త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | రేవంత్‌ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్‌

Dasoju Sravan | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో గాంధీభవన్‌ బూతుల అడ్డాగా మారిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్‌ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీశ్‌రావుపై క్షుద్రపూజలంటూ చేస్తున్న ఆరోపణలు వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ భవన్‌ ఉద్యమాలకు వేదిక అని, పోరాటాలకు ప్రతిరూపంగా నిలిచిందని శ్రవణ్‌ పేర్కొన్నారు.

P

Telangana | Published On Aug 3, 2026, 6.10 pm IST

Dasoju Sravan | రేవంత్‌ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్‌
Advertisement
  • హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు దుర్మార్గం
  • కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ చెప్పాలి
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌

Dasoju Sravan | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో గాంధీభవన్‌ బూతుల అడ్డాగా మారిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్‌ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీశ్‌రావుపై క్షుద్రపూజలంటూ చేస్తున్న ఆరోపణలు వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ భవన్‌ ఉద్యమాలకు వేదిక అని, పోరాటాలకు ప్రతిరూపంగా నిలిచిందని శ్రవణ్‌ పేర్కొన్నారు. ‘కుక్క కాటుకు చెప్ప దెబ్బ అన్నట్లుగా కాంగ్రెస్‌ నేతల పిచ్చి ఆరోపణలకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతీ పిచ్చోడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ చెబుతుంటారు’ అని పేర్కొన్నారు. హరీశ్‌రావుపై కాంగ్రెస్‌ నేతలు క్షుద్రపూజల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రాజ్యాంగం కల్పించిన విలువలను కించపరిచే విధంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ నేతలు అత్యంత నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

విశ్వాసాలను అవమానించడమే..

‘కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టుగా రేవంత్‌ హయాంలో గాంధీభవన్‌ను బూతుల అడ్డాగా మార్చారు. మహాత్మాగాంధీ వచ్చి కూర్చున్న భవన్‌ ప్రతిష్ఠను దిగజార్చారు’ అని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశారంటూ చేస్తున్న ప్రచారం హిందూ విశ్వాసాలను అవమానించడమేనని దాసోజు శ్రవణ్‌ అన్నారు. శివతత్వాన్ని కూడా అవమానించేలా కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మేలు కోసం కేసీఆర్‌ చండీయాగం చేశారని, ప్రజలకు నష్టం కలగాలని ఎప్పుడూ పూజలు చేయలేదని చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌పై కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. హరీశ్‌రావు అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కక్షతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శివమొగ్గలోని ముఖంబికా దేవాలయాన్ని సందర్శించడాన్ని క్షుద్రపూజలుగా చిత్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. ‘ముఖంబికా దేవి శక్తి స్వరూపిణి. అలాంటి అమ్మవారిని రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్‌ నేతల నోళ్లు పడిపోతాయి’ అంటూ శాపనార్థాలు పెట్టారు.

రాహుల్‌, సిద్ధరామయ్య ఆలయాలకు వెళ్తున్నారు

శివమొగ్గ ప్రాంతం ఆదిశంకరాచార్యులు తిరిగిన పవిత్ర ప్రాంతమని శ్రవణ్‌ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కూడా ముఖంబికా ఆలయాన్ని సందర్శించారని, ఆయన కూడా క్షుద్రపూజలు చేశారా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కూడా పలు ఆలయాలను సందర్శిస్తున్నారని, వారంతా కూడా క్షుద్రపూజలు చేస్తున్నారా అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి కూడా క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ప్రచారం ఉందని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ప్రభావాన్ని తగ్గించుకునేందుకు రేవంత్‌రెడ్డి కూడా ఇలాంటి పూజలు చేశారని తాము అనగలమా అని ప్రశ్నించారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలి

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దాసోజు చేశారు. ప్రముఖులు ప్రసంగించిన గాంధీభవన్‌ వేదికను ఇలాంటి ఆరోపణలతో దిగజార్చినందుకు కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడాలని అన్నారు. తొండల భాష, పేగుల భాష నుంచి ఇప్పుడు క్షుద్రపూజల స్థాయికి దిగజారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాస్త్రీయ దృక్పథాన్ని మరిచి క్షుద్రపూజలంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ స్థాయిని దిగజార్చుకుంటున్నారని అన్నారు. ప్రజలతోనే కాకుండా అమ్మవారి విశ్వాసాలతోనూ కాంగ్రెస్‌ నేతలు పెట్టుకున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతలు గోసుల శ్రీనివాస్‌యాదవ్‌, అభిలాష్‌ రంగినేని, కార్తీక్‌ రాయల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement