త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | గుండు, అర‌గుండు క‌లిసి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ప‌న్నేండ్ల కాలంలో తెలంగాణ‌కు ఏమైనా ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించారా..? అని నిల‌దీశారు. రాష్ట్రానికి హ‌క్కుగా రావాల్సిన నిధులు త‌ప్ప అద‌నంగా ఏం నిధులు మంజూరు చేశారో చెప్పాల‌ని సీఎం డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Feb 9, 2026, 5.51 pm IST

CM Revanth Reddy | గుండు, అర‌గుండు క‌లిసి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

42 పైస‌లు తిరిగి ఇస్తున్నారంటే అది మ‌న హ‌క్కు..!
రాష్ట్రానికి అద‌నంగా నిధులు తెచ్చారా..?
ఏ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా..?
ఉత్త‌రాది రాష్ట్రాల‌కు అద‌నంగా నిధులు..!
ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ట్ల తీవ్ర వివ‌క్ష‌..!
గ‌ల్లీ ఎల‌క్ష‌న్‌కు మోదీకి ఏం సంబంధం..!
మోదీ వ‌చ్చి మోరీ తీస్తారా..?
గుండు, అర‌గుండు క‌లిసి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు..
తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ప‌న్నేండ్ల కాలంలో తెలంగాణ‌కు ఏమైనా ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించారా..? అని నిల‌దీశారు. రాష్ట్రానికి హ‌క్కుగా రావాల్సిన నిధులు త‌ప్ప అద‌నంగా ఏం నిధులు మంజూరు చేశారో చెప్పాల‌ని సీఎం డిమాండ్ చేశారు. దేశంలోనే అత్య‌ధికంగా ప‌న్ను చెల్లిస్తున్న ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం చేస్తూ.. ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ప్రాజెక్టుల‌ను త‌ర‌లించి.. అద‌నంగా నిధులు మంజూరు చేస్తున్నార‌ని సీఎం మండిప‌డ్డారు. అస‌లు గ‌ల్లీ ఎల‌క్ష‌న్‌కు మోదీకి ఏం సంబంధం..? మోదీ వచ్చి మోరీ తీస్తారా? మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టిన‌ట్టు గుండు అర‌గుండు క‌లిసి ప్ర‌జ‌ల‌ను మోసం చేయడం స‌మంజ‌స‌మా..? ఓట్లు వేయించుకోవడం.. సీట్లు తెచ్చుకోవడం తప్ప బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో మీడియాతో సోమ‌వారం సాయంత్రం మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పును ఇచ్చే ప‌ట్ట‌ణ ప్రాంత ఓట‌రు మ‌హాశ‌యులు వాళ్ల క‌ళ్ల ముందు ఉన్న గ‌తం, భ‌విష్య‌త్‌ను అంచ‌నా చేసుకోని తీర్పు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి. ఈ ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌ధానంగా త్రిముఖ పోటీ జ‌రుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, గ‌త ప‌దేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అదే విధంగా నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మ‌ధ్య పోటీ ఉంది. అక్క‌డ‌క్క‌డ మిగ‌తా పార్టీలు ఉన్న ఈ మూడు పార్టీల మ‌ధ్య ఎన్నిక‌ల వాతావ‌ర‌ణ మోహ‌రించి ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ఏది..?

2014లో పాలమూరు సభలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామ‌ని మోదీ హామీచ్చారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ అంశాన్ని ప్రస్తావించి జాతీయ హోదా ప్రకటిస్తారనుకున్నాం. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆదిలాబాద్‌కు ప్రచారానికి వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎక‌రాల‌కు సాగునీరు, తాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసేందుకు సహకరిస్తామని ప్రకటిస్తారని అనుకున్నాం. కానీ ఫడ్నవీస్ మమ్మల్ని అవమానించి ప్రజలను ఓట్లు వేయాలని కోరారని రేవంత్ పేర్కొన్నారు.

50 మంది కార్పొరేట‌ర్ల‌ను గెలిపిస్తే ఉచిత స‌ల‌హాలా..?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో గ‌తంలో వ‌ర‌దలు వ‌చ్చిన‌ప్పుడు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఆటోలు, కార్లు, మోటారు బైక్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లతో పాటు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌న్నీ నీట మునిగాయ‌ని బాధితులు తెలిపారు. దాంతో కారు పోతే కారు, ఆటో పోతే ఆటో, బైక్ పోతే బైక్‌, టీవీలు, ఫ్రిజ్‌లతో పాటు వంట సామాగ్రి ఇస్తాం.. మోదీని అడిగి ఆదుకుంటామ‌ని బండి సంజ‌య్ ప్ర‌చారం చేశారు. కిష‌న్ రెడ్డి కూడా ఆమోదించారు. కానీ నేటి వ‌ర‌కు ఆ ఊసేలేదు. ముంపున‌కు కార‌ణ‌మైన మూసీ ప్ర‌క్షాళ‌న కోసం రూ. 10 వేల కోట్లు తెచ్చి పున‌రుద్ధ‌రిస్తామ‌ని గ‌త జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించారు. వారి మాట‌లు న‌మ్మి 150 కార్పొరేట‌ర్ల‌కు గానూ 50 మంది బీజేపీ కార్పొరేట‌ర్ల‌ను గెలిపించారు. ఎన్నిక‌ల అనంత‌రం హామీల‌పై నిల‌దీస్తే.. అవ‌న్నీ ఇన్సూరెన్స్ ద్వారా వ‌స్తాయ‌ని బండి సంజ‌య్ ఉచిత స‌ల‌హా ఇచ్చారు. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రెకమెండేషన్ ఇచ్చినట్లు బండి సంజయ్ తీరు ఉంది. ప్రజలు హామీల గురించి అడిగితే ఇన్స్యూరెన్స్ ఉంది అని బండి సంజయ్ చెప్పాలా..? కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలను, ఓటర్లను అవమానించడం కాదా? అని సీఎం మండిప‌డ్డారు.

ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ట్ల తీవ్ర వివ‌క్ష‌..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామంటున్నారు.. ఇది న‌మ్మ‌శ‌క్య‌మేనా..? కేంద్రం తెలంగాణ‌కు రూ. 20 ల‌క్ష‌ల కోట్ల నిధులు ఇచ్చింద‌ని కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి అంటున్నారు. ఇంకో మంత్రి వ‌చ్చి ల‌క్ష‌ల కోట్లు ఇచ్చామ‌ని అంటున్నారు. వీరి ప్ర‌క‌ట‌న‌ల‌ను చూసిన త‌ర్వాత కేంద్రం నుంచి ఎన్ని నిధులు వ‌చ్చాయ‌ని సీఎస్‌ను అడిగాను. ప్లానింగ్ క‌మిష‌న్ రెక‌మెండేష‌న్ ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి చెల్లిస్తున్న ప‌న్నుల్లో రాజ్యాంగ‌బ‌ద్దంగా ఆయా రాష్ట్రాల‌కు తిరిగి నిధులు రాబ‌ట్టుకునే హ‌క్కు ఉన్న‌ది. జ‌నాభా ప్ర‌తిపాదిక‌న‌, ఇత‌ర ప్ర‌తిపాదిక‌న కేంద్రం నిధుల‌ను విడుద‌ల చేస్త‌ది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి చెల్లించే ప్ర‌తి రూపాయికి 42 పైస‌ల‌ను వెన‌క్కి పంపుతుంద‌ని సీఎస్ చెప్పారు. క‌ర్ణాట‌క రూపాయి చెల్లిస్తే తిరిగి 16 పైస‌లు ఇస్తుంది కేంద్రం. త‌మిళ‌నాడుకు 26 పైస‌లు, కేర‌ళ‌కు 49 పైస‌లు తిరిగి చెల్లిస్తున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ట్ల తీవ్ర వివ‌క్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ క‌మిష‌న్ అంచ‌నాలు వేయ‌డంలోనే త‌ప్పిదం జ‌రుగుతుంద‌ని అధికారులు చెప్పిన‌ట్లు సీఎం వివ‌రించారు.

8 మందిని గెలిపిస్తే.. 42 పైస‌లు తిరిగి ఇవ్వ‌డ‌మా..?

అదే బీజేపీ అధికారంలో ఉన్న బీహార్ ఒక్క రూపాయి చెల్లిస్తే 6.6 పైస‌లు కేంద్రం నుంచి తిరిగి వ‌స్తున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి 2.9 పైస‌లు, యూపీకి 2.3 పైస‌లు విడుద‌ల చేస్తుంది. మ‌రి క‌ర్ణాట‌క, త‌మిళ‌నాడు, కేర‌ళ, తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని.. ఏరోజైనా మోదీని, కేంద్రాన్ని, ప్లానింగ్ క‌మిష‌న్, నీతి ఆయోగ్‌ను ప్ర‌శ్నించారా..? ఈ వివ‌క్ష‌ను స‌వ‌రించండి స‌రిద్దిదండి అని మాట్లాడారా..? మ‌న రూపాయి మ‌న‌కు ఇచ్చిన ఎన్నో నిధులు రావాలి. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని మోదీ వ‌ద్ద తాక‌ట్టు పెట్టిన‌ట్టు మాట్లాడ‌డం న్యాయ‌మా..? 8 మంది పార్ల‌మెంట్ స‌భ్యుల‌ను గెలిపిస్తే ఒక్క రూపాయికి 42 పైస‌లు తిరిగి ఇవ్వ‌డ‌మా..? అని రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్ర‌త్యేకంగా నిధులు తెచ్చారా..?

కేంద్రానికి ద‌క్షిణాది రాష్ట్రాలు అత్య‌ధికంగా ప‌న్నులు చెల్లిస్తున్నాయి. దేశంలో వ‌సూలు చేసే ప‌న్నుల్లో 40 శాతానికి పైగా తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. కానీ బీహార్, గుజ‌రాత్ రాష్ట్రాల‌కు ప్రాజెక్టుల‌ను త‌ర‌లించుకుపోతున్నారు. రాజ్యాంగబద్దంగా ఆటోమోడ్‌లో రాష్ట్రాలకు వచ్చే నిధులు అవే వస్తాయి. దీనికి వీళ్లు చేసిందేం లేదు.. వీళ్ల రికమెండేషన్లు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారంతో తెలంగాణకు ఏ ఒక్కటీ ఇవ్వలేదు. ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేదు. మూసీకి అదనంగా గ్రాంటు తీసుకురాలేదు. మెట్రోకు నిధులు తీసుకురాలేదు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక నిధులు తేలేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్‌ను, సెమీ కండక్టర్ ప్రాజెక్టులను రాకుండా చేశారు. పన్నెండేళ్ల‌ల్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదైనా నిధులు తెచ్చారా? కనీసం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు తెచ్చారా..? ఖమ్మం వరదల సమయంలోనూ అదనంగా నిధులు ఇవ్వలేదు. వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ నిధులు కూడా రాష్ట్రం నుంచే చెల్లించాం. ఇప్పుడు మోదీని చూసి ఓటు వేయాలని అంటున్నారు. గల్లీ ఎలక్షన్‌కు మోదీకి ఏం సంబంధం.. మోదీ వచ్చి మోరీ తీస్తారా? మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టిన‌ట్టు గుండు అర‌గుండు క‌లిసి ఇలాంటి మాట‌లు చెప్ప‌డం స‌మంజ‌స‌మా..? ఓట్లు వేయించుకోవడం.. సీట్లు తెచ్చుకోవడం తప్ప బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

తెలంగాణ‌కు ఒక్క‌టే ఎయిర్‌పోర్టు.. అదే ఏపీలో..?

రాష్ట్రంలో వ‌ర‌ద‌లు వ‌చ్చి 10 వేల కోట్ల న‌ష్టం జ‌రిగితే 10 సార్లు మోదీని క‌లిశాను. రేవంత్ రెడ్డి మోదీకి అమ్ముడుపోయిండ‌ని ఆరోప‌ణ‌లు చేసినా.. సీఎంగా నా బాధ్య‌త అని చెప్పి.. ఖ‌మ్మం, హైద‌రాబాద్ న‌గ‌రానికి నిధులు ఇవ్వాల‌ని అడిగాను. ఒక్క రూపాయి అద‌నంగా సాయం చేశారా..? 20 సార్లు తిరిగి ఆదిలాబాద్, వ‌రంగ‌ల్‌కు ఎయిర్‌పోర్టు తీసుకొచ్చాను. ఏపీలో క‌ర్నూల్, విజ‌య‌వాడ, రాజ‌మండ్రి, క‌డ‌ప‌, తిరుప‌తి, పుట్ట‌ప‌ర్తి, వైజాగ్‌లో ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఇంకా అద‌నంగా వ‌స్తున్నాయి. క‌ర్ణాట‌క, మ‌హారాష్ట్ర‌లో లెక్క‌లేన‌న్ని ఉన్నాయి. తెలంగాణ‌కు శంషాబాద్‌కు ఎయిర్‌పోర్టు ఒక్క‌టి మాత్ర‌మే. ఉన్న బేగంపేట్ ఎయిర్‌పోర్టులో విమానాలు కూడా దిగ‌డం లేదు. ఈ 12 ఏళ్ల కాలంలో తెలంగాణ‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దామ‌ని బాధ్య‌త తీసుకున్నారా..? ప్ర‌త్యేకంగా నిధులు ఇస్తే మీరు సాధించిన‌ట్టు.. 42 పైస‌లు ఇస్తే నిధులు ఇచ్చిన‌ట్టు కాదు అది మ‌న హ‌క్కు అని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement