త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | కాళేశ్వరం అప్పులకు 50 వేల కోట్లు కట్టాం.. బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి పొన్నం ఫైర్

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.50 వేల కోట్లు చెల్లించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్‌లో మంత్రులు పొంగులేటి, వివేక్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించిన బీజేపీ.. సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని సూటిగా ప్రశ్నించారు.

J

Telangana | Published On Feb 26, 2026, 7.34 pm IST

Ponnam Prabhakar | కాళేశ్వరం అప్పులకు 50 వేల కోట్లు కట్టాం.. బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి పొన్నం ఫైర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులకు తమ ప్రజా ప్రభుత్వమే ఇప్పటివరకు ఏకంగా రూ.50 వేల కోట్లు కిస్తీల రూపంలో చెల్లించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బీబీసీలో ప్రచారం.. తీరా చూస్తే నీళ్లన్నీ కిందికే

గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా చూపించేందుకు బీబీసీ (BBC) ఛానెల్‌లో సైతం టెలికాస్ట్ చేయించుకున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. "గవర్నర్ పర్యటన సందర్భంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను బస్సుల్లో తరలించి ప్రాజెక్టును చూపించిన ఘనత వారిది. ఏటా 195 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని గొప్పలు చెప్పి.. 2017 నుంచి 2023 వరకు కేవలం 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. వరదలు వచ్చిన సమయంలో ఎత్తిన నీళ్లన్నీ మళ్లీ కిందికే వెళ్లాయి. గేట్లు ఎత్తి సుమారు 50 టీఎంసీల నీటిని వృథాగా కిందికి పంపించారు. హరీష్ రావు ఎక్కడికి వెళ్లినా కాళేశ్వరం నీళ్లు ముందు మీకే అని మాయమాటలు చెప్పారు. కాళేశ్వరాన్ని మీ హయాంలోనే నిర్మించి, మీ హయాంలోనే కూలగొట్టారు," అని పొన్నం విమర్శించారు.

కిస్తీలకే రూ.73 వేల కోట్లు.. అప్పులు కడుతోంది మేమే

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని మంత్రి మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాగానే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు సంబంధించి 2024లో రూ. 13,388 కోట్లు, 2025లో రూ. 33,574 కోట్లను తమ ప్రజా ప్రభుత్వమే తిరిగి చెల్లించిందన్నారు. మొత్తంగా ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఈ ఆరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కట్టిన మొత్తం కిస్తీలు రూ. 73 వేల కోట్లు అని ఆయన వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామన్నారు.

అమిత్ షా, నడ్డాలకు పొన్నం సూటి ప్రశ్న

ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ చేశారు. "కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ (CBI) విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నేను కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను. అమిత్ షా, జేపీ నడ్డా లాంటి బీజేపీ అగ్రనేతలు ఇక్కడికి వచ్చి.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం (ATM) లాంటిదని విమర్శించారు కదా? మరి అలాంటప్పుడు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదు?" అని నిలదీశారు.

కుర్చీ వేసుకుని కడతామన్న గౌరవెల్లి ఏమైంది?

ప్రాజెక్టుల నిర్మాణంలోనూ గత ప్రభుత్వం వివక్ష చూపిందని పొన్నం ఆరోపించారు. "2014లో కుర్చీ వేసుకుని మరీ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్టు ఇసుమంత కూడా ముందుకు కదలలేదు. దాని తర్వాత మొదలుపెట్టిన కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేశారు. దేశంలో ఏ పెద్ద ప్రాజెక్టు నిర్మించినా అది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగినవే" అని ఆయన స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలకు ప్రజలే వాతపెట్టారు

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మంత్రి ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, ఎమ్మెల్సీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని, ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.

Advertisement
Advertisement