త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఇది తెలంగాణకు జ‌రిగిన అవ‌మానం.. ముక్త‌కంఠంతో ఖండించాల‌ని సీఎం రేవంత్ పిలుపు

CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి అనుమ‌తి నిరాక‌రించ‌డం అంటే.. ఇది యావ‌త్ తెలంగాణ‌కు జ‌రిగిన అవ‌మాన‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కేంద్రంలోని న‌రేంద్ర మోదీ సర్కారు అమెరికా ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డంపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో స్పందించారు. స‌చివాల‌యంలో సోమ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

P

Telangana | Published On Aug 24, 2026, 5.44 pm IST

CM Revanth Reddy | ఇది తెలంగాణకు జ‌రిగిన అవ‌మానం.. ముక్త‌కంఠంతో ఖండించాల‌ని సీఎం రేవంత్ పిలుపు
Advertisement

CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి అనుమ‌తి నిరాక‌రించ‌డం అంటే.. ఇది యావ‌త్ తెలంగాణ‌కు జ‌రిగిన అవ‌మాన‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కేంద్రంలోని న‌రేంద్ర మోదీ సర్కారు అమెరికా ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డంపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో స్పందించారు. స‌చివాల‌యంలో సోమ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం ద్వారా 2034 నాటికి ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ, 2047 త్రీ ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీకి పెంచాల‌ని ప‌ర్య‌ట‌న చేసుకొని ముందుకెళ్తుంటే.. తెలంగాణ ముఖ్య‌మంత్రికి అనుమ‌తి నిరాక‌రించ‌డం.. వ్య‌క్తిగా రేవంత్‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డం కాదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన అవ‌మానం, తిర‌స్క‌ర‌ణ‌' అని ఆరోపించారు సీఎం రేవంత్‌.

గుజ‌రాత్ ఆధిప‌త్యమే ప్ర‌ధాన కార‌ణం..

'ఈ తిర‌స్క‌ణ‌కు ప్ర‌ధాన కార‌ణం గుజ‌రాత్ ఆధిప‌త్యం. ఈ దేశ ప్ర‌ధాని ఇంకా గుజ‌రాతీగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు త‌ప్ప భార‌త ప్ర‌ధాన‌మంత్రిగా విష‌య ప‌రిజ్ఞానంతో ఈ ప్ర‌ధాని వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఇది తీవ్ర ఆక్షేప‌నీయం. ఇది తెలంగాణ‌కు జ‌రిగిన అవ‌మానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ‌డం. ఈ రోజు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిని అమెరికా ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇచ్చింది.. ఎనిమిది రోజులు అక్క‌డ రోడ్‌షోలు చేసేందుకు, పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు అనుమ‌తి ఇచ్చి.. తెలంగాణ సీఎంకు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం, తిర‌స్క‌రించ‌డం.. తిర‌స్క‌రించ‌డాన్ని తెలంగాణ స‌మాజం ముక్త‌కంఠంతో ఖండించాల్సిన అవ‌స‌రం ఉంది. దీనికి రాజ‌కీయాలు, రాజ‌కీయ పార్టీలు, ఇత‌ర అంశాల‌ను జోడించాల్సిన అవ‌స‌రం లేదు' అన్నారు.

బీజేపీ నేత‌లు క‌ట్టుబానిస‌ల్లా బ‌త‌క‌ద‌ల‌చుకున్న‌రా?

'బీజేపీ నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నా. మీరు గుజ‌రాత్‌ను స‌మ‌ర్థించ‌డం ద్వారా న‌రేంద్ర మోదీ చేతుల్లో, గుజ‌రాత్ చేతుల్లో క‌ట్టుబానిస‌ల్లా బ‌త‌క‌ద‌ల‌చుకున్న‌రా? తెలంగాణ ఆత్మగౌర‌వాన్ని చాట‌ద‌ల‌చుకున్నారా? ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలి. తెలంగాణ ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌ను తిర‌స్క‌రించ‌డం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మే. ఇది తెలంగాణ‌కు జ‌రిగిన అవ‌మానం. వ్య‌క్తిగా నేను పాతిక సార్లు అమెరికాకు వెళ్లి ఉండొచ్చు. ఇంకో పాతిక‌సార్లు పోవ‌చ్చు. కానీ, ముఖ్య‌మంత్రి హోదా, బాధ్య‌త‌, రాష్ట్రం అభివృద్ధి కోసం చేసే ప‌ర్య‌ట‌న‌ను కేంద్రం అడ్డుకోవ‌డం చూస్తుంటే స్ప‌ష్ట‌మైన వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తుంది తెలంగాణ ప‌ట్ల‌. దీన్ని ఏమాత్రం స‌హించ‌రానిది. ఖ‌చ్చితంగా ఈ అంశాన్ని లోక్‌స‌భ‌లో మా నాయ‌కులు లేవ‌నెత్తుత‌రు. రాజ్య‌స‌భ‌లో కూడా లేవ‌నెత్తుతాం. దీన్ని ఆషామాషీగా తీసుకునే విష‌యం కాదు. తెలంగాణ వ్య‌తిరేక భావ‌జాలం పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌దే ప‌దే మాట్లాడినా.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత‌ల మెత‌క వైఖ‌రితో ఇవాళ అంత ధైర్యంతో గుజ‌రాత్ వాళ్లు మ‌న అభివృద్ధిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు' అని సీఎం రేవంత్ ఆరోపించారు.

Advertisement
Advertisement