త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Eatala Rajender | జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డ్‌తో గ‌ర్భిణుల‌కు గ‌ర్భ‌స్రావాలు 

MP Eatala Rajender | జవహర్ నగర్ డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు అని మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. గ‌ర్భిణుల‌కు గర్భస్రావాలు జ‌రుగుతున్నాయి. స్థానికుల్లో చాలా మంది క్యాన్సర్లు, శ్వాసకోశ వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు అని తెలిపారు.

S

Telangana | Published On Oct 23, 2026, 6.05 pm IST

MP Eatala Rajender | జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డ్‌తో గ‌ర్భిణుల‌కు గ‌ర్భ‌స్రావాలు 
Advertisement

ప్రతిరోజూ 12 మిలియన్ టన్నుల మీథేన్ గ్యాస్ విడుదల
డంప్ యార్డుకు 30 కి.మీ. ప‌రిధిలో ప్ర‌జ‌ల న‌ర‌క‌యాత‌న‌
క‌లుషిత నీటి వ‌ల్ల చెరువుల్లో చేప‌లు చ‌నిపోతున్నాయి
డంపింగ్ యార్డ్ త‌ర‌లించాల‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల డిమాండ్

MP Eatala Rajender | త్రినేత్ర న్యూస్ : జవహర్ నగర్ డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు అని మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. గ‌ర్భిణుల‌కు గర్భస్రావాలు జ‌రుగుతున్నాయి. స్థానికుల్లో చాలా మంది క్యాన్సర్లు, శ్వాసకోశ వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు అని తెలిపారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్దదైన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై దమ్మాయిగూడలోని సాయి భవాని ఫంక్షన్‌ హాల్‌లో బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డితో క‌లిసి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా రాజేంద‌ర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నివసించేవారంతా అత్యంత పేదరికంలో ఉన్నవారు, కీసర, ఘట్‌కేసర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ఇంకా వ్యవసాయం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి ఎంపీగా గెలిచారు, కానీ వారు చూపిస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బూటకం. డంప్ యార్డ్ నుంచి వెలువడుతున్న లీచాట్ (కలుషిత నీరు) కారణంగా చెరువుల్లో చేపలు చనిపోతున్నాయి, గర్భిణీ స్త్రీలకు గర్భస్రావాలు అవుతున్నాయని చెబుతుంటే దుఃఖం వస్తుందన్నారు.

ఇక్కడ ప్రతిరోజూ 12 మిలియన్ టన్నుల మీథేన్ గ్యాస్ విడుదలవుతోంది, ఇది 12 లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యం కంటే ఎక్కువ. కార్బన్ డై ఆక్సైడ్ కంటే 80 రెట్లు అధిక కాలుష్యం వెలువడటం వల్లే హైదరాబాద్ నగర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నిపుణుల రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సమస్యను పార్లమెంట్‌లోనూ లేవనెత్తాను, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రిపోర్ట్‌తో రావాలని సూచించార‌ని ఎంపీ తెలిపారు.

రాంకీ, అయోధ్య రెడ్డిల ద్వారా వచ్చే సీఎస్ఆర్ నిధులను ఇక్కడ కాకుండా ఆంధ్రా ప్రాంతానికి ఖర్చు చేయడం సిగ్గుచేటు. ఈ సమస్య పరిష్కారం కోసం భేషజాలు పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసినా ప్రయోజనం లేకపోయింది. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఐఏఎస్ అధికారి నరహరి కనుగొన్న పరిష్కారాన్ని ఇక్కడ వినియోగించాలని, వాసన, లీచాట్ సమస్య లేని టెక్నాలజీని ఎక్కడి నుంచైనా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. డబ్బుల కోసం ఆలోచన చేయకండి. విబ్రంట్ హైదరాబాద్ బ్రాండ్‌ను పోగొట్టకండి, చెత్తకు శాశ్వత పరిష్కారం అందించమని కోరుతున్నానని ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement