త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | రేవంత్ ధ‌ర్నా, అమిత్ షా పాదయాత్రతో తెలంగాణ‌కు ఏం ఒరిగింది?

Dasoju Sravan | ఢిల్లీలో రేవంత్ రెడ్డి ధర్నా, హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర (Amith Sha foot march) తో తెలంగాణకు ఏం ఒరిగిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Nov 3, 2026, 3.43 pm IST

Dasoju Sravan | రేవంత్ ధ‌ర్నా, అమిత్ షా పాదయాత్రతో తెలంగాణ‌కు ఏం ఒరిగింది?
Advertisement
  • ఇక్క‌డ క‌రువుంద‌ని మంత్రులు, ఎంపీలు అమిత్ షాకు ఎందుకు చెప్ప‌లే
  • ఆయ‌న‌ హైద‌రాబాద్‌కొచ్చి గుడికి వెళ్లి స‌భ‌లో మాట్లాడి పోయిండు
  • 750 టీఎంసీల గోదావరి నీళ్లు, 250 టీఎంసీల కృష్ణా నీళ్లు ఏపీకి వెళ్లాయి
  • ఆర్ ఆర్ ట్యాక్స్ అంటున్న షా సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి
  • దేశంలో డీ ఫాక్టో పీఎం అమిత్ షానే.. అధికారం, పరిపాల‌న‌పై ఆయ‌న ప్ర‌భావం ఉంటుంది
  • ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు

Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ధర్నా, హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర (Amith Sha foot march) తో తెలంగాణకు ఏం ఒరిగిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ప్ర‌శ్నించారు. ఇక్క‌డ క‌రువుంద‌ని మంత్రులు, ఎంపీలు అమిత్ షాకు ఎందుకు చెప్ప‌లేద‌న్నారు. దేశాన్ని మోదీ, అమిత్ షా క‌లిసి పాలిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ దేశానికి అమిత్‌షానే నిజ‌మైన ప్ర‌ధాన‌మంత్రి అని ఆరోపించారు. అధికారం, ప‌రిపాల‌న‌ నిర్ణ‌యాలపై ఆయ‌న ప్ర‌భావం ఉంటుంద‌న్నారు. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రేవంత్, అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

సీబీఐ విచార‌ణ చేయాలి

కాంగ్రెస్, బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి. తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. నీళ్లపై ఆధారపడిన పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం అయింది. కరువును ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. 750 టీఎంసీల గోదావరి నీళ్లు, 250 టీఎంసీల కృష్ణా నీళ్లు ఏపీకి వెళ్లాయి. అమిత్ షా, రేవంత్ రెడ్డి ఇద్దరూ పోటీ పడి విమర్శలు చేసుకున్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) నిధులు ఏవి?

అమిత్ షా హైదరాబాద్ కు వచ్చి గుడికి వెళ్ళారు. పాదయాత్ర చేశారు. స‌భలో మాట్లాడి ఢిల్లీకి వెళ్లిపోయారు. తెలంగాణలో కరువుపై అమిత్ షా ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు కరువుపై అమిత్ షా కు చెప్పలేదు. దేశాన్ని మోదీ, అమిత్ షా ఇద్దరు పాలిస్తున్నారు. దేశంలో డి ఫాక్టో పీఎం అమిత్ షా. కరువు సహాయం ఫైలు ఉండేదే హోం శాఖ, వ్యవసాయ శాఖ దగ్గర. తెలంగాణ అసెంబ్లీ రూ. 20,000 కోట్లు అడిగితే.. కేంద్రం నుంచి రూపాయి అయినా ఇస్తామని అమిత్ షా ప్రకటించారా? సినిమా యాక్టర్లను కలిశారు కానీ.. తెలంగాణను పట్టిపీడిస్తున్న కరువు, తాగునీరు, సాగునీటి కష్టాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అత్యంత బాధాకరం, బాధ్యతారాహిత్యం.

తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు ఏం నాయకులు, మీది ఏం పార్టీ? తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ పై అమిత్ షా సీబీఐ విచారణ జరిపించాలి. ఢిల్లీకి రేవంత్ రెడ్డి పైసలు పంపితే కేంద్రం ఏం చేస్తోంది. అమిత్ షా, మోడీలు 'ఆర్ఆర్ టాక్స్' (RR Tax) అని ఆరోపణలు చేయడం తప్ప, తమ చేతిలో ఉన్న సీబీఐ (CBI), ఈడీ (ED), ఐటీ (IT) సంస్థలతో విచారణ ఎందుకు జరిపించడం లేదు? ఢిల్లీకి చార్టర్డ్ ఫ్లైట్లలో సంచులు పోతున్నాయని అంటుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇది 'గల్లీల కుస్తీ - ఢిల్లీల దోస్తీ' కాకపోతే మరేమిటి? రేవంత్ రెడ్డి తెలంగాణను లూటీ చేస్తున్నారు. వేల కోట్లు దండుకుంటున్న రేవంత్ రెడ్డిని మోదీ, అమిత్ షా ఎందుకు కాపాడుతున్నారు. రేవంత్ రెడ్డి మరో హిమంత బిశ్వ శర్మ లా మోదీ, అమిత్ షా కు కనిపిస్తున్నారు.

ఆయ‌న పెద్ద ఓటు చోర్‌

తెలంగాణలో బీజేపీ ఎట్లా గెలుస్తుంది? రేవంత్ రెడ్డిపైన మోదీ, అమిత్ షా కు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. కేంద్రం 20 వేల కోట్లు ఇవ్వాలని ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఎందుకు చిన్న ధర్నా చేయలేదు? దేశంలో పెద్ద ఓట్ చోర్ రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఇప్పటికీ కేసు ఉంది. డీజీపీ రాష్ట్రంలో అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. RR ట్యాక్స్ అంటున్న అమిత్ షా సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణ నుంచి ఢిల్లీకి డబ్బులు పోతున్నాయని మోదీ, అమిత్ షా చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు అని దాసోజు ఫైర‌య్యారు.

మళ్లీ బోర్ల రాజ్యం

2014 నుంచి కేసీఆర్ ఇచ్చిన నీళ్లతో వ్యవసాయం చేసిన రైతన్నలు, ఇవాళ మళ్లీ నీళ్లు లేక, గ్రౌండ్ వాటర్ పాతాళానికి పడిపోవడంతో బోర్లపై ఆధారపడే దుస్థితికి వచ్చారు. ఫిబ్రవరి, మార్చిలోనే మెటీరియాలజీ డిపార్ట్‌మెంట్ ఎల్నినో (El Niño) కరువు రాబోతుందని హెచ్చరించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం సమాయత్తం కాలేదు. పక్క రాష్ట్రం కంటే దారుణమైన పరిస్థితుల్లోకి తెలంగాణను నెట్టివేసారు. కన్నెపల్లి వద్ద కేవలం రూ.10 కోట్లతో రబ్బర్ డ్యామ్ కడితే రెండు టీఎంసీల నీటిని కాపాడుకోవచ్చు, కానీ ఆ సోయి కూడా ప్రభుత్వానికి లేదు.

రైతు డిక్లరేషన్ అని, గ్యారెంటీలని నమ్మించి గొంతు కోశారు. ఢిల్లీకి పోయి రాజకీయ ధర్నాలు చేయడానికి సమయం ఉంటుంది కానీ, కేంద్ర వ్యవసాయ,హోం మంత్రులను కలిసి రూ. 20,000 కోట్ల కరువు ప్యాకేజీ సాధించడానికి రేవంత్ రెడ్డికి మనసొప్పదా?

'అనుముల రాజ్యాంగమా'?

కాంగ్రెస్, బీజేపీ నాయకులు ధర్నాలు, పాదయాత్రలు చేస్తే అనుమతులిచ్చే డిపార్ట్‌మెంట్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షాన, పబ్లిక్ హియరింగ్‌లలో పాల్గొనడానికి పోతుంటే గొర్రెల మేకల తరహాలో లాక్కెళ్లి ముందస్తు అరెస్టులు చేస్తోంది. తెలంగాణలో అమలవుతున్నది "అనుముల రాజ్యాంగమా?" లేక "అంబేద్కర్ రాజ్యాంగమా?" అని డీజీపీ ఆనంద్‌ను నిలదీస్తున్నాం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 అందరికీ సమానంగా వర్తిస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాత్కాలికం, పోలీసులు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి.

బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్లు

  • కరువు సాయం ప్రకటించాలి: కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణకు రూ. 20,000 కోట్ల కరువు సహాయం నిధులను విడుదల చేయాలి
  • కన్నెపల్లి వద్ద తక్షణమే రబ్బర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోసి రైతులను, తాగునీటి సమస్యలను ఆదుకోవాలి
  • గోదావరి, కృష్ణా జలాల్లో 1000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవ్వడానికి గల కారణాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలి
  • అమిత్ షా చేసిన 'RR టాక్స్' ఆరోపణలు నిజమైతే వెంటనే సీబీఐ లేదా ఈడీ విచారణ వేయాలి, లేకపోతే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
  • ప్రతిపక్ష నాయకులపై అక్రమ ముందస్తు అరెస్టులు నిలిపివేసి, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడాలి. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని ఇండ్లలో బంధించినా.. తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ ప్రజల అభ్యుదయం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది

ఈ స‌మావేశంలో బీఆర్ఎస్ నేతలు పాల్వాయి స్రవంతి, కె.కిశోర్‌ గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్:

AmithDasoju SravanEl NinoFoot MarchHyderabadRevanth ReddyTelangana
Advertisement
Advertisement