త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy Assures Adivasi MLAs | ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్

ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అటవీ అనుమతుల సాధన, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంపుపై ఆయన పలు కీలక హామీలు ఇచ్చారు.

J

Telangana | Published On Apr 13, 2026, 9.03 pm IST

CM Revanth Reddy Assures Adivasi MLAs | ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్

సంక్షిప్త సారాంశం

మంత్రి సీతక్క నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేల బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లోని సమస్యలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. చెక్ డ్యామ్‌ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, గిరిజన రైతులకు బోరు బావుల అనుమతులు, ఐటీడీఏల బలోపేతంపై అటవీశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే గిరిజన ప్రాంతాలకు ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచుతామని భరోసా ఇచ్చారు.

Advertisement

CM Revanth Reddy Assures Adivasi MLAs | త్రినేత్ర.న్యూస్ : ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన గిరిజన ప్రజాప్రతినిధులకు భరోసా ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి సీతక్క నేతృత్వంలో పలువురు ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రధాన హామీలు, ఆదేశాలు ఇవే

చెక్ డ్యామ్‌ల నిర్మాణం: ఏజెన్సీ ప్రాంతాల్లో తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు చెక్ డ్యామ్‌ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

అటవీ అనుమతుల వేగవంతం: అటవీశాఖ అభ్యంతరాల వల్ల రహదారుల నిర్మాణం, మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకురాగా.. రోడ్లు, చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీలైనంత త్వరగా అనుమతులు వచ్చేలా చూస్తామని సీఎం భరోసా ఇచ్చారు. దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ బోరు బావులకు గ్రీన్ సిగ్నల్: ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్లో బోర్లు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలన్న విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంపు: ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో గూడు లేని నిరుపేదలు ఎక్కువగా ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటాను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.

ఐటీడీఏ (ITDA)ల బలోపేతం: గిరిజనాభివృద్ధి సంస్థలను మరింత బలోపేతం చేసి, రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో మంత్రి సీతక్కతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తదితరులు ఉన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సీఎం సానుకూల స్పందన పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement