త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummidihetti Barrage | 148? 150? 152? తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఈ సారైనా కొలిక్కి వచ్చేనా?

Tummidihetti Barrage | తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం 148 మీటర్ల ఎత్తులో జరగనుందా? లేదా 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోనున్నదా? అనే సందిగ్ధత ఈ నెలాఖరుకల్లా వీడే అవకాశం ఉన్నది. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర ఒప్పుకున్నా.. దాంతో రాష్ట్రానికి సరిపడా నీళ్లొచ్చే అవకాశం లేదు. అయితే ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం 150 లేదా 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి సంకల్పించుకొని ఆ దిశగా మహారాష్ట్రను ఒప్పించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నది.

S

Telangana | Published On Oct 23, 2026, 6.07 pm IST

Tummidihetti Barrage | 148? 150? 152? తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఈ సారైనా కొలిక్కి వచ్చేనా?
Advertisement

ఈ వారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని
చర్చలకు ఆహ్వానించనున్న మహారాష్ట్ర
150 లేదా 152 మీటర్లకు ఒప్పించేలా
వివరాలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశం
డిండికి ఏదుల పాయింట్ నుంచే నీటి తరలింపు
పాలమూరు నీటికి గండి పడకుండా 0.6 టీఎంసీ తరలింపు
నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి

Tummidihetti Barrage | త్రినేత్ర న్యూస్ : తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం 148 మీటర్ల ఎత్తులో జరగనుందా? లేదా 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోనున్నదా? అనే సందిగ్ధత ఈ నెలాఖరుకల్లా వీడే అవకాశం ఉన్నది. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర ఒప్పుకున్నా.. దాంతో రాష్ట్రానికి సరిపడా నీళ్లొచ్చే అవకాశం లేదు. అయితే ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం 150 లేదా 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి సంకల్పించుకొని ఆ దిశగా మహారాష్ట్రను ఒప్పించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీటముడిగా ఉన్న అంశాలన్నింటినీ ఈ సమావేశంలో చర్చించారు.

148 ఎత్తులో కడితే నీళ్లు రావు

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవలే సూచనప్రాయంగా తెలియజేశారని సీఎం వెల్లడించారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మిస్తే ఎంత నీటిని తెచ్చుకునే వీలుంది.. 150 మీటర్ల ఎత్తున ఎంత నీటిని ఎల్లంపల్లి వరకు తెచ్చుకునే వీలుందనే వివరాలను ఇరిగేషన్ ఇంజనీర్లు సీఎంకు వివరించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని వివరించారు. 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని వివరించారు. గతంలోనే 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిందని, అంత తక్కువ ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకునే వీల్లేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకే 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల వివరాలు, అక్కడ చర్చించిన అంశాలు, వాళ్లు కోరిన నివేదికలన్నీ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రతో చర్చల సందర్భంగా తెలంగాణ నీటి అవసరాలను తెలియజేసి, మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సీఎం సూచించారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చే ప్రాజెక్టు రూట్ డిజైన్లు, భూసేకరణపై దృష్టి సారించాలని ఇరిగేషన్ ఇంజినీర్లను సీఎం ఆదేశించారు.

ఏదుల నుంచే డిండికి నీరు

డిండికి నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలా? లేక ఏదుల నుంచి తీసుకోవాలా? అనే విషయంలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగింది. ఈ సందర్భంగా నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుంది.. ఏదుల నుంచి నీటిని తీసుకుంటే ఎంత అంచనా వ్యయమవుతుందనే వివరాలన్నీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనుకూలతలు, ప్రతికూలతలన్నింటినీ వివరించారు. మధ్యేమార్గంగా పాలమూరు ప్రాజెక్టు నీటికి ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు మంత్రులు మద్దతు తెలిపారు. డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టు నీటి అవసరాలకు ఎలాంటి కోత పడదని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు నీటి కేటాయింపులకు ఆటంకం లేకుండా ఏదుల నుంచి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని అందించేలా ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్, సీఎంవో సెక్రెటరీ మాణిక్ రాజ్‌తో పాటు సెక్రెటరీ (టన్నెల్) కల్నల్ పరీక్షిత్ మెహ్రతో పాటు ఇరిగేషన్ జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, అన్ని ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement