, సుమారు 9.88 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు చెల్లించే కంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వం కూడా తన వంతు కంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రతి రూపాయి ఈ పథకం అమలుకే వినియోగించబడుతుందని మంత్రి స్ప‌ష్టం చేశారు.

886 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ వైద్య సేవలు

రాష్ట్రవ్యాప్తంగా 886 ప్రైవేట్ హాస్పిటల్స్, 114 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, కామినేని, కాంటినెంటల్, కేర్, స్టార్, బసవతారకం వంటి ప్రముఖ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు అత్యాధునిక వైద్య సేవలు పొందే అవకాశం కల్పించాము. ఈ పథకంలో భాగస్వాములైన అన్ని హాస్పిటళ్ల యాజమాన్యాలకు, వైద్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ విధానానికి అనుగుణంగా 1,816 వైద్య, శస్త్రచికిత్స ప్యాకేజీలను ఈ పథకంలో అమలు చేస్తున్నాము. దీని ద్వారా ఉద్యోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందడమే కాకుండా, ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం కూడా పెరుగుతుందన్నారు.

డిజిటల్ విధానంలోనే ప్రీ ఆథ‌రైజేష‌న్ టు క్లెయిమ్ సెటిల్‌మెంట్

ఈ పథకాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ద్వారా అమలు చేస్తున్నాము. ట్రస్ట్‌లో ప్రభుత్వం, ఉద్యోగులు, పెన్షనర్ల ప్రతినిధులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పారదర్శకంగా పథకాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగులు, పెన్షనర్లు తమ డిజిటల్ హెల్త్ కార్డులను వెబ్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాం. ప్రీ-ఆథరైజేషన్ నుంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తామ‌ని మంత్రి తెలిపారు.

ప్ర‌తి జిల్లాకు వెల్‌నెస్ సెంట‌ర్

ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో వెల్‌నెస్ సెంటర్ల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రస్తుతం రాష్ట్రంలోని 12 వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ప్రతిరోజూ సుమారు 1,800 మందికి ఔట్‌పేషెంట్ సేవలు అందుతున్నాయి. ప్రతి కేంద్రంలో ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ వైద్యులు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ల్యాబ్ పరీక్షలు, బ్రాండెడ్ మందులు అందుబాటులో ఉన్నాయి. త్వరలో రాష్ట్రంలో వెల్‌నెస్ సెంటర్లు లేని 24 జిల్లాల్లో మరో 24 వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాము. ప్రతి వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌తో అనుసంధానం చేసి, అక్కడి స్పెషలిస్ట్‌, సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామ‌ని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. వారి సంక్షేమం కోసం అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటూ, మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోద‌ర స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement