త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Kadiyam Kavya | వ‌రంగ‌ల్‌లో పెండింగ్ ర‌హ‌దారుల‌కు ఆమోదం తెల‌పండి

MP Kadiyam Kavya | వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉన్న కీల‌క ర‌హ‌దారుల అభివృద్ధి ప‌నుల‌కు ఆమోదం తెల‌ప‌డంతో పాటు జాతీయ ర‌హ‌దారిపై అసంపూర్తిగా ఉన్న స‌ర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీని వ‌రంగ‌ల్ ఎంపీ క‌డియం కావ్య‌, ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

S

Telangana | Published On Jul 28, 2026, 3.19 pm IST

MP Kadiyam Kavya | వ‌రంగ‌ల్‌లో పెండింగ్ ర‌హ‌దారుల‌కు ఆమోదం తెల‌పండి
Advertisement

MP Kadiyam Kavya | త్రినేత్ర‌.న్యూస్ : వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉన్న కీల‌క ర‌హ‌దారుల అభివృద్ధి ప‌నుల‌కు ఆమోదం తెల‌ప‌డంతో పాటు జాతీయ ర‌హ‌దారిపై అసంపూర్తిగా ఉన్న స‌ర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీని వ‌రంగ‌ల్ ఎంపీ క‌డియం కావ్య‌, ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

హనుమకొండ జిల్లాలోని కరుణాపురం నుండి పెద్ద పెండ్యాల, నర్సింగరావుపల్లి, ఎలుకుర్తి, ధర్మసాగర్ మండల హెడ్‌క్వార్టర్, దేవునూర్, సోమ దేవరపల్లి, దామెర, ఎల్కతుర్తి మండల హెడ్‌క్వార్టర్ వరకు ఉన్న రోడ్డును విస్తరించి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఈ రోడ్డు హైదరాబాద్ నుండి కరీంనగర్, సిద్ధిపేటకు వెళ్లే వాహనాలు వరంగల్ వెళ్లే అవసరం లేకుండా 163, 563 జాతీయ రహదారులను అనుసంధానించే కీలక మార్గమని, వేలాది మంది ప్రజలు, రైతులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు నిత్యం వినియోగిస్తున్నారని వివరించారు. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఈ రహదారిని అభివృద్ధి చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.

అలాగే యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163) నాలుగు లైన్ల విస్తరణ సమయంలో పలు గ్రామాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్ల మధ్య మిగిలిపోయిన లింకులను పూర్తి చేయాలని కోరారు. నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, ఘన్‌పూర్ స్టేషన్, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల పరిధిలో సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ వాటి మధ్య అనుసంధానం లేకపోవడంతో స్థానిక ప్రజలు ప్రధాన రహదారినే వినియోగించాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని వివరించారు. అవసరమైన భూమి ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో మిగిలిన లింకుల నిర్మాణానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా కేంద్ర రోడ్డు, మౌలిక సదుపాయాల నిధి (సీఆర్‌ఐఎఫ్) 2025–26 కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు రహదారి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని కోరారు. నర్సంపేట - నందిగామ రహదారి విస్తరణ, భట్టుపల్లి - హంటర్ రోడ్ మార్గ అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు అమలైతే గ్రామీణ ప్రాంతాల అనుసంధానం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

Advertisement
Advertisement