Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్ విస్తరణలో అలసత్వం సహించం : మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao | రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వహించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పనితీరు మెరుగుపడకపోతే ఆయా సంస్థల పరిధిలోని జిల్లాలను తగ్గించడంతోపాటు.. అవసరమైతే పూర్తిగా తప్పించి ఇతర కంపెనీలకు అప్పగిస్తామని హెచ్చరించారు.
Tummala Nageswara Rao | రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వహించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పనితీరు మెరుగుపడకపోతే ఆయా సంస్థల పరిధిలోని జిల్లాలను తగ్గించడంతోపాటు.. అవసరమైతే పూర్తిగా తప్పించి ఇతర కంపెనీలకు అప్పగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్‌కూ ఈ విషయంలో మినహాయింపు ఉండదన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయిల్‌పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి కే సురేంద్ర మోహన్, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగు విస్తరణ పురోగతి, మొక్కల లభ్యత, రైతులకు సాంకేతిక సహాయం, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం తదితర అంశాలను సమీక్షించారు.
85 వేల ఎకరాల లక్ష్యం.. 17,090 ఎకరాల్లోనే సాగు
ఈ ఏడాది రాష్ట్రంలో 85వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తుమ్మల తెలిపారు. ఇప్పటివరకు 17,090 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైందని, అంటే లక్ష్యంలో సుమారు 20 శాతమే పూర్తయిందని చెప్పారు. ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తున్నప్పటికీ కంపెనీల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్న సమయంలో కంపెనీలు వెనుకబడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సాగు విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చామని, అయినా కొన్ని సంస్థల పనితీరులో మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు.
నోటీసులు ఇచ్చినా మార్పు లేదు
లక్ష్య సాధనలో వెనుకబడిన సంస్థలకు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలోని లోహియా కంపెనీకి, గద్వాల, నారాయణపేట, జనగామ జిల్లాల్లో పనిచేస్తున్న ఆయిల్‌ఫెడ్‌కు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలోని తిరుమల కంపెనీ, భూపాలపల్లి, ములుగు, వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రియూనిక్, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని రామ్‌చరణ్ కంపెనీలకు మూడుసార్లు చొప్పున నోటీసులు జారీ చేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని గోద్రెజ్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. విశ్వతేజ్ కంపెనీకి ఐదుసార్లు, కేన్ బయో, పతంజలి సంస్థలకు ఆరుసార్లు చొప్పున, మాట్రిక్స్‌కు ఐదుసార్లు, సువేన్ ఆగ్రోకు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఆశించిన పురోగతి కనిపించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనితీరు లేకుంటే పరిధి కుదింపు
గతంలోనే పతంజలి, లోహియా, కేన్ బయో, మాట్రిక్స్ కంపెనీల పరిధిలోని కొన్ని జిల్లాలను తొలగించి ఇతర సంస్థలకు అప్పగించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇకపై కూడా లక్ష్యాలు సాధించని సంస్థల జిల్లాల పరిధిని తగ్గించడమే కాకుండా.. అవసరమైతే పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. మెరుగైన పనితీరు చూపే కంపెనీలకు అదనపు జిల్లాలను అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆయిల్‌ఫెడ్ కూడా మినహాయింపు కాదని తుమ్మల తేల్చిచెప్పారు. పనితీరు మెరుగుపడకపోతే ఆ సంస్థ పరిధిలోని జిల్లాలను ఇతర సంస్థలకు లేదా కొత్తగా ఎంపిక చేసే కంపెనీలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మొక్కల కొరత రానివ్వొద్దు
ఆయిల్‌పామ్ మొక్కల సరఫరాపైనా మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆగస్టులో మొక్కల కొరత ఏర్పడే అవకాశం ఉన్న కంపెనీలు ముందుగానే ఇతర సంస్థల నుంచి మొక్కలను కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు మొక్కలు కోరిన వెంటనే సరఫరా చేసే స్థాయిలో కంపెనీలు సిద్ధంగా ఉండాలని, మొక్కల కొరత పేరుతో రైతులు వేచి చూసే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.
రైతులకు సాంకేతిక సహాయం తప్పనిసరి
కంపెనీల ఫీల్డ్ సిబ్బంది గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండాలని తుమ్మల సూచించారు. ఆయిల్‌పామ్ సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ తదితర అంశాల్లో రైతులకు నిరంతరం సాంకేతిక సూచనలు అందించాలని చెప్పారు. రైతుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేలా క్షేత్రస్థాయిలో వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనుల్లో ఇకపై జాప్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. యూనిట్లు అందుబాటులోకి వస్తే రైతుల రవాణా భారం తగ్గడంతోపాటు పంటను సకాలంలో ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా ప్రాసెసింగ్ సదుపాయాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీలను ఆదేశించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు



