Telangana Politics | కనువిప్పు కలిగేనా?.. పదే పదే పాలక పక్షం తప్పిదాలు!
Telangana Politics | నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పరిస్థితి తయారైందని ఆ పార్టీ సీనియర్లే వాపోతున్నారు. మరోవైపు వరుస ఘటనలతో ప్రభుత్వ పరువు బజారున పడుతోందని, అంతిమంగా దీని ప్రభావం పార్టీపైనే పడుతుందని సీనియర్లు లోలోన మదనపడుతున్నారు.
ప్రతిపక్షాలకు అవే అస్త్రాలు
వరుస ఘటనలతో నిందల పాలవుతున్న సర్కార్
లోలోన మదనపడుతున్న హస్తం సీనియర్లు
Telangana Politics | త్రినేత్ర.న్యూస్: నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పరిస్థితి తయారైందని ఆ పార్టీ సీనియర్లే వాపోతున్నారు. ప్రజాపాలన, మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వండని ఎన్నికల ముందు ప్రచారంతో హోరెత్తించిన ఆ పార్టీని ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ఎన్నికల్లో గెలిపించారని, కానీ, ప్రజల ఆశలు అడియాసలు అయ్యేందుకే ఎక్కువ కాలం పట్టలేదనే వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల పాలనలో ఇప్పటికీ తనదైన మార్క్‌ను చూపించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ అనుసరిస్తున్న వైఖరితోనే రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రతిపక్షాలు బలపడుతున్నాయని వాపోతున్నారు. ప్రతిపక్షాలకు పోరాడేందుకు, ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన అవకాశాన్ని ప్రభుత్వమే అందిస్తోందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలన, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే తపన తప్ప రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బహిరంగంగానే అనుకుంటున్నారు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుని, వేదిక ఏదయినా సందర్భం ఎలాంటిది అయినా కేసీఆర్‌ను టార్గెట్ చేయడమే రేవంత్ లక్ష్యంగా ఉంటున్నదని విమర్శిస్తున్నారు. మరోవైపు వరుస ఘటనలతో ప్రభుత్వ పరువు బజారున పడుతోందని, అంతిమంగా దీని ప్రభావం పార్టీపైనే పడుతుందని సీనియర్లు లోలోన మదనపడుతున్నారు. దీనిపై అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పాలనా వైఫల్యాలపై గొంతెత్తుతున్న సీనియర్లు
నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా ఆ ఆపార్టీ అధిష్ఠానం రేవంత్ పై నమ్మకం ఉంచి సీఎం సీట్లో కూర్చోబెట్టినప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పరమావధిగా పాలన సాగిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం వల్లకాడు అయిందని, హక్కులు హరించుకుపోయాయని, స్వేచ్ఛ కనుమరుగయిందని గాయిగత్తర చేసిన తాము.. తీరా అధికారంలోకి వచ్చాక ఏవైతే ఆరోపణలు చేసామో అంతకు రెట్టింపు విధ్వంసకర నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో అతి తక్కువ కాలంలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నామని భోరుమంటున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం ఇలా ఏ రంగం చూసినా తీవ్ర వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం తాజా వ్యాఖ్యలపై విమర్శలు..
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలింది.. లక్షకోట్లు వృథా అంటూ ప్రచారం చేస్తూ వచ్చిన అనంతరం తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రాజెక్టును రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పడావుపెట్టిందనే విమర్శలకు బలం చేకూర్చినట్లైందని అభిప్రాయపడుతున్నారు. నిన్నటి వరకు నిరర్థకమన్న ప్రాజెక్టును నేడు వినియోగించుకుంటామని మరమ్మత్తులు చేపడుతామని రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో తమపైనే సందేహాలు నెలకొనే అవకాశం కల్పించినట్లైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలతో ఇప్పటివరకు చేసిన ప్రచారమంతా వట్టిదేనని స్వయంగా ముఖ్యమంత్రే అంగీకరించినట్లయిందని వాపోతున్నారు. సాక్షాత్తూ సీఎం రేవంతే పూటకో మాట మాట్లాడుతూ ప్రాజెక్ట్‌పై ఇలా మాట్లాడటంపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని చర్చించుకుంటున్నారు.
వరుస సంఘటనలు
కుమ్మెర ఘటన..
తెలంగాణ సమాజమే కాదు యావత్ మానవ జాతి సిగ్గుతో తలదించుకునే దించుకునే సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర జాతరలో చోటు చేసుకుందని స్వయంగా కాంగ్రెస్ పెద్దలే అంగీకరిస్తున్నారు. కులదురంకారంతో రెచ్చిపోయిన రెడ్లు అభం శుభం తెలియని రెండేండ్ల పాపను కాలితో తన్ని పొట్టన పెట్టుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని పేర్కొంటున్నారు. దైవ దర్శనానికి వెళ్తే..కులం పేరుతో దూషించి దాడికి పాల్పడంతో చిన్నారి మృతి చెందిందని, ఈ ఘటనతో ప్రభుత్వానికి తీవ్ర తలవంపులు వచ్చాయని వివరిస్తున్నారు. ఘటన జరిగిన రెండు రోజులకు ప్రజా సంఘాలు ముఖ్యంగా విశారదన్ మహరాజ్ వంటి మేధావులు ఉద్యమించడంతోనే కేసు నమోదు చేశారని గుర్తు చేస్తున్నారు. అక్కడి సర్పంచ్, దేవస్థాన చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే అంతా రెడ్లే కావడంతో పోలీసులు కూడా వారికే వంతపాడి కేసు కాకుండా చూశారనే అపప్రధ ప్రభుత్వంపై పడిందని పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఏ మంత్రి, సీఎం స్పందించకపోవడం పార్టీని చాలా ఇరకాటంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సొంత పార్టీతో పాటు ప్రజల్లో కాంగ్రెస్‌ను తీవ్రంగా ఏవగించుకునే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు.
వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత
కుమ్మెర ఘటన మరవకముందే ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో కాయకష్టం చేసి ఇండ్లు నిర్మించుకున్న నిరుపేదలపై అధికారులు బుల్డోజర్లతో విరుచుకుపడటం తీవ్ర కలకలం రేపిందని అసలు కాంగ్రెస్ నేతలు లోలోన మదనపడుతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి నివాసముంటున్న వారిని వారి ఇళ్ల నుంచి కూల్చివేసి రోడ్డున పడేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని, ప్రభుత్వ తీరును అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయని గుర్తు చేస్తున్నారు. తమ గూడు కోసం ఉద్యమించిన నిరుపేదలపై అమానుషంగా లాఠీచార్జీకి పాల్పడటంపై ప్రజల్లో రేవంత్ పాలనపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికుతున్నదని, అయినప్పటికి సీఎం ఈ విషయంలో స్పందించకపోవడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతోందని వివరిస్తున్నారు.
శారదా పీఠం భూములు
కోకాపేట నియోపోలీస్ ప్రాంతంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం శారదా పీఠానికి భూములు కేటాయించగా, రేవంత్ ప్రభుత్వం ఆ భూముల కేటాయింపును రద్దు చేసి, జలమండలికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హిందువులలో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చిందని హస్తం సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. తీరా విషయం బయటకు పొక్కడం, హరీశ్‌రావు ఆ భూములను సందర్శించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం కూడా ప్రభుత్వానికి మైనస్‌గా మారిందని అనుకుంటున్నారు.
గాంధీ సరోవర్
రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాలన కంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే దృష్టి సారించినట్లుగా ప్రజలు భావిస్తున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఎలాంటి డీపీఆర్, నిపుణుల సలహాలు ఏవీ లేకుండానే సుమారు లక్ష కోట్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే సుమారు 5వేల కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానని ప్రకటించి ఎన్నో ఏండ్ల నుంచి ఉంటున్న మధు రిడ్జ్ వాసులను అక్కడ నుంచి తరిమేసే కుటిల యత్నాలకు తెరతీశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇండ్లను రాత్రికి రాత్రి కూల్చేసి ప్రభుత్వం అప్రతిష్టను మూటకట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతోందని అంటున్నారు.
ఎడ్యుకేషన్ పాలసీ
రాష్ట్రంలో ఇప్పటికీ విద్యా శాఖకు మంత్రి లేకపోవడం దురదృష్టకరంగా మారిందని, ఇది విద్యార్థులు, నిరుద్యోగుల్లో తప్పుడు సంకేతాలను తీసుకెళ్తోందని సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వం నిధులు, ఉద్యోగాల కల్పన, శిక్షణ తరగతులు లేకపోను ఉన్న పాఠశాలను మూసి వేసేందుకు రంగం సిద్ధం చేసిందని మండిపడుతున్నారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలు కలవరపెట్టిస్తున్నాయని చెబుతున్నారు. విద్యా రంగంలో సంస్కరణలు చేపడుతామని చెప్పిన ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించగా, ఆ కమిటీ సూచించిన సంస్కరణల పట్ల రాష్ట్రంలోని విద్యార్థులు, మేధావుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని గుర్తు చేస్తున్నారు.
ఇలా అన్ని అంశాలలోనూ ప్రభుత్వంపై ప్రత్యేకించి కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేక భావం పెరిగిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితమయ్యే అవకాశం ఉంటుందని సీనియర్లు అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. రేవంత్ చర్యల వలన కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగి, ప్రతిపక్షాలు బలపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశమిచ్చి, ప్రజల మధ్యకు వచ్చి, బలం పుంజుకునేలా ప్రభుత్వమే కృషి చేస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం స్పందించి, రేవంత్ చర్యలకు ముకుతాడు వెయ్యాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



