త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ZPHS Indira Nagar | ఆ స‌ర్కారు బ‌డిలో సీటు కావాలంటే పోటీ ప‌రీక్ష‌ రాయాల్సిందే..

ZPHS Indira Nagar | అది ప్ర‌భుత్వ పాఠ‌శాల (Government School). ఆ స్కూల్‌లో త‌మ పిల్ల‌ల‌ను చ‌దివించాల‌ని చుట్టుప‌క్క‌ల గ్రామాల త‌ల్లిదండ్రులు ఆశ‌ప‌డుతుంటారు. ల‌క్ష‌ల్లో స్కూల్ ఫీజులు క‌ట్టి త‌మ పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులను కొనుక్కునే ఈ రోజుల్లో సర్కారు బ‌డిలో విద్య కోసం పోటీ ఏంటి అనుకుంటున్నారా..? అదే ఆ స్కూల్ ప్ర‌త్యేక‌త‌.

G

Telangana | Published On Jun 11, 2026, 7.37 am IST

ZPHS Indira Nagar | ఆ స‌ర్కారు బ‌డిలో సీటు కావాలంటే పోటీ ప‌రీక్ష‌ రాయాల్సిందే..
Advertisement

ZPHS Indira Nagar | త్రినేత్ర‌.న్యూస్‌: అది ప్ర‌భుత్వ పాఠ‌శాల (Government School). ఆ స్కూల్‌లో త‌మ పిల్ల‌ల‌ను చ‌దివించాల‌ని చుట్టుప‌క్క‌ల గ్రామాల త‌ల్లిదండ్రులు ఆశ‌ప‌డుతుంటారు. ల‌క్ష‌ల్లో స్కూల్ ఫీజులు క‌ట్టి త‌మ పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులను కొనుక్కునే ఈ రోజుల్లో సర్కారు బ‌డిలో విద్య కోసం పోటీ ఏంటి అనుకుంటున్నారా..? అదే ఆ స్కూల్ ప్ర‌త్యేక‌త‌. ఏటా ప్ర‌వేశాల (Admission) కోసం వేలాది మంది పోటీప‌డుతుంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారుల సిఫార‌సులు ప‌నిచేయ‌వు. ప్ర‌వేశం ఉచిత‌మే అయినా పోటీ ప‌రీక్ష (Competitive Exam) రాయాల్సిందే. అందులో క‌న‌బ‌ర్చిన ప్ర‌తిభ ఆధారంగానే ఆ స్కూల్లోకి ఎంట‌ర్ కావ‌చ్చు. అదే సిద్దిపేట‌లోని (Siddipet) ఇందిరాన‌గ‌ర్ జ‌డ్పీ ఉన్న‌త పాఠ‌శాల (ZPHS Indira Nagar).

పదేండ్ల‌ క్రితం 300 మంది విద్యార్థులకు పరిమితమైన ఈ బ‌డిలో ప్ర‌స్తుతం 1200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు.. ఉన్న ఈ ఐదు తరగతులకు 23 సెక్షన్లు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలి అంటే కార్పొరేట్ పాఠశాలలకు మించి డిమాండ్ ఉన్న పాఠశాల ఇది. ఇందులో కంప్యూటర్ ల్యాబ్‌లు, పారెన్ లాంగ్వేజి బోదన, ఆన్లైన్ తరగతులు, ఐఐటీ ఫౌండేషన్ విద్య, విశాలమైన ఆట మైదానం, ఆధునిక సౌకర్యాలతో 24 తరగతి గదులు ఉన్నాయి. ఒక్కో సబ్జెక్టుకు నిష్ణాతులైన నలుగురు ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు.

అధునాత‌న సౌక‌ర్యాలు

ఈ బ‌డిలో అధునాత‌న సౌక‌ర్యాలు ఉన్నాయి. నాట్కో సంస్థ ఆధ్వ‌ర్యంలో అద‌న‌పు త‌ర‌గ‌తి గదులు నిర్మించ‌డంతోపాటు డిజిట‌ల్ ల్యాబ్‌, కంప్యూట‌ర్ ల్యాబ్‌, సైన్స్ ల్యాబ్‌, ఐఐటీ ఫౌండేష‌న్ కోర్సు, ఆన్‌లైన్ క్లాసులు, మెస్ హాల్ వంటి సౌక‌ర్యాలు ఇక్క‌డ‌ ఉన్నాయి. ప్ర‌తి క్లాస్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల‌కు ఇఫ్లూ ఆధ్వ‌ర్యంలో ఫ్రెంచ్‌, స్పానిష్ భాష‌ల‌ను కూడా బోధిస్తున్నారు.

ప్రతీ ఏటా 6వ తరగతి కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఏడాది 6, 8 త‌ర‌గ‌తుల్లో 210 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 691 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది పోటీపడుతుండటంతో పరీక్ష నిర్వహించారు. దీనికి 600 మంది హాజరయ్యారు. మార్కులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి, పేదలు, అనాథలకు ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా పారదర్శంగా సీట్లు కేటాయిస్తారు.

Advertisement
Advertisement