త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Shivadhar Reddy | 32 ఏండ్ల‌ పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు: డీజీపీ శివధర్​రెడ్డి

DGP Shivadhar Reddy | త‌న 32 ఏండ్ల‌ పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలాయని డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. ఇన్నాళ్లు తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

G

Telangana | Published On Apr 30, 2026, 10.02 am IST

DGP Shivadhar Reddy | 32 ఏండ్ల‌ పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు: డీజీపీ శివధర్​రెడ్డి
Advertisement

DGP Shivadhar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న 32 ఏండ్ల‌ పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలాయని డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. ఇన్నాళ్లు తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ప‌ద‌వీ గురువారం విర‌మ‌ణ పొందారు. ఈ నేప‌థ్యంలో పోలీస్ అకాడమీలోని ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన‌ గౌర‌వ వంద‌నం కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌కు ఘ‌నంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్‌, నూతన డీజీపీ సీవీ ఆనంద్, పోలీసు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శివ‌ధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. 1970-80లలో ఉన్న పోలీసింగ్ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయని, ఇప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై `తెలంగాణ భావాన్ని అణచివేశారు` అనే అపవాదు ఉందని, ఆ దూరాన్ని తగ్గించి పోలీసులు-పోలీసుల మధ్య సాన్నిహిత్యం పెంపొందించడానికి సిటిజన్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా దీనిని నడిపించామని, భవిష్యత్తుకు సిద్ధమైన పోలీస్ శాఖను తయారు చేశామని తెలిపారు. తన స్వరాష్ట్రానికి డీజీపీగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకి ధన్యవాదాలు చెప్పారు. సమ‌ష్టి కృషి వల్లే ఈ స్థాయికి రాగలిగాన‌ని వెల్ల‌డించారు. యువ పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పని చేయాలని సూచించారు. పోలీస్ శక్తి అంటే గౌరవంగా జీవించడమేనని గుర్తు చేశారు. నూతన డీజీపీగా బాధ్యతలు చేప‌ట్ట‌నున్న‌సీవీ. ఆనంద్‌కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. `మంచి చాలెంజింగ్ అధికారి రాబోతున్నారు` అని చెప్పారు.

సీవీ ఆనంద్ అభినంద‌న‌లు..

పదవీ విరమణ పొందిన శివధర్‌రెడ్డికి నూతన డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఆయ‌న‌ 32 ఏండ్ల‌ పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారని చెప్పారు. నక్స‌ల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పని చేశారని తెలిపారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు. ప్రజలకు పోలీస్ శాఖపై మంచి సందేశం వచ్చే విధంగా ఉండాలని సూచించారు.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా శివ‌ధ‌ర్ రెడ్డి!

కాగా, డీజీపీ శివధర్ రెడ్డిని ప్రధాన కార్యదర్శి హోదాలో తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని పోలీసులు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. శాంతిభద్రతలు, అంతర్గత భద్రతా విషయాలపై మార్గనిర్దేశం చేయడానికి శివధర్ రెడ్డి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ నిర్ణయించార‌ని, ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం.

2017లో అప్ప‌టి మాజీ డీజీపీ అనురాగ్ శర్మను పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణపై ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన విష‌యం తెలిసిందే. 2020లో ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌ సలహాదారుల నియామకాలన్నింటినీ రద్దు చేసింది. అయితే కాంగ్రెస్ స‌ర్కార్‌ పలువురిని ప్ర‌భుత్వ‌ సలహాదారులుగా నియమించినప్పటికీ, వారిలో ఎవరినీ ప్రత్యేకంగా భద్రతా వ్యవహారాల కోసం నియమించలేదు.

Advertisement
Advertisement