త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Price | బంగారం ధరలకు రెక్కలు..? రూ.1.68 లక్షలకు చేరుతుందా..?

Gold Price | అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ నేపథ్యంలో రానున్న 6 నుంచి 12 నెలల్లో దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1.60 లక్షల నుంచి రూ.1.68 లక్షల వరకు చేరే అవకాశాలు ఉన్నాయ‌ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక అంచనా వేసింది. ధరల్లో తాత్కాలిక తగ్గుదల వచ్చినప్పుడు కొనుగోళ్లకు అవకాశంగా చూడాల‌ని సూచించింది.

S

Business | Published On Nov 6, 2026, 4.50 pm IST

Gold Price | బంగారం ధరలకు రెక్కలు..? రూ.1.68 లక్షలకు చేరుతుందా..?
Advertisement

Gold Price | అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ నేపథ్యంలో రానున్న 6 నుంచి 12 నెలల్లో దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1.60 లక్షల నుంచి రూ.1.68 లక్షల వరకు చేరే అవకాశాలు ఉన్నాయ‌ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక అంచనా వేసింది. ధరల్లో తాత్కాలిక తగ్గుదల వచ్చినప్పుడు కొనుగోళ్లకు అవకాశంగా చూడాల‌ని సూచించింది.

రూ.1.68 ల‌క్ష‌ల‌కు చేరుతుందా..?

దేశీయ బంగారం ధరలు స్వల్పకాలంలో 10 గ్రాములకు రూ.1.48 లక్షలకు, మధ్యకాలంలో రూ.1.60 లక్షల నుంచి రూ.1.68 లక్షల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,500 నుంచి 4,700 డాలర్లకు చేరుతుంద‌ని అంచనా వేసింది. గోల్డ్స్ ర్యాలీ: డిఫర్డ్, నాట్ డీరైల్డ్ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, ద్రవ్యోల్బణం, అధిక బాండ్ రాబడులు, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు నమోదయ్యాయి. గ‌త జనవరిలో అంతర్జాతీయ బంగారం ధర ఔన్సుకు దాదాపు 5,600 డాలర్ల రికార్డు స్థాయికి చేరిన అనంతరం 4,000 డాలర్ల దిగువకు పడిపోయి, తిరిగి కోలుకుంది. వెండి ధర కూడా ఔన్సుకు 100 డాలర్లను దాటిన తర్వాత గణనీయంగా తగ్గింది. మరోవైపు, రూపాయి-డాలర్ మారకపు విలువలో మార్పులు దేశీయ బులియన్ మార్కెట్‌ల‌పై ప్రభావం చూపుతున్నాయి.

ఈటీఎఫ్‌ల‌లో భారీగా పెట్టుబ‌డులు..

దీపావళి సమయంలో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 2016లో సుమారు రూ.30 వేలు ఉండగా, 2026లో దాదాపు రూ.1.5 లక్షలకు చేరింది. దీపావళి, ధన్‌తేరస్ సందర్భంగా సంప్రదాయ కొనుగోళ్లు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. అయితే పండుగల సమయంలో అంతర్జాతీయ ధరల కంటే దేశీయ ప్రీమియంలు, దిగుమతులు, భౌతిక కొనుగోళ్ల పరిమాణంతో డిమాండ్‌కు ఎక్కువ సంబంధం ఉంటుందని నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ లో భారత గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు అంతకుముందు నెలతో పోలిస్తే 71 శాతం పెరిగి రూ.4,450 కోట్లకు చేరాయి. సిల్వర్ ఈటీఎఫ్‌లలో రూ.1,970 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నిల్వలు 187 టన్నులు పెరిగి రికార్డు స్థాయిలో 4,256 టన్నులకు చేరాయి. మూడో త్రైమాసికంలో వీటిలోకి వచ్చిన పెట్టుబడులు 31 బిలియన్ డాలర్లతో సరికొత్త రికార్డు సృష్టించాయి. అయితే అధిక ధరల కారణంగా సెప్టెంబర్‌లో భారత బంగారం దిగుమతులు ఆగస్టులోని 2.3 బిలియన్ డాలర్ల నుంచి 1.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి.

దీర్ఘ‌కాలంలో ఎంత పెరుగుతుంది..?

ఎంఓఎఫ్ఎస్ఎల్ కమోడిటీస్ రీసెర్చ్ విభాగం అధిపతి నవనీత్ దమానీ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం రక్షణాత్మక పెట్టుబడి సాధనంగా కొనసాగుతోందని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, వాస్తవ బాండ్ రాబడులు సమీప భవిష్యత్తులో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని వివరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 3.75-4 శాతానికి చేర్చడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిందన్నారు. అదే సమయంలో కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ ధరలకు దీర్ఘకాలిక మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు. అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గినప్పటికీ, పెళ్లిళ్లకు సంబంధించిన కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ నిలకడగా ఉన్నాయని తెలిపారు.

రూపాయి-డాలర్ మారకపు విలువ 96గా ఉంటుందని అంచనా వేస్తే, దేశీయంగా 10 గ్రాముల బంగారానికి రూ.1.35 లక్షల స్థాయి కొనుగోళ్లకు అనుకూలమైన జోన్‌గా ఉంటుందని, స్వల్పకాలిక లక్ష్యం రూ.1.48 లక్షలు కాగా, మధ్యకాలిక లక్ష్యం రూ.1.60 లక్షల నుంచి రూ.1.68 లక్షలుగా ఉందని దమానీ వివరించారు. వెండిలో మరింత అధిక లాభాలకు అవకాశం ఉన్నప్పటికీ, దాని ధరల్లో బంగారం కంటే ఎక్కువ ఒడిదుడుకులు ఉంటాయని, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement
Advertisement