త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka | రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలు అన్నింటికి శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు.

S

Telangana | Published On Mar 10, 2026, 7.01 pm IST

Bhatti Vikramarka | గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
Advertisement

తెలంగాణ టూరిజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలి
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కోర్సులు
ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలు అన్నింటికి శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. మంగళవారం సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్‌లతో కలిసి ఆయా శాఖల సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. స్థలాలు అందుబాటులో ఉన్నచోట తాసిల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. చిన్నారుల మెదడు బలంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టికాహారంతో పాటు బోధనా పద్ధతులతో వారికి తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. పట్టణాల్లో రహదారుల పైన కొంతమంది చంటి బిడ్డలను పెట్టుకొని యాచక వృత్తి కొనసాగిస్తున్నారు వారందరినీ శిశు విహార్‌లో తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్లపై చంటి బిడ్డలు పట్టపగలు ఎండకు, వర్షాకాలంలో వానకు తడిసి వారి విలువైన బాల్యం మసకబారి పోతుందని ఆ విధంగా జరగడానికి అవకాశం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం తెలిపారు. శిశు విహార్‌లో మోడ్రన్ కిచెన్ నిర్మించాలని సూచించారు.

ఉపాధి కల్పించే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు రూపొందించాలని, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలను సంప్రదించి అందుకు అనుగుణంగా ఏటీసీ సెంటర్లలో కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. క్యూర్, ప్యూర్ రేర్ పాలసీకి అనుగుణంగా వచ్చే పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు ప్రవేశపెట్టాలి, స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసుకోవాలని సమంత అధికారులను ఆదేశించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలని ఈ క్రమంలో ఏజెన్సీలకు ఐటీడీఏల నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందించాలని వారిని ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. కవ్వాల్, శ్రీశైలం వంటి టైగర్ జోన్లు అభివృద్ధి చేసుకోవాలని పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎకో, టెంపుల్ టూరిజం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు యువతను చైతన్యం చేయాలని, డ్రగ్స్ వినియోగం ద్వారా జరిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా గ్రామస్థాయిలో కళారూపాలు ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా కళాకారులకు జీవనోపాధి కలగడంతో పాటు సమాజంలో మంచి మార్పు కనిపిస్తుందని అన్నారు.

సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అనిత రామచంద్రన్, దివ్య దేవరాజ్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ గౌతం , డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement