త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం

Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని నీటి పారుద‌ల‌శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌ నినో ప్రభావం, సాగునీటి లభ్యత, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్ శుక్రవారం శాసనసభలో స్పందించారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేశామని తెలిపారు.

P

Telangana | Published On Sep 18, 2026, 3.54 pm IST

Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం
Advertisement
  • రైతులు, తాగునీరు, జలహక్కుల పరిరక్షణే లక్ష్యం
  • నీరు సరిపోని చోట పంటలు వేయమని చెప్పడం బాధ్యతారాహిత్యం
  • కృష్ణా జలాల్లో రాష్ట్రం న్యాయమైన వాటా సాధిస్తాం
  • కాళేశ్వరం బ్యారేజీల విషయంలో భద్రతే ప్ర‌ధానం
  • శాస‌న‌స‌భ‌లో నీటిపారుద‌ల‌శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy | ఎల్‌నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని నీటి పారుద‌ల‌శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌ నినో ప్రభావం, సాగునీటి లభ్యత, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్ శుక్రవారం శాసనసభలో స్పందించారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేశామని తెలిపారు. ‘ఇది రైతు ప్రభుత్వం.. అన్నదాతలను ఒంటరిగా వదలం’ అని పేర్కొన్న మంత్రి.. కరువు తీవ్రతకు పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనా వైఫల్యాలతోపాటు ఎల్‌ నినో ప్రభావం కూడా కారణమని అన్నారు. ఎల్‌ నినో తీవ్రతపై ముందుగానే రైతులకు అవగాహన కల్పించామని, వర్షపాతం తగ్గే అవకాశం, సాగునీటి కొరతపై అన్నదాతలను అప్రమత్తం చేశామని చెప్పారు. రైతులు నష్టపోకుండా పంటల ఎంపికపై ముందస్తు సూచనలు ఇచ్చామని వివరించారు. ఆయకట్టు వారీగా నీటి లభ్యతపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నామని ఉత్తమ్‌ తెలిపారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం ద్వారా జలాశయాల పరిస్థితిని వివరిస్తున్నామని చెప్పారు. నీరు సరిపోని చోట పంటలు వేయమని చెప్పడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.

శ్రీ‌శైలంలో నీటి ల‌భ్య‌త త‌గ్గింది..

రాష్ట్రంలో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రజల తాగునీటి అవసరాలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి అవసరాలు తీర్చిన తరువాతే మిగులు జలాలను సాగుకు విడుదల చేస్తామని తెలిపారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నీటి నిల్వలను పరిరక్షిస్తున్నామని చెప్పారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నీటి బడ్జెట్‌ అమలు చేస్తున్నామని, జలాశయాల నిల్వలు, కొత్త ప్రవాహాలను పది రోజులకోసారి సమీక్షిస్తున్నామని వెల్లడించారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సమర్థంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత నీటి పరిస్థితిని వివరిస్తూ శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో వినియోగయోగ్యమైన నీటి లభ్యత గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని ఉత్తమ్‌ తెలిపారు. ‘శ్రీశైలంలో వినియోగయోగ్యమైన నీరు గత ఏడాది 153.56 టీఎంసీలు.. ప్రస్తుతం 61.65 టీఎంసీలే’ అని చెప్పారు. ‘నాగార్జునసాగర్‌లో గత సంవత్సరం 174.25 టీఎంసీలు.. ఈసారి 44.89 టీఎంసీలే’ అని వివరించారు. జలాశయాల్లో కనిపించే మొత్తం నీరు సాగుకు అందుబాటులో ఉన్నట్లు కాదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 44,034 చెరువుల్లో 40 శాతం పావు సామర్థ్యం కన్నా తక్కువగా నిండాయని తెలిపారు. నీటి పరిస్థితిపై వాస్తవాలను దాచకుండా ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు.

కృష్ణా జలాల్లో చుక్క నీటిని వదులుకోం..

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు ప్రభుత్వం అన్ని వేదికలపై బలంగా వాదిస్తోందని ఉత్తమ్‌ తెలిపారు. ‘కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించి తీరుతాం. తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటినీ వదులుకోం’ అని స్పష్టం చేశారు. కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్‌, కేఆర్‌ఎంబీ, కేంద్రం వద్ద బలంగా వాదిస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో 66:34 తాత్కాలిక నిష్పత్తిని శాశ్వత హక్కుగా అంగీకరించలేదని తెలిపారు. 50:50 పంపిణీ కోసం తెలంగాణ పట్టుబట్టిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా మంత్రి తీవ్రంగా స్పందించారు. గత పాలకుల నిర్మాణ వైఫల్యంతోనే మేడిగడ్డ నిరుపయోగంగా మారిందని ఆరోపించారు. మేడిగడ్డ ఏడో బ్లాక్‌ దెబ్బతినడంతో నీటి మళ్లింపునకు పనికిరాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రస్తుతం నీటి నిల్వకు సురక్షితం కావని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసింది. ప్రజల ప్రాణభద్రతను పణంగా పెట్టి కాళేశ్వరం బ్యారేజీలను వినియోగించలేం’ అని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. చిన్న మరమ్మతుతోనే కాళేశ్వరాన్ని నడపవచ్చన్న బీఆర్‌ఎస్‌ వాదన సాంకేతికంగా త‌ప్ప‌న్నారు. ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారమే బ్యారేజీల పునరుద్ధరణ చేపడతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సురక్షితంగా ఉన్న లింక్‌–2 ద్వారా పంపింగ్‌ కొనసాగిస్తున్నామని చెప్పారు.

పాలమూరు–రంగారెడ్డి పనులు పూర్తి చేస్తాం.

పాలమూరు–రంగారెడ్డి పథకం 90 శాతం పూర్తయిందన్న బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని మంత్రి ఖండించారు. కేవలం పంప్‌హౌస్‌లు నిర్మిస్తే ఎత్తిపోతల పథకం పూర్తయినట్లు కాదని అన్నారు. ఈ ప్రాజెక్టులో కాలువలు, పంపిణీ వ్యవస్థ, భూసేకరణ, పునరావాస పనులు అసంపూర్తిగా ఉన్నాయని వివరించారు. చట్టబద్ధ అనుమతులు, మిగిలిన నిర్మాణాలు పూర్తిచేసి పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని వినియోగంలోకి తెస్తామని ఉత్తమ్‌ చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పూర్తిచేస్తామని తెలిపారు. కాలువల మరమ్మతులు, పంపింగ్‌ వ్యవస్థల పునరుద్ధరణను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నిలిచిన పంటలను రక్షించడంతోపాటు యాసంగి అవసరాలకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎల్‌ నినోను ఆపలేకపోయినా దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘రైతుల పంటలు, ప్రజల తాగునీరు, రాష్ట్ర జలహక్కుల పరిరక్షణే మా లక్ష్యం’ అని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement