త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్ల‌రేష‌న్‌కు బొంద పెట్టారు: హ‌రీశ్‌రావు

Harish Rao | రాహుల్ గాంధీ జన్మదినం రోజే కాంగ్రెస్ 'రైతు డిక్లరేషన్‌'ను బొంద పెట్టింద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమ‌ర్శించారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌లో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పార‌న్నారు. కేంద్రం ఏ పంట కొనమంటే ఆ పంట, ఎంత కొనమంటే అంతే కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్ప‌డం దుర్మార్గ‌మ‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Jun 19, 2026, 7.15 pm IST

Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్ల‌రేష‌న్‌కు బొంద పెట్టారు: హ‌రీశ్‌రావు
Advertisement
  • బోనస్ లేదు.. కొనుగోళ్లు లేవు.. కేంద్రం చెబితేనే కొంటామ‌ని ఉత్త‌మ్ చెబుతున్నారు
  • 7 రకాలకే బోనస్ ఇస్త‌ర‌ట‌
  • ఇది పేపర్ల కేబినెట్ కాదు.. అన్నదాతలను నిలువునా దగా చేసిన 'ఫెయిత్‌లెస్' కేబినెట్
  • ఐదు సీజన్లలో రేవంత్ ఎగ్గొట్టిన రైతు భరోసా రూ.29,358 కోట్లు
  • 7,600 మంది రైతుల కుటుంబాలకు బీమా ఇయ్య‌లే
  • ఎకరాకు రెండే యూరియా బస్తాలు ఎలా స‌రిపోత‌య్
  • కొనుగోళ్లు ఖతం.. రైతు భరోసా ఖతం.. రైతు బీమా ఖతం.. రేవంత్ పాలనలో రైతులకు ఇంకేం మిగిలింది
  • మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాహుల్ గాంధీ జన్మదినం రోజే కాంగ్రెస్ 'రైతు డిక్లరేషన్‌'ను బొంద పెట్టింద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమ‌ర్శించారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌లో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పార‌న్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బోనస్ లేదు, అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయ‌ద‌ని చెప్ప‌డం సిగ్గుచేట‌న్నారు. కేంద్రం ఏ పంట కొనమంటే ఆ పంట, ఎంత కొనమంటే అంతే కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్ప‌డం దుర్మార్గ‌మ‌ని మండిప‌డ్డారు. శుక్ర‌వారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆయ‌న‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు.

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు గతంలో మాట్లాడుతూ ఎంతైనా వడ్లు పండించండి, పండించిందంతా మేమే కొంటాం అని రైతులను న‌మ్మించారు. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేపర్ మీద రాసుకొచ్చినదాన్ని జాగ్రత్తగా చదివి వినిపిస్తూ.. కేంద్రం మద్దతు ధర నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే, ఏది కొనమంటే అంతే కొంటామని చెప్పారు. ఇది పేపర్ల కేబినెట్ కాదు.. ఇది 'ఫెయిత్‌లెస్' కేబినెట్. రైతుల పట్ల ఏమాత్రం విశ్వాసం, నమ్మకం లేని విశ్వాస ఘాతకమైన కేబినెట్ అని ఆయ‌న మండిప‌డ్డారు.

ఎన్నికల ముందు చివరి గింజ వరకూ కొంటాం, రూ. 500 బోనస్ ఇస్తాం అని నమ్మించి, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనం అని కాంగ్రెస్ ప్రకటించడం రైతులను దారుణంగా మోసం చేయడమే. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో తన బాధ్యతల నుండి పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా, కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పంటలూ కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నది. వెంటనే ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు అన్నారు.

ఉత్తమ్ మాటల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు కొనదు. అంటే వచ్చే వానాకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా మక్కలు, జొన్నలు కొనమని చేతులెత్తేసినట్టే. కానీ కేసీఆర్ ప్రభుత్వం మక్కలు, జొన్నలు కొని అండగా నిలిచింది. పప్పు దినుసులు, నూనె విత్తనాలైన కందులు, పెసలు, శనగలు, సన్‌ఫ్లవర్ లాంటి పంటలను కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఒక రైతుకు ఎకరాకు 12 క్వింటాళ్ల కందులు పండితే, అందులో మీరు 2.5 క్వింటాళ్లు కొని, మిగతా 9.5 క్వింటాళ్లను రైతు బయట మార్కెట్లో అమ్ముకోవాలా? పెసర్లు ఎకరాకు 6 క్వింటాళ్లు వస్తే కేవలం 2 క్వింటాళ్లు కొని మిగతాది రైతు బయట అమ్ముకోవాలా? సన్‌ఫ్లవర్ ఎకరాకు 8-10 క్వింటాళ్లు వస్తే రెండు మూడు క్వింటాళ్లు కొని మిగతావి బయట అమ్ముకోమంటావా? రైతుల కష్టాన్ని దళారుల పాలు చేయాలని చూస్తున్నావా రేవంత్ రెడ్డి? అని హ‌రీశ్‌ ప్ర‌శ్నించారు.

త‌డి గుడ్డ‌తో గొంతు కోశారు..

మన దగ్గర వరి విపరీతంగా పండుతుంది. 2021-22 లో కేసీఆర్ గారి హయాంలో రికార్డు స్థాయిలో 92 లక్షల టన్నులు పండితే, కేంద్రం కొనకపోయినా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొంటామని ప్రకటించింది. అంటే వచ్చే సంవత్సరం నువ్వు అంతే కొని వదిలేస్తావా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను తడిగుడ్డతో గొంతు కోసి దారుణంగా మోసం చేసింది. మీకు కనీసం కాసింత రైతుల పట్ల ప్రేమ ఉన్నా, మీరు నిజమైన రైతు బిడ్డ అయితే తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని మాజీ మంత్రి ప్ర‌క‌టించారు.

యూరియా విషయంలో అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఎకరాకు రెండు యూరియా బస్తాలే ఇస్తామని కొత్తగా యాప్ పెట్టి, సర్క్యులర్ జారీ చేసి ఆ రెండు బస్తాల కోసం రైతులను అష్టకష్టాలు పెడుతున్నారు. క‌నీసం యూరియా సక్రమంగా ఇచ్చే తెలివి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఎందుకింత చిన్నచూపు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మిర్చి పంట పండుతుంది. దానికి ఎకరాకు ఐదారు బస్తాల యూరియా పడుతుంది. అలాంటిది రెండు బస్తాలే ఇస్తే మిగతావి ఎక్కడికి పోవాలి. వరికి ఎకరానికి మూడు బస్తాలు అవసరమైతే రెండు ఇస్తామంటే రైతులు ఏం కావాలి.యాప్‌లు పెట్టి పోలీసు బందోబస్తు మధ్య పోలీస్ స్టేషన్లలో యూరియా పంచడం అత్యంత దారుణం అని హ‌రీశ్‌రావు ఆగ్ర‌హించారు.

33 ర‌కాల‌కు ఇస్తామ‌ని 7కు ఎందుకు తగ్గించారో చెప్పాలి..

కేంద్ర ప్రభుత్వం అటు డీజిల్ ధరలు, ఇటు ఎరువుల ధరలు పెంచి రైతు మీద మోయలేని భారం మోపుతోంది, కానీ దానికి తగ్గట్టుగా మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెంచడం లేదు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత వరికి మాత్రమే అన్నారు, ఆ తర్వాత సన్నాలకు మాత్రమే అన్నారు. ఆ సన్నాల్లో కూడా 33 రకాలకే బోనస్ అన్నారు. ఇప్పుడు నిన్నటి కేబినెట్ తర్వాత షావుకారు లెక్క చల్లగా కేవలం 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ అంటున్నారు. ఆ 7 రకాల్లో బీపీటీ 520 లాంటి రకాలకు విపరీతమైన చీడపీడలు ఉంటాయి. దిగుబడి కూడా ఎకరానికి కేవలం 20 క్వింటాళ్లే వస్తుంది. అదే వేరే వరి రకం అయితే 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. తక్కువ దిగుబడి వచ్చే పంట వేస్తే రూ. 500 బోనస్ కంటే రైతే ఎక్కువ లాస్ అవుతాడు. బోనస్ ఇచ్చే రకాలను 33 నుంచి 7 రకాలకు ఎందుకు కుదించారో సమాధానం చెప్పాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు.

రేవంత్ ఎక‌రానికో మీటింగ్ పెడుతుండు..

పోయిన యాసంగికి రూ. 1200 కోట్ల బోనస్ ఎగ్గొట్టారు, ఈ వానాకాలం రూ. 700 కోట్ల బోనస్ ఎగ్గొట్టారు. ఇప్పటికే సగం మంది రైతులు మీరు చెప్పిన 33 రకాల సన్నాలకు సరిపడా నారు కూడా పోశారు, ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏంటి. కేసీఆర్ ఏనాడూ రైతుబంధు వేయడానికి మీటింగ్ పెట్టలేదు. సమయానికి ఎలాంటి ఆర్భాటం లేకుండా 11 విడతల్లో రూ. 74 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేశారు. కానీ రేవంత్ రెడ్డి ఎకరానికో మీటింగ్ పెడుతున్నాడు. మార్చి 22న సిద్దిపేటకు వచ్చి ఆర్భాటంగా ఒక ఎకరాకు వేశాడు. కేసీఆర్ జగిత్యాల వెళ్లగానే ఇంకో మీటింగ్ పెట్టి మరో ఎకరానికి వేశాడు, నిన్న మధిరలో ఇంకో ఎకరానికి ఇస్తామని ప్రకటించాడు అని హ‌రీశ్ ఎద్దేవా చేశారు.

నర్మెట్టలో ఆయిల్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేయడానికి వచ్చి కనీసం సిగ్గు లేకుండా 45 రోజుల్లో రైతుబంధు పూర్తి చేస్తామని ఒట్టిగా మాటలు చెప్పావు రేవంత్ రెడ్డి. 91 రోజులైనా నువ్వు చెప్పిన ఆ తొమ్మిది వేల కోట్లు ఇంకా రైతుల ఖాతాల్లో పడలేదు. ఎన్నికల ముందు రైతుబంధు రూ.10,000 ఉంటే రూ.15,000 ఇస్తామని చెప్పావు. కానీ 2024-25 వానాకాలం రైతుబంధు ఏ ఒక్క ఎకరానికి కూడా ఇవ్వకుండా గుండు సున్నా చేశావు. 2024-25 యాసంగికి మూడెకరాలకు ఇచ్చి మిగతా అందరికీ ఎగ్గొట్టారు. 2025-26 యాసంగికి రెండెకరాలకు ఇచ్చి మిగతా రైతులకు ఎగ్గొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఐదు పంటలు కలుపుకుని రైతుభరోసా కింద రైతాంగానికి ప్రభుత్వం బాకీ పడిన మొత్తం ఏకంగా రూ. 29,358 కోట్లు అని పేర్కొన్నారు.

రైతుబీమా గురించి నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఏ జిల్లాకు వెళ్లినా రైతుబీమా ఆగిందా లేదా అన్నది మీరే సమాధానం చెప్పాలి. జనవరి నెల నుంచి ఈరోజు వరకు చనిపోయిన 7,600 మంది రైతులకు ఐదు నెలలుగా రైతు బీమా డబ్బులు ఎందుకు పడలేదో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలి. ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడం వల్లే చనిపోయిన రైతులకు బీమా రావడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో చనిపోయిన పది రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఖాతాల్లో పడే రైతు బీమా.. ఇప్పుడు ఐదు నెలలైనా ఎందుకు రావడం లేదు? కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పంట పండించినా మద్దతు ధర వస్తుందనే ధీమా రైతులకు ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ధీమా లేకుండా చేసింది అని ఆరోపించారు.

కొనుగోళ్లు ఖతం, రైతుబంధు ఖతం, రైతుబీమా ఖతం, యూరియా ఖతం.. రైతులకు గోచి తప్ప ఏమీ మిగిల్చేటట్టు లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాహుల్ గాంధీ జన్మదినం నాడే 'రైతు డిక్లరేషన్‌'ను బొందపెట్టారు. కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చితే, పంటలు కొనలేక రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. దేశానికి అన్నం పెట్టే రైతే ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. నిన్న కేబినెట్‌లో తీసుకున్న ఈ కర్కశ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని, రైతులకు క్షమాపణ చెప్పి, అన్ని పంటలను యథావిధిగా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement