త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్‌, హ‌రీశ్ భూముల‌పై తేల్చండి.. ఉన్న‌త‌స్థాయి క‌మిటీ ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం

Enquiry Committee on Lands | రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న 22ఏ భూముల వ్యవహారంపై (Section 22-A) కాంగ్రెస్ స‌ర్కార్ (Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో భూములకు సంబంధించిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రభుత్వ భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణకు ఉన్న‌త స్థాయి కమిటీని (Enquiry Committee on Lands) ఏర్పాటు చేసింది.

G

Telangana | Published On Sep 24, 2026, 12.48 pm IST

Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్‌, హ‌రీశ్ భూముల‌పై తేల్చండి.. ఉన్న‌త‌స్థాయి క‌మిటీ ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం
Advertisement

Enquiry Committee on Lands | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న 22ఏ భూముల వ్యవహారంపై (Section 22-A) కాంగ్రెస్ స‌ర్కార్ (Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో భూములకు సంబంధించిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రభుత్వ భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణకు ఉన్న‌త స్థాయి కమిటీని (Enquiry Committee on Lands) ఏర్పాటు చేసింది. దీనికి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు కన్వీనర్‌గా, జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝాతోపాటు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ఇందులో స‌భ్యులుగా ఉంటార‌ని పేర్కొంది. ఈ క‌మిటీ వివిధ జిల్లాల్లోని భూ వ్యవహారాలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (KCR) పాటు మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ప్ర‌జాప్ర‌తినిధులు, వారి కుటుంబ స‌భ్యులు, అనుచ‌రులు, వివిధ సంస్థ‌ల‌కు చెందిన భూముల వ్యవహారాలపై ఈ క‌మిటీ ప‌రీశీల‌న‌ చేపట్టనుంద‌ని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు జీవో నంబ‌ర్ 134 జారీచేశారు.

ముఖ్యంగా అసైన్డ్‌, ప్రభుత్వ, జాగీర్‌, ఇనామ్, అట‌వీ, భూదాన్‌ భూములకు సంబంధించిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కమిటీ దృష్టి సారించనుంది. మల్లన్నసాగర్‌ భూసేకరణలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు, మిడ్‌ మానేర్‌ ప్రాజెక్టు పరిహారం, పునరావాసం–పునరావాస ప్యాకేజీల్లో అవకతవకల ఆరోపణలపైనా విచారణ జరపనుంది. ఇందులో భాగంగా అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు బయటపడితే.. వాటికి బాధ్యులెవరో నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ క‌మిటీ సిఫారసు చేయనుంది. ఇందులో భాగంగా అవసరమైన భూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ వివరాలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న డేటాను కమిటీకి అందించాలని అధికారులను ప్ర‌భుత్వం ఆదేశించింది. విచారణకు పూర్తి సహకారం అందించాలని సూచించింది. సిద్దిపేట‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, భూపాల‌ప‌ల్లి, సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ల‌తోపాటు ల్యాండ్ అడ్మినిస్ట్రేష‌న్ చీఫ్ క‌మిష‌న‌ర్‌కు ఆదేశాలు జారీచేసింది.

సెప్టెంబ‌ర్ 16న 22ఏ భూముల వ్య‌వ‌హారంపై శాస‌న స‌భ‌లో చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో భూముల‌కు సంబంధించి భారీ అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. వీటిపై ప‌రిపాల‌నా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావించిన ప్ర‌భుత్వం స‌మ‌గ్ర విచార‌ణ నిర్వ‌హించి బాధ్యుల‌ను నిర్ణ‌యించ‌డంతోపాటు త‌గిన చ‌ర్య‌లు సిఫార‌సు చేయ‌డానికి క‌మిటీని ఏర్పాటు చేసింది. విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత క‌మిటీ త్వ‌రిత‌గ‌తిన నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించ‌నుంది. అవ‌స‌ర‌మ‌ని భావిస్తే మ‌ధ్యంత‌ర నివేదిక‌ల‌ను కూడా అందించ‌వ‌చ్చ‌ని జీవోలో పేర్కొంది.

విచార‌ణ క‌మిటీ ప‌రిధిలోకి వ‌చ్చే గ్రామాలు.. నేత‌లు..

సిద్దిపేట జిల్లా..

కేసీఆర్‌, అనుచ‌రుల భూములు: మ‌ర్కూక్ మండ‌లం ప‌రిధిలోని ఎర్ర‌వ‌ల్లి, మ‌ర్కూక్‌, శివారు వెంక‌టాపూర్ గ్రామాల్లో మాజీ సీఎం కేసీఆర్‌, వారి కుటుంబ స‌భ్యులు, అనుచ‌రుల‌కు సంబంధించిన భూములు.
హ‌రీశ్‌రావు భూములు (రంగ‌నాయ‌క సాగ‌ర్ వ‌ద్ద‌): చిన్నకోడూరు మండ‌లం రామాంచలో రంగ‌నాయ‌క‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌కు స‌మీపంలో బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు, వారి కుటుంబ స‌భ్యులు, అనుచ‌రుల‌కు ఉన్న భూములు

అసైన్డ్ భూముల కొనుగోలు: కొండ‌పాక మండ‌లం వెలిక‌ట్టలో స‌ర్వే నంబ‌ర్ 271లోని అసైన్డ్ భూమిని ఎం. హ‌నుమంత‌రావు కొనుగోలు చేసిన భూములు

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూసేక‌ర‌ణ అక్ర‌మాలు: తొగుట మండ‌ల ప‌రిధిలో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ భూసేక‌ర‌ణ‌కు సంబంధించి (దివంగ‌త మాజీ ఎమ్మెల్యే ఎస్‌. రామ‌లింగ‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా) ఎటిగ‌డ్డ కిష్టాపూర్‌, ప‌ల్లెప‌హ‌డ్‌, రాంపూర్‌, తుక్కాపూర్ గ్రామాల్లో భూ కేటాయింపులు.

రంగారెడ్డి జిల్లా..

కేటీఆర్ కుటుంబ స‌భ్యులు, శ‌తభిష ఆగ్రో భూములు: శంక‌ర్‌ప‌ల్లి మండ‌లం జ‌న్వాడ‌లో శ‌త‌భిష ఆగ్రో, ఇత‌ర కంపెనీల పేరుతో మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబ స‌భ్యులు, అనుచ‌రులు కొనుగోలు చేసిన భూములు.

జ‌గ‌దీశ్ రెడ్డి భూములు: షాబాద్ మండ‌లం మ‌ద్దూరులో మాజీ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్ రెడ్డి, వారి కుటుంబ స‌భ్యులు, అనుచ‌రుల‌కు చెందిన భూములు.

హ‌రీశ్ రావు భూములు (మొయినాబాద్‌): మొయినాబాద్ మండ‌లం అజీజ్‌న‌గ‌ర్‌లో హ‌రీశ్ రావు, వారి కుటుంబ స‌భ్యుల భూములు.

రోహిత్ రెడ్డి అసైన్డ్ భూముల ఆక్ర‌మ‌ణ‌: మొయినాబాద్ మండ‌లం అజీజ్ న‌గ‌ర్‌లో మాజీ ఎమ్మెల్యే పీ.రోహిత్ రెడ్డి అసైన్డ్ భూముల‌ను కొనుగోలు చేసి ఆక్ర‌మించార‌నే ఆరోప‌ణ‌ల‌పై..

గంగుల క‌మ‌లాక‌ర్ భూములు: శంషాబాద్ మండ‌లం బ‌హ‌దూర్‌గూడ‌లో మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, ఇత‌రులు ప్ర‌భుత్వ భూముల‌ను అక్ర‌మంగా కొనుగోలుచేసిన అంశం..

ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి (భూదాన్ భూములు): గండిపేట మండ‌లం వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో జ‌న‌గామ‌ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఇత‌రులు భూదాన్ భూముల‌ను అక్రంగా కొనుగోలు చేశార‌నే ఆరోప‌ణ‌లు..

శంక‌ర హిల్స్ భూములు: కందుకూరు మండ‌లం వ‌ట్టినాగుల‌ప‌ల్లి (శంక‌ర‌హిల్స్‌)లో మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, ఇత‌రులు అక్ర‌మంగా భూ కొనుగోళ్లు..

కందుకూర్ భూదాన్ భూములు: కందుకూరు మండ‌లం తిమ్మాపూర్ గ్రామంలోని భూదాన్ భ‌ష్ట్రముల కొనుగోలు అంశం.

సిరిసిల్ల జిల్లాలో..

అసైన్డ్‌, ప్ర‌భుత్వ భూముల కేటాయింపులు: సిరిసిల్ల‌, తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లాల్లోని స‌ర్దాపూర్‌, ల‌క్ష్మీపూర్‌, తంగ‌ళ్ల‌ప‌ల్లి గ్రామాల్లో అసైన్డ్ భూముల అక్ర‌మ కొనుగోళ్లు, ప్ర‌భుత్వ భూముల కేటాయింపు.

మిడ్ మానేరు న‌ష్ట‌ప‌రిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు: బోయిన‌ప‌ల్లి మండ‌లంలోని మ‌న్వాడ త‌దిత‌ర గ్రామాల్లో జోగిన‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, జే.సౌమ్య‌కు సంబంధించి మిన్ మానేరు రిజ‌ర్వాయ‌ర్ ప‌రిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అక్ర‌మాలు..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా..

ధ‌రణి పోర్ట‌ల్ దుర్వినియోగం: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని బాలాన‌గ‌ర్ మండ‌లం గుండేడ్‌లో రాజ్ హైటెక్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, రాజ్ పౌల్ట్రీ అండ్ ప్లాంటేష‌న్‌, రాజ్ పౌల్ట్రీ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఫార్మ్స్‌, మ‌న‌విహ బ్రీడ‌ర్స్ ఎల్ఎల్‌పీ (ఎం.హ‌నుమంత‌రావు, ఎం. సుమ‌న్‌, టీ. మ‌హేశ్ రావు) ద్వారా ధ‌ర‌ణి పోర్ట‌ల్ మాడ్యూల్స్‌, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌లు..

హైద‌రాబాద్ జిల్లా..

సికింద్రాబాద్ ప‌రిధిలోని జీరా ల్యాండ్స్‌లో (Zeera Lands) మాజీ ఎమ్మెల్సీ ఎల్విన్ స్టీఫెన్స‌న్‌కు చెందిన భూముల లీజు క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌..

 

Advertisement
Advertisement