CM Revanth Reddy | తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి రక్షణ : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన, సురక్షితమైన గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం, రక్షణ అందిస్తుందని స్పష్టం చేశారు. ఎంత పెట్టుబడి పెడతారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు? అన్నది మాత్రమే చెప్పాలని.. మిగతా బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.
CM Revanth Reddy | తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన, సురక్షితమైన గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం, రక్షణ అందిస్తుందని స్పష్టం చేశారు. ఎంత పెట్టుబడి పెడతారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు? అన్నది మాత్రమే చెప్పాలని.. మిగతా బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ‘‘తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించండి.. Think Global, Invest Glocal’’ అని సీఐఐ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. సీఐఐ ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో గత ప్రభుత్వాలు చేపట్టిన మంచి విధానాలను కొనసాగిస్తూనే కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో Policy Paralysis లేదని, ఏ నాయకుడు, ఏ పార్టీ మంచి విధానం తీసుకొచ్చినా కొనసాగిస్తామని తెలిపారు.
2047 నాటికి దేశ జీడీపీలో 10 శాతం వాటా
తెలంగాణ ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి ఈ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు. 2037 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తన కల అని చెప్పారు. గత డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు 175 దేశాల ప్రతినిధులు హాజరయ్యారని గుర్తుచేశారు. ఆ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్–2047’ విధానాన్ని ప్రకటించినట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం వివరించారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ లోపల 1.30 కోట్ల మంది నివసిస్తున్నారని.. ఈ ప్రాంతాన్ని COREగా పరిగణించి సేవారంగాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. ఓఆర్‌ఆర్ వెలుపల ప్రాంతాన్ని PUREగా అభివృద్ధి చేసి తయారీ రంగానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఓఆర్‌ఆర్ తర్వాత 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని, ఆ పరిధి నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని RAREగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు, మౌలిక వసతులు కల్పించడంతోపాటు రేడియల్ రోడ్లు, పోర్టు అనుసంధాన మార్గాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తున్నామని చెప్పారు. వివిధ రంగాలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
‘చైనా ప్లస్ వన్’లో తెలంగాణ కీలకం
తయారీ రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. చైనా, జపాన్, జర్మనీతో పోటీ పడే స్థాయిలో తెలంగాణను తయారు చేయాలన్నదే లక్ష్యమన్నారు. ‘చైనా ప్లస్ వన్’ వ్యూహంలో రాష్ట్రం కీలక పాత్ర పోషించేలా పారిశ్రామిక వాతావరణాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. శంషాబాద్–చెన్నై, శంషాబాద్–పుణే, శంషాబాద్–బెంగళూరు మార్గాల్లో మూడు బుల్లెట్ రైలు ప్రాజెక్టులు తెలంగాణకు రానున్నాయని వెల్లడించారు. తెలంగాణ భూములు ఎంతో సారవంతమైనవని సీఎం అన్నారు. పూలు, పండ్ల సాగును ప్రోత్సహించడంతోపాటు కోల్డ్ స్టోరేజీలు, ఇతర మౌలిక వసతులను పెంచుతామని తెలిపారు. సేవలు, తయారీ, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. దేశంలోని కొన్ని మెట్రో నగరాలు కాలుష్యం, ట్రాఫిక్, మౌలిక వసతులు, శాంతిభద్రతల సమస్యలను ఎదుర్కొంటున్నాయని.. తెలంగాణ మాత్రం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని అన్నారు.
ఏఐ సునామీకి సిద్ధమవుతున్నాం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతోందని సీఎం పేర్కొన్నారు. ‘‘ఏఐ సునామీ రాబోతోంది’’ అని వ్యాఖ్యానిస్తూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా, ప్రముఖ కార్పొరేట్ ప్రతినిధులు బోర్డు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ నైపుణ్య విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) మారుస్తున్నామని, వీటి నిర్వహణలో టాటా సంస్థ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. 86 శాతం నిధులను టాటా సంస్థ భరిస్తోందని, శిక్షణ పూర్తిచేసిన వారికి 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వ్యవస్థను రూపొందించామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకే శిక్షణ, కోర్సులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఫ్యూచర్ సిటీలో ప్రపంచ సంస్థలకు ఆహ్వానం
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో పెట్టుబడులకు 200 కంపెనీలు ముందుకొచ్చాయని సీఎం తెలిపారు. అమెజాన్ డేటా సెంటర్ల కోసం రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందని, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లో ఉండగా.. భారత్ ఫ్యూచర్ సిటీని 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. సింగపూర్ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని, ప్రపంచంలోని 500 ప్రముఖ కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల ఫలితంగానే దేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా పీవీ దేశ ప్రధానమంత్రి కావడం గర్వకారణమన్నారు. పెట్టుబడిదారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుబాటులో ఉంటారని.. పరిశ్రమల శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకు ఒకసారి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారని చెప్పారు. తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వయంగా సమావేశమై సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడటం తమ లక్ష్యం కాదని.. టోక్యో, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లడమే ధ్యేయమని సీఎం చెప్పారు. ‘‘తెలంగాణ అంటే వ్యాపారం.. తెలంగాణ ఇప్పుడు రైజింగ్ తెలంగాణ. రండి.. పెట్టుబడులు పెట్టండి’’ అని సీఐఐ ప్రతినిధులను ఆహ్వానించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Raashii Khanna | ధర్మన్ షూటింగ్లో రాశీఖన్నాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
- ●Tirumala Brahmotsavam | సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- ●వైన్ అంటే కేవలం డ్రింక్ అనుకుంటివా... అదో వైబ్! వైన్ సీక్రెట్ హిస్టరీ ఇదే!
- ●Family Certificate | అందుబాటులోకి 'ఫ్యామిలీ సర్టిఫికెట్'.. ఎక్కడ పొందాలో తెలుసా..?
- ●Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్ విస్తరణలో అలసత్వం సహించం : మంత్రి తుమ్మల
- ●Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తనూజ ఎంట్రీ - తెలుగు వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Raashii Khanna | ధర్మన్ షూటింగ్లో రాశీఖన్నాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్

Tirumala Brahmotsavam | సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

వైన్ అంటే కేవలం డ్రింక్ అనుకుంటివా... అదో వైబ్! వైన్ సీక్రెట్ హిస్టరీ ఇదే!

Family Certificate | అందుబాటులోకి 'ఫ్యామిలీ సర్టిఫికెట్'.. ఎక్కడ పొందాలో తెలుసా..?




