త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | విధ్వంస‌మైన విద్యాశాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | గ‌త పాల‌కులు విద్యాశాఖ‌ను విధ్వంసం చేశారని.. వారి అరాచకం వ‌ల్ల వందేండ్ల న‌ష్టం జ‌రిగింద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఈ దేశ భ‌విష్య‌త్ గ్రామీణ ప్రాంతాల్లో, త‌ర‌గ‌తి గ‌దుల్లో ఉంద‌ని విద్యాశాఖ‌ను త‌న వ‌ద్ద పెట్టుకున్నా.. విద్యాశాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నాం.. ఒక ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా ముందుకు పోతున్నాం అని సీఎం స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jun 19, 2026, 6.57 pm IST

CM Revanth Reddy | విధ్వంస‌మైన విద్యాశాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

బ‌డ్జెట్‌లో ఎనిమిదిన్న‌ర శాతం విద్యాశాఖ‌కే
విద్యార్థుల భ‌విష్య‌త్ కోసం రూ. 26,600 కోట్లు ఖ‌ర్చు
40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం
ఆరుట్ల పాఠ‌శాల‌లో న‌ర్స‌రీలో ప్ర‌వేశాలు క‌ల్పించాం
ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్‌ బోర్డు
ఇది మా ప‌నితీరుకు, నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం
మ‌న స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ దేశానికి న‌మూనాగా మారాలి
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించేందుకు పునాది ప‌డాలి
వైట్ కాల‌ర్ జాబ్‌ల‌కు ఫ్యూచ‌ర్ లేదు..
బ్లూ కాల‌ర్ జాబ్‌ల‌కే భ‌విష్య‌త్
మ‌న త‌ల‌రాత‌ల్ని మార్చేది త‌ర‌గ‌తి గ‌దే
వంద మంది అంబేద్క‌ర్‌లు రావాలి.. ప్ర‌పంచాన్ని మార్చాలి..
భ‌విష్య‌త్‌లో విద్యార్థుల‌కు ర‌వాణా స‌దుపాయం
ఎల్‌బీ స్టేడియం స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ వెల్ల‌డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త పాల‌కులు విద్యాశాఖ‌ను విధ్వంసం చేశారని.. వారి అరాచకం వ‌ల్ల వందేండ్ల న‌ష్టం జ‌రిగింద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఈ దేశ భ‌విష్య‌త్ గ్రామీణ ప్రాంతాల్లో, త‌ర‌గ‌తి గ‌దుల్లో ఉంద‌ని విద్యాశాఖ‌ను త‌న వ‌ద్ద పెట్టుకున్నా.. విద్యాశాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నాం.. ఒక ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా ముందుకు పోతున్నాం అని సీఎం స్ప‌ష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో నిర్వ‌హించిన‌ యంగ్ ఇండియా ఎడ్యుకేష‌న్ కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొని విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

భాషా ప్ర‌యుక్త రాష్ట్రంగానో, పరిపాల‌న సౌల‌భ్యం కోసమో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌లేదు. త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేశారు. వంద‌లాది మంది ఆత్మ‌బ‌లిదానాలు చేసుకున్నారు. ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌తో పాటు ఉద్యోగావ‌కాశాలు వ‌దులుకొని ఎంతో మంది ఆత్మ‌బ‌లిదానాలు చేసుకుంటే తెలంగాణ ఏర్ప‌డ్డ‌ది అని సీఎం పేర్కొన్నారు.

ఈ నిధులు భ‌విష్య‌త్ త‌రాల పెట్టుబ‌డి

ఆనాటి ఉద్య‌మంలో ముందు భాగాన నిల‌బ‌డ్డ కోదండ‌రాం, తొలి, మ‌లి ఉద్య‌మ సాక్షి కేవ‌శ‌వ‌రావు, పెప్ప‌ర్ స్ప్రేల‌ను త‌ట్టుకొని తెలంగాణ బిల్లు ఆమోదం కోసం పోరాడిన పొన్నం ప్ర‌భాక‌ర్ ఈ వేదిక మీద ఉన్నారు. ఇది ఒక భావోద్వేగం. తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి త‌ర‌గ‌తి గ‌దుల్లోనే ఉంది. త‌ర‌గ‌తి గ‌దుల‌ను పున‌రుద్ధ‌రించాలి. విధ్వంస‌మైన తెలంగాణ విద్యాశాఖ‌ను వికాసం వైపు న‌డిపించాల‌ని ఈనాడు తెలంగాణ ప్ర‌భుత్వం త‌న బ‌డ్జెట్‌లో ఎనిమిదిన్న‌ర శాతం నిధులను కేటాయించింది. రూ. 26,600 కోట్ల‌ను విద్యార్థుల భ‌విష్య‌త్ కోసం ఖ‌ర్చు పెడుతుంది ఈ ప్ర‌భుత్వం. దీన్ని ఖ‌ర్చుగా భావించ‌డం లేదు. ఈ నిధుల‌ను భ‌విష్య‌త్ త‌రాల పెట్టుబ‌డిగా భావిస్తున్నాం. విద్యార్థులే రేప‌టి భ‌విష్య‌త్‌కు దిక్సూచి. గురుకుల విద్యాసంస్థ‌ల్లోనే రాష్ట్ర భ‌విష్య‌త్‌ ఉంది అని సీఎం పేర్కొన్నారు.

ప‌దేండ్లుగా డైట్ ఛార్జీలు పెర‌గ‌లేదు..

ప‌దేండ్లుగా మీ డైట్ ఛార్జీల‌ను పెంచ‌లేదు. మేం వ‌చ్చాక 40 శాతం డైట్ ఛార్జీలు పెంచినం. 16 ఏండ్లు కాస్మోటిక్ ఛార్జీలు పెంచ‌లేదు. ప‌ల్లెలు, తండాల నుంచి వ‌చ్చిన ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ఇచ్చాం. ఆ కాస్మోటిక్ ఛార్జీల‌ను ఒక‌టో తేదీన ఇవ్వాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామ‌ని సీఎం తెలిపారు.

విద్యాశాఖ‌లో వందేండ్ల న‌ష్టం..

తెలంగాణ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న‌ది. ప‌దేండ్లు అధికారంలో ఉన్న‌వారు విద్యాశాఖ‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. పాఠ‌శాల‌లు మూసివేస్తూ పేద ప్ర‌జ‌ల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తూ విద్యాశాఖ‌ను విధ్వంసం చేశారు. రాష్ట్ర సీఎంగా ఈ దేశ భ‌విష్య‌త్ గ్రామీణ ప్రాంతాల్లో, త‌ర‌గ‌తి గ‌దుల్లో ఉంద‌ని విద్యాశాఖ‌ను త‌న వ‌ద్ద పెట్టుకున్నా.. విద్యాశాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నాం.. ఒక ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా ముందుకు పోతున్నాం. కొంద‌రు గిట్ట‌ని వారు తెలంగాణ విద్యాశాఖ‌కు మంత్రి లేడ‌ని అంటున్న‌రు. తెలంగాణ రాష్ట్ర సీఎం విద్యాశాఖ‌ను తొలి ప్రాధాన్య‌త కింద తీసుకుని ప్ర‌య‌త్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం, అరాచ‌కం వ‌ల్ల విద్యాశాఖ‌లో వందేండ్ల న‌ష్టం జ‌రిగింది.

ప్ర‌భుత్వ స్కూళ్ల‌ల్లో నో అడ్మిష‌న్ బోర్డులు

అందుకే ఈ రోజు మ‌న ప్ర‌భుత్వ విధానంలో న‌ర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీ తీసుకువ‌చ్చాం. పేద పిల్ల‌ల త‌ల్లిదండ్రులు మా పిల్ల‌లు ఐఏఎస్, ఐపీఎస్ అయితే త‌మ భ‌విష్య‌త్ మారుత‌ద‌ని క‌ల‌లు కంటున్నారు. తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వామ్యం కావాల‌ని క‌ల‌లు కంటున్నారు. వారి క‌ల‌ల‌ను సాక‌రం చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. న‌ర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలంగాణ ఎడ్యుకేష‌న్ పాల‌సీ చేసుకుని ప్ర‌క్షాళ‌న పెట్టుకున్నాం. ఈసారి న‌ర్స‌రీ నుంచి ప్ర‌వేశాలు క‌ల్పించాం. ఆరుట్ల పాఠ‌శాల‌లో న‌ర్స‌రీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌వేశాలు క‌ల్పించాం. ఆరుట్ల‌లో 1814 మంది ప్ర‌వేశాలు పొందారు. ఇంకా 1500 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్‌ బోర్డు పెట్టే రోజు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇది మా నిబ‌ద్ధ‌త‌కు, ప‌నితీరుకు గుర్తింపు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మా ఉపాధ్యాయులు. నేనే స్వ‌యంగా ఆరుట్ల పాఠ‌శాల విద్యార్థుల‌తో బ్రేక్ ఫాస్ట్ చేసి సంభాషించాను అని సీఎం గుర్తు చేశారు.

ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించేందుకు పునాది ప‌డాలి

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాబోతున్నాయి. సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ 30 ఎక‌రాల్లో ఉంది. మ‌న‌కు ఒలింపిక్స్‌లో ప‌థ‌కాలు రావ‌డం లేదు. కానీ సౌత్ కొరియా ఒలింపిక్స్‌లో ఆర్చ‌రీలో రెండు గోల్డ్ మెడ‌ల్స్ తీసుకువ‌చ్చింది. ఆ దేశ జ‌నాభా మ‌న రాష్ట్రంలో ఉన్నంత ఉంది. అంత చిన్న దేశం 32 బంగారు ప‌థ‌కాల‌ను తీసుకువ‌స్తే.. 140 కోట్ల జ‌నాభా ఉన్న మన దేశం గోల్డ్ మెడ‌ల్ తేలేదంటే ఈ దేశ ప్ర‌తిష్ట‌కు సంబంధించిన విష‌యం కాదా..? మ‌నలో స‌మ‌ర్థ‌త లేదా రాణించ‌లేమా..? ఆ గోల్డ్ మెడ‌ల్ సాధించాల్సిన స‌త్తా మ‌న తెలంగాణ బిడ్డ‌ల‌కు లేదా..? అంటే మ‌న‌ పాల‌కుల్లో లోపం ఉంది. స‌రైన దిశ ద‌శ చూపించ‌క‌పోవ‌డం వ‌ల్ల గోల్డ్ మెడ‌ల్స్ తేలేక‌పోతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ నెల‌కొల్పాం. రాబోయే రెండేండ్ల‌లో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ దేశానికి న‌మూనాగా మారి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించడానికి పునాది వేయాల‌ని నా క‌ల ఉంద‌ని సీఎం పేర్కొన్నారు.

ఇంగ్లీష్ ఒక్క‌టే స‌రిపోదు.. ఆ భాషలు కూడా నేర్చుకోవాల్సిందే

ఏఐ అనే ఒక భూతం వ‌చ్చింది. ఒక‌ప్పుడు కంప్యూట‌ర్ సైన్స్, ఇంజినీరింగ్ చ‌దివితే అమెరికాకు పోతే ల‌క్ష‌ల డాల‌ర్స్ సంపాదించేవారు. అమెరికా లాంటి దేశంలో ఏఐ తుపానుతో వైట్ కాల‌ర్ జాబ్‌లు పోయి ఉద్యోగాలు కోల్పోతున్నారు. కానీ బ్లూ కాల‌ర్ జాబ్‌లకు లేఆఫ్ ప్ర‌క‌టించ‌లేక‌పోతున్నారు. అందుకే నిరాద‌ర‌ణ‌కు గురైన ఐటీఐ కాలేజీల‌ను అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్స్‌గా మార్చాం. 2 వేలు స్కాల‌ర్‌షిప్స్ ఇస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజీల‌ను అప్‌గ్రేడ్ చేశాం. స్కిల్ యూనివ‌ర్సిటీ తీసుకొచ్చాం. భ‌విష్య‌త్‌లో ఒక్క‌టే ఇంగ్లీష్‌ స‌రిపోదు. మిగ‌తా దేశాల భాష‌లు నేర్చుకోవాలి.. జ‌పాన్, జ‌ర్మ‌నీ, ద‌క్షిణ కొరియా భాష‌లు నేర్చుకోవాలి.. అక్క‌డి వారితో ఉద్యోగాల కోసం పోటీ ప‌డాలి అని సీఎం సూచించారు.

నేను క‌న్న క‌ల‌ను నిజం చేశారు..

గురుకులాల్లో చ‌దివిన విద్యార్థుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లు అయ్యారు. నేను క‌న్న క‌ల‌ను నిజం చేశారు గురుకుల విద్యార్థులు. వారంతా ఈ దేశ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి. భ‌విష్య‌త్‌లోనూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌ల‌తో పాటు డాక్ట‌ర్లు, లాయ‌ర్లు, సైంటిస్టులు కావాల‌న్న‌ది నా క‌ల‌. అంతేకాదు ఈ దేశాన్ని ఏలే నాయ‌కులు కావాలి. ఈ దేశానికి మీరంతా అంబేద్క‌ర్‌లు కావాల‌ని క‌ల‌లు కంటున్నాను. అంబేద్క‌ర్ ప్ర‌పంచానికి దిక్సూచిగా మారారు. ఈ రోజు తెలంగాణ‌లోని ద‌ళిత‌, బ‌ల‌హీన వ‌ర్గాల నుంచి వంద మంది అంబేద్క‌ర్‌లు వ‌స్తే ప్ర‌పంచాన్ని మార్చే శ‌క్తి మీ ద‌గ్గ‌ర ఉంది. మ‌న త‌ల‌రాత‌లు మారేది త‌ర‌గ‌తి గ‌దుల్లోనే.. ప్ర‌భుత్వం ఇచ్చే సంక్షేమం కాదు.. ప్ర‌భుత్వం ఇచ్చే విద్య ఈ దేశానికి పునాదులు కావాలి. మ‌న త‌ల‌రాత‌ల్ని మార్చే భ‌విష్య‌త్ త‌ర‌గ‌తి గ‌దుల్లోనే ఉంది. చ‌ద‌వండి మీరు.. మీకు కావాల్సిన అన్ని వ‌స‌తులు ఇచ్చే బాధ్య‌త నాది అని మాట ఇస్తున్నాను. మీరు ఏం కోరినా నిమిషాల మీద జ‌రుగుతుంది. క్రీడాలు కావాలా..? చ‌దువు కావాలా..? ఏం కావాల్నో కోరుకోండి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కాదు.. భ‌విష్య‌త్‌లో ర‌వాణా సౌక‌ర్యాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ఏర్పాటు చేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement