త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్‌

KTR | తెలంగాణ‌లో గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం నడవడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర నలుమూలలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండా మాత్రమేనని స్పష్టంచేశారు.

P

Telangana | Published On Jun 19, 2026, 6.06 pm IST

KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్‌
Advertisement

KTR | తెలంగాణ‌లో గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం నడవడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర నలుమూలలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండా మాత్రమేనని స్పష్టంచేశారు. ఏ ఎన్నికలొచ్చినా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ మల్కాజ్‌గిరిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలోనూ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే, ఇక్కడి సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లపై కూడా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడటం ఖాయమని కేటీఆర్ వెల్లడించారు.

ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌ను ఆశీర్వ‌దిస్తున్న‌రు..

తెలంగాణకు మళ్లీ మంచిరోజులు రావాలన్నా, హైదరాబాద్ అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టాలన్న అది బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ప్రజలు గుండెలనిండా ఆశీర్వదిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల మాదిరిగా ముందుకు సాగాయని కేటీఆర్ తెలిపారు. 2014 కు ముందు ఎండాకాలం వచ్చిందంటే చాలు కరెంట్ కష్టాలతో ప్రజలు అల్లాడిపోయే వారని గుర్తుచేశారు. అపార్ట్మెంట్లు, దుకాణాల వద్ద జనరేటర్ల మోత మోగేదని, ప్రజల జేబులు ఖాళీ అయ్యేవని తెలిపారు. పరిశ్రమలకు మూడురోజుల పాటు పవర్ హాలిడేలు ప్రకటిస్తే, ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేసే దుస్థితి ఉండేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కరెంట్‌తోపాటు తాగునీటి కూడా తండ్లాట ఉండేదని, ఖైరతాబాద్ లోని జలమండలి ముందు ఖాళీ బిందెలతో ప్రతినిత్యం ధర్నాలు, నిరసనలు హోరెత్తిపోయేవని అన్నారు.

క‌రెంటు స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా తీర్చారు..

కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్టటిన ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కరెంట్ సమస్యను శాశ్వతంగా తీర్చారని, లక్ష కోట్లు ఖర్చుపెట్టి అటు వ్యవసాయానికి, ఇటు గృహ అవసరాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. హైదరాబాద్ వాసుల తాగునీటి కష్టాలను తీర్చి, ఏకంగా 25 వేల లీటర్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విషయాన్ని గుర్తుచేశారు. సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించామని, రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ.2000 పెంచుకున్నామని, ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని తెలిపారు. మల్కాజ్‌గిరిలోనే 3500 డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చుకున్నామని తెలిపారు. 15 లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు అందించి ఆదుకున్న మేనమామ కేసీఆర్ అని వెల్లడించారు.

సినిమా హిట్టో ఫ‌ట్టో చెప్పాలి..

ట్రెయిలర్ చూస్తేనే సినిమా హిట్టో, ఫట్టో చెప్పే రోజులివని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సగం సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ అసమర్థ పాలనను చూసి తిట్టుకోని రోజు లేదని స్పష్టం చేశారు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి మెతుకు చాలని, 30 నెలల్లో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడని, తులం బంగారం ఇస్తాం, రైతుభరోసా 15 వేలు చేస్తాం, పెన్షన్‌ను డబుల్ చేస్తామని అడ్డగోలు హామీలిచ్చారని దుయ్యబట్టారు. చివరికి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల పేరిట చేసిన మోసం రెండున్నరేళ్ల పాలనలో పూర్తిగా బట్టబయలైందని మండిపడ్డారు. వంద రోజుల్లోనే అన్నీ హామీలు అమలు చేస్తామని పంచిన గ్యారెంటీ కార్డుకు కాంగ్రెస్ సర్కారు పాతరేసిందని విమర్శించారు. గ్యారెంటీ కార్డును భద్రంగా పెట్టుకోవాలని చెప్పిన డిప్యూటీ సీఎం మాటలు నీటి మూటలయ్యాయని అన్నారు. గ్యారెంటీల సంగతి ఏమైందని సీఎంను ప్రశ్నిస్తే, గుడ్లు పీకి గోటీలు ఆడతా, పేగులు మెడలో వేసుకుంటా అని తిట్ల పురాణం అందుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement