త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | చెప్పులు కుట్టిన జాతి.. ఈ రాజ్యాన్ని న‌డ‌పాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | ఎన్నో ఏండ్లుగా అణిచివేత‌కు గురై.. చెప్పులు కుట్టిన జాతి ఈ రాజ్యాన్ని న‌డ‌పాలి అని సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Mar 6, 2026, 5.28 pm IST

CM Revanth Reddy | చెప్పులు కుట్టిన జాతి.. ఈ రాజ్యాన్ని న‌డ‌పాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

ప్ర‌భుత్వానికి క‌ళ్లు, చెవులు నా ప్ర‌భుత్వ ఉద్యోగులే..
సంక్షేమం, అభివృద్ధి మా సంక‌ల్పం
పంచ‌డానికి ప్ర‌భుత్వం వ‌ద్ద భూముల్లేవు
మాదిగ జాతి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం
ఎలా పిలిచినా ఇబ్బంది లేదు..
నేను అంద‌రి వాడిని.. సీఎం రేవంత్ వ్యాఖ్య‌

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఎన్నో ఏండ్లుగా అణిచివేత‌కు గురై.. చెప్పులు కుట్టిన జాతి ఈ రాజ్యాన్ని న‌డ‌పాలి అని సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైటెక్ సిటీ స‌మీపంలోని శిల్పా క‌ళా వేదిక‌లో మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేష‌న్ క‌మిటీ ఏర్పాటు చేసిన స‌భ‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అథితిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

ప్ర‌భుత్వానికి క‌ళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడ‌ర్లు నా ప్ర‌భుత్వ ఉద్యోగులే. 99 రోజుల ప్ర‌జా పాల‌న‌.. ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మాన్ని తీసుకున్నాం.. ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నాం. ప్ర‌తిపేద వాడికి రేష‌న్ కార్డు అందాలంటే మీరు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి కోసం పేద‌లు ఎదురు చూస్తున్నారు. అత్యంత వెనుక‌బాటు త‌నంలో మాదిగ జాతి ఉంది.. ప్ర‌భుత్వ. ఉద్యోగులు వాళ్ల‌కు అండ‌గా ఉండాలి. సంక్షేమం, అభివృద్ధిని అందించాల‌న్న‌దే మా సంకల్పం అని సీఎం పేర్కొన్నారు.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చే బాధ్య‌త ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ది..

ప్ర‌తి నెల 1000 మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. నెల‌కు 1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వ‌స్తోంది. అయినా స‌మ‌న్వ‌యం చేసుకుని ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నాం. ప్ర‌భుత్వ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చే బాధ్య‌త ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ది. అక్ర‌మాల‌ను అరిక‌ట్టి ఖ‌జానాకు నిధులు తీసుకువ‌స్తే ప‌ది మందికి స‌హాయం అందుతుంది. గ‌తంలో జాగీరుదారులు, జ‌మీందార్ల ద‌గ్గ‌ర వేలాది ఎక‌రాల భూములు ఉండేవి. అసైన్డ్ భూముల విష‌యంలో ప్ర‌భుత్వం అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది. పంచ‌డానికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భూములు లేవు. ప్ర‌భుత్వానికి ఆర్థిక వెసులుబాటు ప‌రిమితంగా ఉంది అని సీఎం తెలిపారు.

మీ జాతి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం..

దారిద్య్ర రేఖ‌లో ఉన్న జాతి ముందుకు న‌డ‌వాలంటే విద్య అవ‌స‌రం. నా ద‌గ్గ‌ర ఉన్న విద్యా శాఖ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నాను. నాణ్య‌మైన విద్య కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం. ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో చ‌దువుకునే విద్యార్థుల‌కు కాస్మోటిక్ , డైట్ ఛార్జీలు పెంచాం. విద్య ఒక్క‌టే మీ జీవితంలో మార్పు తీసుకువ‌స్తుంది. అవ‌కాశం వ‌స్తే ప‌ది మందికి సాయం చేస్తార‌నే మంచి పేరు మీరు, నేను తెచ్చుకోవాలి. మీ జాతి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాం.. మీ హ‌క్కుల‌ను చ‌ట్ట‌బ‌ద్దం చేసి కాపాడుతాం. చ‌ట్ట‌బ‌ద్ద‌మైన హ‌క్కుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మీది అని సీఎం అన్నారు.

మీరాకుమార్ స్పూర్తితో ప‌ని చేస్తా

గ‌త ప్ర‌భుత్వం బర్రెలు, గొర్రెలు, చేప‌లు ఇచ్చింది.. చెప్పులు కుట్టుకొమ్మ‌ని చెప్పింది. బ‌ర్రెలు, గొర్రెలు, చేప‌లు కాదు.. చెప్పులు కుట్టుకున్న జాతి ఈ రాజ్యాన్ని న‌డ‌పాలి.. క‌లెక్ట‌ర్లు, డాక్ట‌ర్లు, ఇంజనీర్లు, లాయ‌ర్లు కావాలి. తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి. నా శ‌క్తి ఉన్నంత వ‌ర‌కు మీకు సాయం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీరాకుమార్ ఎలా ప‌నిచేశారో అలాంటి స్పూర్తితో ప‌నిచేస్తాన‌ని రేవంత్ పేర్కొన్నారు.

ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అంద‌రి వాడిని..

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేసిన‌ప్పుడు రేవంత్ మాదిగ‌, బీసీలు రేవంత్ యాద‌వ్, వాకిటి శ్రీహ‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తే రేవంత్ ముదిరాజ్ అని, సిక్కులు స‌ర్దార్ రేవంత్ అని అస‌దుద్దీన్ కు సాయం చేశాన‌ని రేవంతుద్దీన్ అని న‌న్ను అన్నారు. ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అంద‌రి వాడిని. సీఎంగా వ‌చ్చిన అవ‌కాశాన్ని ప‌ది మందికి స‌హాయం చేయ‌డానికే అని భావిస్తున్న‌. వ‌చ్చిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని మీ జాతికి చేయూత ఇచ్చిన‌ప్పుడే నాకు నిజ‌మైన సంతోషం క‌ల్గుతుంది అని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement