త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Leaders | యువ సంగ్రామంలో పాల్గొన్న‌ది నిరుద్యోగులు కాదు.. పెయిడ్ ఆర్టిస్ట్‌లు

Congress Leaders | స‌రూర్‌న‌గ‌ర్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన బీఆర్ఎస్ యువ సంగ్రామ స‌ద‌స్సులో పాల్గొన్న‌ది నిరుద్యోగులు కాదు.. పెయిడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 18, 2026, 6.12 pm IST

Congress Leaders | యువ సంగ్రామంలో పాల్గొన్న‌ది నిరుద్యోగులు కాదు.. పెయిడ్ ఆర్టిస్ట్‌లు
Advertisement

Congress Leaders | త్రినేత్ర‌.న్యూస్ : స‌రూర్‌న‌గ‌ర్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన బీఆర్ఎస్ యువ సంగ్రామ స‌ద‌స్సులో పాల్గొన్న‌ది నిరుద్యోగులు కాదు.. పెయిడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ పేర్కొన్నారు. యువ సంగ్రామంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి అడ్లూరి, బీర్ల ఐల‌య్య‌, అద్దంకి ద‌యాక‌ర్ తీవ్రంగా స్పందించారు.

మీ పాపాల చిట్టా చాలా పెద్దగా ఉంది. కేటీఆర్ గారూ.. కబుర్లు కాదు.. ప్రభుత్వ రికార్డులు మాట్లాడుతున్నయ్!. మీది పేపర్ లీకుల పాలన... మాది కొలువుల జాతర! కేటీఆర్ గారూ.. మీ హయాంలో నిరుద్యోగోళ్ల చేతిలో హాల్‌టికెట్ ఉండేది. మా ప్రజా ప్రభుత్వంలో అపాయింట్‌మెంట్ లెటర్ ఉంది. అదే తేడా. మీరు జిరాక్స్ సెంటర్ల దగ్గర పేపర్లు అమ్ముకునే పరిస్థితి తెచ్చారు. మేం శిల్పకళా వేదికపై ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ పత్రాలు పంచామ‌ని తెలిపారు.

రెండేండ్లలో 67,763 మందికి ఉద్యోగాలు

"కొలువుల కుంభమేళా ఎక్కడ?" అంటున్నవ్. రెండేండ్లలో 67,763 మందికి ఉద్యోగాలు ఇచ్చిన రికార్డు మీ కళ్ల ముందే ఉంది. ఇంకా 13,197 పోస్టులు భర్తీ చివరి దశలో ఉన్నాయి. మా ప్రభుత్వం మాటలు కాదు... దశల వారీగా ఉద్యోగాలు ఇస్తోంది. టీజీపీఎస్సీని మీరు అపకీర్తి పాలుచేశారు.. మేం ప్రక్షాళన చేసి మళ్లీ యువత నమ్మకం గెలుచుకున్నాం. గ్రూప్-1 రద్దయిన పరీక్షను మళ్లీ నిర్వహించి 562 పోస్టులు భర్తీ చేశాం. గ్రూప్-2లో 783 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గ్రూప్-3లో 1,370 పోస్టులు భర్తీ చేశాం. గ్రూప్-4లో 8,143 మంది జీవితాల్లో వెలుగులు నింపాం. టీజీపీఎస్సీ ద్వారానే మొత్తం 17,326 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది ప్రచారం కాదు.. అధికారిక రికార్డు. మెగా డీఎస్సీ అంటూ మాటలు కాదు.. 10,006 మంది కొత్త టీచర్లను పాఠశాలలకు పంపాం. గురుకులాల్లో 8,400 మంది ఉపాధ్యాయులను నియమించి వేలాది పేద పిల్లల భవిష్యత్తును బలోపేతం చేశాం. పోలీస్ శాఖలో 16,067 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మరో 7,437 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆరోగ్య శాఖలో 8,822 ఉద్యోగాలు భర్తీ చేశాం. నిమ్స్‌లో 643, టిమ్స్‌లో 6,278 పోస్టులకు కేబినెట్ ఆమోదం ఇచ్చాం. రెవెన్యూ, విద్యుత్, సింగరేణి, ఆరోగ్యం, గురుకులాలు.. ఏ శాఖ చూసినా నియామకాల జోరు కనిపిస్తోంది. అంగన్‌వాడీల్లో 15,982 పోస్టులు.. పోలీస్ శాఖలో 7,437 పోస్టులు.. టిమ్స్‌లో 6,278 పోస్టులు.. వరుస నోటిఫికేషన్లే మా జవాబు అని స్ప‌ష్టం చేశారు.

ఉద్యోగం అంటే ప్రకటన కాదు... నియామక పత్రం..

వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచి పదేళ్ల ఊరట ఇచ్చింది ఈ ప్రజా ప్రభుత్వమే. మీరు యువతకు ఇచ్చింది నిరాశ.. మా ప్రభుత్వం ఇచ్చింది ఉద్యోగ భరోసా. కోర్టుల్లో ఆగిపోయిన నియామకాలు మేం పూర్తి చేశాం. కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చింది మాత్రం మీ ప్రభుత్వమే. నోటిఫికేషన్ ఇచ్చి మర్చిపోయే ప్రభుత్వం కాదు. పరీక్షలు పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఉద్యోగ పత్రాలు అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగి ఇంట్లో దీపం వెలిగింది. బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఆశలు ఆరిపోయాయి. కేటీఆర్ గారూ.. వేదికల మీద ఉపన్యాసాలు ఆపి, ముందు పేపర్ లీకేజీలకు యువతకు క్షమాపణ చెప్పండి. ఉద్యోగం అంటే ప్రకటన కాదు... నియామక పత్రం. ఆ నియామక పత్రం అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి అడ్లూరి, బీర్ల ఐల‌య్య, అద్దంకి ద‌యాక‌ర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement