CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణను ఓడగొట్టేందుకు 14 మీటింగ్‌లు పెట్టానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం చాలా ప్రయత్నం చేశామని, కానీ విఫలమైందని సీఎం గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఎన్నికలప్పుడు నా ఓటమికి అందరూ ప్రయత్నం చేశారని డీకే అరుణ అన్నారు. అందులో దాపరికం ఏం లేదు. మహబూబ్‌నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించేందుకు ఎన్నో మీటింగ్‌లు పెట్టాను. ఒక వేళ నేనే నిలబడితే నాలుగే మీటింగ్‌లు పెట్టేవాడిని. కానీ వంశీచంద్ రెడ్డిని గెలిపించాలి.. అరుణమ్మ ఓడగొట్టాలని 14 మీటింగ్‌లు పెట్టాను. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు.. గెలిపించారు. ఎన్నికల తర్వాత రాజకీయాల్లేవు. కుట్రలు కుంత్రంతాలు లేవు అని సీఎం అన్నారు. కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మెలగాలి. సమస్యల పరిష్కారం కోసం, పాలమూరు అభివృద్ధి కోసం మోదీతో కలిసిమెలిసి ముందుకు పోతాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మోదీని కలవక తప్పదు. నిధులు రావాలంటే కలవాల్సిందే. నాకు ఎవరూ శత్రువులు లేరు. శత్రువు అనుకున్న వాడిని 2023లో బండకేసి కొట్టాను. ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా చూపించాను. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడగొట్టాను. పంచాయతీ ఎన్నికల్లో గెలిచాను. భవిష్యత్‌లోనూ గెలుస్తానని రేవంత్ వ్యాఖ్యానించారు.