త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి స‌మ‌గ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, జాతీయ డ్యామ్‌ భద్రతా అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నుంచి స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు కోరాలని సూచించారు.

P

Telangana | Published On Jul 24, 2026, 9.45 pm IST

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి స‌మ‌గ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, జాతీయ డ్యామ్‌ భద్రతా అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నుంచి స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు కోరాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే ఇప్పటి వరకు మూడు బ్యారేజీలను ఫ్రీ-ఫ్లో విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో నీటి నిల్వ, పంపింగ్‌ అంశాలపై రాజకీయాలు లేదా ఊహాగానాల ఆధారంగా కాకుండా, నిపుణుల లిఖితపూర్వక సిఫారసులు, పూర్తి సాంకేతిక నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు పంపే నివేదికలో ఎన్‌డీఎస్‌ఏ సిఫారసులు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదికలు, గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) పరీక్షల ఫలితాలు, రాఫ్ట్‌ ఫౌండేషన్‌ కింద గుర్తించిన ఖాళీల (క్యావిటీస్‌) వివరాలతో పాటు అన్ని సాంకేతిక ఆధారాలను జతచేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అన్నారం బ్యారేజీ రాఫ్ట్‌ ఫౌండేషన్‌ కింద కూడా క్యావిటీస్‌ ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కాన్సెప్ట్‌ డిజైన్‌ ఈ నెలాఖరులోగా, ప్రాథమిక వ్యయ అంచనాలు సెప్టెంబర్‌ మధ్య నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అదనపు సాంకేతిక విశ్లేషణలు మరో రెండు వారాల్లో పూర్తికానున్నట్లు తెలిపారు.

ప్రస్తుత వర్షాకాలంలో కేవలం నీరు ప్రవహిస్తోందనే కారణంతో పంపింగ్‌ చేపట్టడం సాధ్యం కాదని, తగిన నీటి మట్టం లేకుండా పంపింగ్‌కు ప్రయత్నిస్తే నిర్మాణ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ప్రతి నిర్ణయం శాస్త్రీయ ప్రమాణాలు, ఇంజినీరింగ్‌ విశ్లేషణలు, నిపుణుల సిఫారసుల ఆధారంగానే ఉంటుందని, ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ శ్రీధర్‌, టన్నెల్‌ నిపుణుడు కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా, జాయింట్‌ సెక్రటరీ కె.శ్రీనివాస్‌తో పాటు పలువురు సీనియర్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement