త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఢిల్లీ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించాలి: హ‌రీశ్‌రావు

Harish Rao | తెలంగాణ (Telangana) నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం శుక్ర‌వారం నిర్వహిస్తున్న ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రాజ‌కీయాల కంటే త‌మ‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

A

Telangana | Published On Jan 30, 2026, 2.31 pm IST

Harish Rao | ఢిల్లీ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించాలి: హ‌రీశ్‌రావు
Advertisement

జ‌ల‌ద్రోహం విష‌యంలో క‌త్తి బాబుది, పొడిచేది రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏపీకి స‌హ‌క‌రిస్తోంది
ప్లాన్డ్‌గా స‌హ‌క‌రిస్తూ బాబుకు గురుద‌క్షిణ
తెలంగాణ ప్రాజెక్టుల‌ను అడుగ‌డుగునా అడ్డుకున్న వ్య‌క్తే రాష్ట్రం త‌ర‌పున మీటింగ్‌కు
తెలంగాణ‌కు ద్రోహం చేస్తుంటే రాష్ట్రం తెచ్చిన పార్టీగా ఊరుకోబోం
ఇప్ప‌టికైనా కేంద్ర‌మంత్రులు నోరు తెర‌వాలి
అవ‌స‌ర‌మైతే మ‌రో పోరాటం చేస్తాం
విలేక‌రుల స‌మావేశంలో మండిప‌డిన మాజీ మంత్రి హ‌రీశ్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌ : తెలంగాణ (Telangana) నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం శుక్ర‌వారం నిర్వహిస్తున్న ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రాజ‌కీయాల కంటే త‌మ‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. కాళోజీ ముందే ఊహించి చెప్పిన‌ట్లు ప్రాంతం వాడే తెలంగాణ‌కు చేస్తున్న ద్రోహం ఇద‌ని అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క‌ల్పించింద‌న్నారు. దేశ రాజధాని డిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరుగుతున్న జల ద్రోహాన్ని వివరించేందుకే విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఒక వేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో మొదటి నుంచీ బీఆర్ఎస్‌ అప్రమత్తం చేస్తూనే వస్తుందని గుర్తు చేశారు. గతంలో అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి, వాస్త‌వాల‌ను బ‌య‌ట పెట్టామ‌ని వివ‌రించారు. నామమాత్రంగా బ్యాక్ డేట్ వేసి లెటర్లు మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని మండిప‌డ్డారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నామ‌ని చెప్పారు.

ఆగ‌ని ఏపీ జ‌ల‌దోపిడీ..

అది బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే కానీ, ఏపీ జల దోపిడి ఆగలేదని హ‌రీశ్‌రావు చెప్పారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే, పొడిచేది రేవంత్ రెడ్డేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ఈ రోజు డిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణ శాసనం రాయబోతున్నదని వాపోయారు. పోలవరం, నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్నదని ఆరోపించారు. "ఆ కుట్రల తీరు గమనిస్తే.. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్ కు వెళ్ళాడు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాసాడు. వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టుకు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించాడు. దానిని వాపస్ తెచ్చుకున్నడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి" అని విమ‌ర్శించారు.

ఏపీ ఒత్తిడితోనే స‌మావేశానికి ఇంజినీర్లు..

ప్లాన్డ్ గా సహకరిస్తూ చంద్రబాబుకు రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తున్నాడ‌ని హ‌రీశ్ మండిప‌డ్డారు. ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్‌లో నేడు ఇంజినీర్లు పాల్గొంటున్నారని ఆరోపించారు. పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్ర ఇదని అన్నారు. ఇలాగే గతంలో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్‌ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నరని అన్నారు. బీఆర్ఎస్ నిలదీస్తే.. డిసెంబర్ 30న తాను ఉత్తరం రాస్తే.. తెల్లారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లేఖ మాత్ర‌మే రాసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. అందులో ఏపీ నల్లమల సాగర్ విషయంలో ముందుకు పోతుంది, డీపీఆర్ ప్రక్రియ ముందుకు పోతుంది అని స్పష్టంగా రాసిందని చెప్పారు. దాంతో పాటు రెండు కండీష‌న్ల‌కు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగ్ వ‌స్తామ‌ని చెప్పార‌ని పేర్కొన్నారు. మొద‌టి కండీష‌న్ ఏమిటంటే న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌కు డీపీఆర్‌, కేంద్రం అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను వెంట‌నే ఆపాల‌ని, ఇక రెండోది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు ఆపిన‌ట్లు ఏమీ హామీ ఇవ్వాల‌ని రాశార‌ని వివ‌రించారు. ఈ రెండు కండీష‌న్లు ఒప్పుకున్న‌ట్లు కేంద్రంకానీ, ఏపీ కానీ హామీ ఇచ్చిందా చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అనుమ‌తి ద్వారానే లేఖ వెళ్లింది క‌దా.. ఏ హామీ లేకుండా ఉత్త‌మ్ మీటింగ్‌కు ఎందుకు హాజ‌ర‌వుతున్నార‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోర‌ని అన్నారు. క‌నీసం ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అయినా ఎందుకు ప‌ట్టించుకోర‌ని అన్నారు.

తెలంగాణ నీళ్ల‌ను ఏపీకి తీసుకువెళ్లేందుకే మీటింగ్‌కు ఆదిత్యానాథ్‌..

తెలంగాణ నీళ్ల‌ను ఏపీకి తీసుకువెళ్లేందుకే ఢిల్లీ మీటింగ్‌కు ఆదిత్యానాథ్ దాస్ హాజ‌ర‌వుతున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో ఈయ‌నే 9వ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొని, కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్ లు అన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటిని నిలిపి వేయాలని అడిగాడ‌ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని స‌మావేశానికి పంపడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే కదా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజినీర్ దొరకలేదా అని ఎద్దేవా చేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోను పోను అంటూనే మీటింగ్ లకు అటెండ్ అవడం దేనికి నిద‌ర్శ‌న‌మని ప్ర‌శ్నించారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమే వాళ్ల చ‌ర్చ‌ల ల‌క్ష్య‌మా అని దుయ్య‌బ‌ట్టారు.

కేసీఆర్‌ హ‌యాంలో ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు.. రేవంత్ హ‌యాంలో డీపీఆర్‌లు వెన‌క్కి..

కేసీఆర్ ప్ర‌భుత్వంలో గోదావరిలో 400 టీఎంసీల ప్రాజెక్టుల‌కు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారని చెప్పారు. గోదావరి మీద 10 డీపీఆర్ లు పంపి ఏడు ప్రాజెక్టులకు అనుమతులు సాధించారన్నారు. రెండేళ్ల రేవంత్‌రెడ్డి పాల‌న‌లో ఒక్క డీపీఆర్ పంపింది లేదు, ఒక్క అనుమతి తెచ్చింది లేదని దుయ్య‌బ‌ట్టారు. వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీలకు సగం అనుమతులు వస్తే, పూర్తి చేయకుండా డీపీఆర్ లు వాపస్ చేసిందని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో డీపీఆర్ లు వాపస్ వచ్చిన పరిస్థితి దాపురించింద‌న్నారు. మన డీపీఆర్‌లు వాపస్ తెచ్చుకుంటూ, నల్లమల సాగర్ కు జెండా ఊపుతున్నార‌ని విమ‌ర్శించారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని తెలంగాణ స‌మాజం క్ష‌మించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం పెట్టిన కండీషన్లకు వచ్చిన సమాధానం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వ దుర్మార్గాన్ని ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గ‌డ‌తాం..

రేవంత్‌రెడ్డి త‌న గురువు చంద్ర‌బాబు గురుద‌క్షిణ ఇచ్చేందుకు తెలంగాణ‌కు ద్రోహం చేస్తుంటే తెలంగాణ‌ను సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోద‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామ‌న్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేసీఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే గొప్ప‌గా చెప్పింద‌న్నారు. తెలంగాణ అద్బుతమైన ప్రగతి సాధించిందని, రెండు కోట్ల 20లక్షల ఎకరాలు మాగాణిగా మారిందని ప్ర‌శంసించింద‌ని వివ‌రించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా అద్బుతమైన ఆయకట్టు వచ్చిందని చెప్పారు. కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు, మొత్త‌మ్మీద‌ 32 లక్షల ఎకరాల ఆయకట్టును తాము సాధించామ‌ని వివ‌రించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ప్రగతి పథాన్ని వివ‌రించింద‌ని పేర్కొన్నారు. కేంద్ర‌మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు తెర‌వ‌డం మంచిద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కళ్లు తెరవాల‌ని, అనవసరంగా బీఆర్ఎస్ మీద నోళ్లు పారేసుకోకండని హిత‌వు ప‌లికారు. తామేమో తెలంగాణకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే, రేవంతు ఏపీకి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండని ఎద్దేవా చేశారు. నీటిని ఒడిసి పట్టింది కేసీఆర్ అయితే విడిచి పెట్టింది రేవంత్ అని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స‌మావేశాన్ని బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఢిల్లీకి, దావోస్ కు తిరగడమే తప్ప రేవంత్‌కు పాలన మీద దృష్టి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సేద్యంపై దృష్టి సారిస్తే, రేవంత్ చోద్యం చూస్తున్నడని దుయ్య‌బ‌ట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement