త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Chit Chat | సర్‌లో ఓటు పోతే ఇందిరమ్మ ఇల్లు రాదు.. రేషన్ కార్డు కట్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే హరీశ్ రావుకు కొన్నాళ్లు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

J

Telangana | Published On Jul 23, 2026, 5.45 pm IST

Revanth Reddy Chit Chat | సర్‌లో ఓటు పోతే ఇందిరమ్మ ఇల్లు రాదు.. రేషన్ కార్డు కట్
Advertisement
  • అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
  • కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌కు తెలియకుండా వందల కోట్లు హరీశ్ రావు తీసుకున్నారని సీఎం సంచలన ఆరోపణ
  • ఆ అవినీతి కారణంగానే హరీశ్ రావుకు కొన్నాళ్ల పాటు నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కనపెట్టారని వ్యాఖ్యలు
  • ప్రాజెక్టు డ్యామేజీకి సంబంధించి ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికలు ఉన్నా, హరీశ్ రావు అతి తెలివిగా మాట్లాడుతున్నారని మండిపాటు

Revanth Reddy Chit Chat | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవినీతి వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో నిర్వహించిన చిట్ చాట్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao), బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ముడుపులు చేతులు మారాయని, ఆ కారణంగానే హరీశ్ రావును కేసీఆర్ కొన్నాళ్ల పాటు పక్కన పెట్టారని రేవంత్ బాంబు పేల్చారు.

కేసీఆర్‌కు తెలియకుండా వందల కోట్లు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్‌గా (Irrigation Minister) ఉన్న సమయంలో హరీశ్ రావు కన్నెపల్లి పంపుహౌస్ (Kannepalli Pumphouse) నిర్మాణం చేపట్టారని సీఎం గుర్తుచేశారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. అంతేకాకుండా, అప్పటి సీఎం కేసీఆర్‌కు తెలియకుండానే హరీశ్ రావు వందల కోట్ల రూపాయల కమీషన్లు తీసుకున్నారని, ఈ విషయం తెలుసుకున్న తర్వాతే ఆయనకు కొంతకాలం పాటు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పిచ్చి వేషాలేస్తే మెంటల్ ఆసుపత్రికే

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (Medigadda), కన్నెపల్లి పంపుహౌస్ పరిస్థితిపై హరీశ్ రావు చేస్తున్న కామెంట్స్‌పై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తివేశామని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ (NDSA) చైర్మన్, పీసీ ఘోష్ కమిటీ నివేదికల్లో కాళేశ్వరం డ్యామేజీపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. "ఇన్ని వాస్తవాలు కళ్ల ముందు ఉంటే, హరీశ్ రావు అతి తెలివితో మాట్లాడుతున్నారు. ఇలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే జనాలు ఆయన్ను మెంటల్ హాస్పిటల్‌లో (Mental Hospital) చేరుస్తారు" అని సీఎం ఘాటుగా హెచ్చరించారు. ఈ అవినీతిపై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించామని, చట్టబద్ధమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు.

ఓటర్ల ప్రక్షాళన (SIR).. అప్రమత్తంగా ఉండాలి

ఇదే చిట్ చాట్‌లో రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ (SIR - Special Intensive Revision) ఓటరు ప్రక్షాళన ప్రక్రియపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అయితే, బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నాయని ఆరోపించారు.

"ఓటు పోతే జీవితం పోయినట్లే. ఓటు లేకపోతే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ వంటి సంక్షేమ పథకాలు (Welfare Schemes) ఆగిపోతాయి. కాబట్టి ప్రక్షాళన పేరుతో అమాయకుల ఓట్లు గల్లంతు కాకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA), పార్టీ కార్యకర్తలు తమ గ్రామాల్లోనే ఉండి అప్రమత్తంగా వ్యవహరించాలి" అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తనకు రెండు ఓట్లు ఉన్నాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిబంధనల ప్రకారమే తాను కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని కొడంగల్‌కు ఓటును బదిలీ చేసుకున్నానని సీఎం క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే లోపల వేయిస్తానని హెచ్చరించారు.

Advertisement
Advertisement