DGP Shivdhar Reddy | రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు : డీజీపీ శివధర్ రెడ్డి
DGP Shivdhar Reddy | రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్లే పాదచారుల ప్రాణాలు పోతున్నాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు.
DGP Shivdhar Reddy | త్రినేత్ర.న్యూస్ : రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్లే పాదచారుల ప్రాణాలు పోతున్నాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు. సైబరాబాద్ సీపీ ఆఫీసు ఆడిటోరియంలో డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు.. సైబర్ క్రైమ్, ట్రాఫిక్ పరిస్థితులు, క్రైమ్స్ ఇతర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ట్రాఫిక్ భద్రతపై డీజీపీ అత్యంత కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారుల మరణాల రేటు ఎక్కువగా ఉండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు రోడ్డు ప్రమాదాలపై అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. "పెడ్‌స్ట్రియన్ కింగ్ ఆన్ ది రోడ్" (పాదచారులే రోడ్డుపై రాజులు) అనే నినాదం ఉన్నప్పటికీ, వారి ప్రాణాలు ప్రమాదాల్లో పోవడం దురదృష్టకరమని, దీనిని అరికట్టడానికి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషించే 42–45 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, తద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా వీధిన పడుతున్నాయని డీజీపీ గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రతి డ్రైవర్ చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ వాహనం నడిపే "డిఫెన్సివ్ డ్రైవింగ్" (రక్షణాత్మక డ్రైవింగ్) పద్ధతిని అలవర్చుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత అనేది కేవలం నిబంధనల అమలు మాత్రమే కాదని, అది ఒక బాధ్యతగా ప్రతి పౌరుడికి తెలిసేలా ఈ అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ భద్రతతో పాటు, సమాజంలో పెరుగుతున్న నేరాలు, సైబర్ క్రైమ్స్ జరుగుతున్న తీరుపై డీజీపీ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ప్రస్తుత కాలంలో సాంకేతికతను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, వీటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా మోసపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు తక్షణమే స్పందించి సమాచారం అందించడం వల్ల నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు, పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ వంటి ముఖ్య ప్రాంతాల్లో కమిషనరేట్ పరిధి విస్తరించి ఉందని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసి 23 సంవత్సరాలు పూర్తయిన సందర్భం గా వివిధ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సైబరాబాద్ అభివృద్ధిలో ప్రధాన భాగం పోలీసుల సమగ్రత, కృషి మరియు ప్రజల రక్షణకు చూపిన ప్రతిష్టాత్మక పనితీరే అని ఆయన పేర్కొన్నారు.
అలాగే, మురికివాడల్లో నివసించే విద్యార్థులు నేరాలకు బారిన పడకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్య లక్ష్యమని, అందు కోసమే సైబరాబాద్ పోలీస్ ఎన్జీవోల సహకారంతో నేర నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సీపీ సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీస్, సామాజిక సంస్థల సహకారం ఎంతో అవసరమని ఆయన తెలిపారు.
క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలను వివరించారు. అత్యాచారం, హత్యలు, చోరీలు, దాడులు, స్నాచింగ్స్, దొంగతనాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, సైబర్ క్రైమ్, ఇతర ప్రధాన నేరాలు చోటు చేసుకున్నాయి తెలిపారు. పోలీసులు పబ్లిక్‌కు అవగాహన, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సేఫ్టీ మరియు నేరాల నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా పార్ట్ టైమ్ జాబ్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, స్మిషింగ్, విషింగ్ కాల్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ వంటి నేరాలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ఈ తరహా మోసాల ద్వారా ప్రజలు భారీగా నష్టపోతున్నారని, నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.అలాగే, సైబర్ క్రైమ్ కేసుల నమోదు సంఖ్య సంవత్సరానికొకసారి మారుతున్నప్పటికీ, నష్టాల పరంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. సైబర్ పోలీస్‌లు వేగంగా స్పందించి మోసపోయిన డబ్బును ఫ్రీజ్ చేయడం, బాధితులకు తిరిగి చెల్లించడం వంటి చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
ప్రజలు అపరిచిత లింకులు క్లిక్ చేయకుండా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని, పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని డీసీపీ సాయి మనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణలో పారదర్శకత, ఖర్చు తగ్గింపు, ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా పలు కీలక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 96 బ్రెత్ అనలైజర్లలో 50 పరికరాలను ITM&C సాంకేతిక బృందం ఇన్-హౌస్‌లో మరమ్మతు చేసి, వెండర్లపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు సుమారు రూ.4.50 లక్షల వరకు ఆదా సాధించామని వెల్లడించారు. ‘Arrive Alive Campaign-2026’ తొలి దశలో భాగంగా 171 కార్యక్రమాలు నిర్వహించగా, 9,706 మంది ప్రజలు పాల్గొన్నారని చెప్పారు.
సంక్రాంతి పండుగ సమయంలో ఐటీ కారిడార్‌లో సుమారు 26 లక్షల వాహనాల రాకపోకలు నమోదయ్యాయని, సాధారణ రోజుల్లో 22 లక్షల వాహనాలు సంచరిస్తున్నాయని డీసీపీ తెలిపారు. పండుగల సమయంలో ట్రాఫిక్ 20 నుంచి 25 శాతం వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ మానిటరింగ్ కోసం 37 ప్రదేశాల్లో వాహన లెక్కింపు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, మొత్తం 169 జంక్షన్లు, 308 ట్రాఫిక్ పాయింట్లలో 167 మాన్డ్, 141 అన్‌మాన్డ్‌గా ఉన్నాయని వివరించారు. మాధాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హెవీ వాహనాల తనిఖీలు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ “Defensive Driving Saves Life” సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ, డ్రైవింగ్ కౌన్సెలింగ్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని డీసీపీ రంజన్ రతన్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్భుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, శేరిలింగంపల్లి డీసీపీ సి. హెచ్. శ్రీనివాస్, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్ డీసీపీ -2 - ఎస్. శేషాద్రిని రెడ్డి, డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్, సైబరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ట్రాఫిక్ డీసీపీ -1 - రంజన్ రతన్ కుమార్, వివిధ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





